గుంతలు నింపే నిధులేవీ?
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:30 AM
నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెనలు.. మరమ్మతుకు నోచుకోని రహదారులు, పాత బ్రిడ్జిలు.. ఆ పనులు మొదలై ఆగిపోయిన రోడ్లు.. ఇవన్నీ కూడా మరమ్మతులెప్పుడు అంటూ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి!
మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 3వేల కి.మీ.. కంకర తేలి ప్రమాదకరంగా మారిన ఆర్‌అండ్‌బీ రోడ్లు
దాదాపు రూ.1,500 కోట్లు మంజూరు చేస్తే తప్ప పనులు పూర్తవ్వవు
మరమ్మతుల పాత బకాయిలే రూ.1,200 కోట్లు
సగం చెల్లించినా పనులు
మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్ల రెడీ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో అధ్వాన్నం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెనలు.. మరమ్మతుకు నోచుకోని రహదారులు, పాత బ్రిడ్జిలు.. ఆ పనులు మొదలై ఆగిపోయిన రోడ్లు.. ఇవన్నీ కూడా మరమ్మతులెప్పుడు అంటూ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి! రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల మధ్య వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మరమ్మతులు మొదలుపెట్టినా కంకర వేసి వదిలేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో రోడ్ల పనులకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసినా ఇంకా పనులే మొదలుకాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల కి.మీ మేర రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు ఓ నివేదిక రూపొందించారు. ఈ పనులకు దాదాపు రూ.1,500 కోట్లను వెచ్చిస్తే చాలా వరకు రోడ్లన్నీ బాగవుతాయని పేర్కొన్నారు. గతంలో కాంట్రాక్టర్లు చేసిన మరమ్మతులకు సంబంధించి రూ.1,200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో సగంమేర చెల్లించినా పనులు మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తిగా ఉన్నారు. అయితే రూ.10 లక్షలలోపు బకాయిలు ఉన్న వారికి మాత్రం మొత్తంగా రూ.120 కోట్లు చెల్లించారు. తమకు కూడా బిల్లులు చెల్లించాలని సర్కారును మిగతా కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్-1లో రూ.12,063.43 కోట్ల నిధులతో దాదాపు 6,092 కి.మీ మేర రోడ్లను హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది టెండర్ల దశలో ఉంది. ఈ పనులు మొదలయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని అధికారికవర్గాలు చెబుతున్నాయి. ఈలోపు వానాకాలం రానుంది. వర్షాకాలంలోపు రోడ్లకు మరమ్మతులు చేయకపోతే గుంతలు మరింత పెరిగి.. కంకర తేలిపోయి.. రోడ్లు ఇంకా పాడవుతాయి.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రకు వెళ్లే మార్గంలో 5 కి.మీ పరిధిలో రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. బోధ్, తలమడుగు, భీంపూర్, తాంసి, సాత్నాల, బేల ప్రాంతాల్లోని రోడ్లు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు.
ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు క్రాస్‌రోడ్ వరకు ఉన్న 70 కి.మీ రోడ్డు గుంతలమయంగా మారింది. దీనిని హ్యామ్ కింద గుర్తించినా పనులు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం నుంచి మంగపేట వరకు ఉన్న సుమారు 15 కి.మీ మేర రోడ్డు అధ్వాన్నంగా తయారైంది.
వనపర్తి జిల్లాలో వనపర్తి నుంచి పెబ్బేరు 10కి.మీ గోపాల్‌పేట- తూడుకుర్తి రోడ్డు-10 కి.మీ, వనపర్తి-చిట్యాల- 2.5కి.మీ, మానాజీపేట రోడ్డు-7 కి.మీ, బుసిరెడ్డిపల్లి రోడ్డు-10 కి.మీ, పుల్కల్‌చర్ల నుంచి శ్రీరంగాపురం- 3.5 కి.మీ వెళ్లే రోడ్లు ఇబ్బందిగా మారాయి.
జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబా్‌షగూడెం వరకు 6 కి.మీ మేర రోడ్డుకు రెండేళ్ల క్రితం కంకర పరిచినా తారు వేయలేదు.
సంగారెడ్డి జిల్లాలో అల్లాదుర్గం నుంచి జహీరాబాద్ పరిధిలోని మెటల్‌కుంట వరకు 45 కి.మీ మేర రహదారిని 2009లో రెండు లేన్లుగా నిర్మించారు. కొంతకాలం నుంచి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా ధ్వంసమైంది.
కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమైంది. అక్కడక్కడా ప్యాచ్ వర్కులతోనే సరిపె డుతున్నారు.
నారాయణపేట జిల్లాలో మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే 30 కి.మీ మేర నాలుగు వరుసల రోడ్డుకు రూ.210 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంతవరకూ పనులు మొదలవ్వలేదు.
హనుమకొండ జిల్లా పరిధిలో రూ.7.30కోట్లతో 11 రోడ్ల పనులు చేపట్టగా, వీటిలో 10 రోడ్ల పనులు మొదలేకాలేదు. సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) కింద రూ.6.50కోట్లతో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నల్లగొండ జిల్లా తిప్పర్తి-కన్నెకల్- ముకుందాపురం 24 కి.మీ, ఖాతాలగూడెం-గుండ్లపల్లి మధ్య 5 కి.మీ, తుర్కపల్లి-యాచారం మధ్య 15 కి.మీ, చందంపేట్ మండలం పొగిళ్ల- రేకులవలయం 12 కి.మీ, ఇలా మరో 5-6 రోడ్లు అధ్వాన్నంగా మారాయి.
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ పరిధిలో రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల కంకరవేసి వదిలేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంపెంబి మండలంలో అవసరమైన చోట వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నరకానికి నకళ్లు..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ నుంచి కాగజ్‌మద్దూర్, నత్నాయ్‌పల్లి మీదుగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మీదుగా పటాన్‌చెరు వరకు వెళ్లే ప్రధానరోడ్డు దుస్థితి ఇది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. కంకర తేలిన రోడ్లు మీద గుంతల మ
ధ్య ప్రయాణం చేస్తూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కిన్నెరసానిపై ఆరేళ్లుగా నిలిచిన బ్రిడ్జి పనులు
కొత్తగూడెం జిల్లాలో ఆళ్లపల్లి-మామకన్ను మధ్యన కిన్నెరసాని వాగుపై నిర్మించతలపెట్టిన వంతెన పరిస్థితి ఇది! బ్రిడ్జి నిర్మాణానికి 2018-19లో రూ.6కోట్లు మంజూరు చేశారు. పనులు మొదలయ్యాయి. కొన్ని పిల్లర్లు వేశారు. ఓ పిల్లర్ నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఆరేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఈ వంతెన పూర్తయితే 2 మండలాలకు రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది.
