రెండేళ్ల బుడతడి స్టైల్‌కు ఫిదా.. ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య!
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:29 AM
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం వల్ల మంచి పేరు, పాపులారిటీ వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే కొందరికి మాత్రం వీటితోపాటు విలువైనవి కొన్ని దొరుకుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం వల్ల మంచి పేరు, పాపులారిటీ వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే కొందరికి మాత్రం వీటితోపాటు విలువైనవి కొన్ని దొరుకుతాయి. ఈ మధ్య తన స్టైల్‌తో తెగ ట్రెండ్ అవుతున్న ఓ రెండేళ్ల బుడతకూ ఇలా విలువైనదొకటి లభించింది. ఎల్‌కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆ బాలుడిని చదివిస్తామని స్పాన్సర్లు ముందుకొచ్చారు. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
మహారాష్ట్రలోని యావత్మల్‌కు చెందిన రుద్రాంశ్ సింగ్ అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనం కొనుగోలు కోసం హోండా షోరూంకు వెళ్లాడు. కొత్త బైక్ కొంటున్న సందర్భంలో ఆ కుటుంబం ఒక వీడియో తీసుకుంది. అయితే ఆ వీడియోలో బాలుడి స్టైల్ చూపరులను ఆకట్టుకుంది. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఠీవిగా నిలబడ్డాడు ఆ చిన్నోడు. పైగా కళ్లకు అద్దాలు పెట్టడంతో మనోడి లుక్ హీరోలాగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. రుద్రాంశ్ స్టైల్‌కి ఫిదా అయ్యారందరూ. ఆ వీడియోకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు రావడం మొదలైంది. పిల్లాడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. అతణ్ని తెగ మెచ్చుకున్నారు. గంటల్లోనే వీడియో అక్షరాలా 137 మిలియన్ వీక్షణలు సంపాదించింది. ఏకంగా 68 వేల కామెంట్లు సొంతం చేసుకుంది.
చిన్నోడి స్టైల్ యావత్మల్ హోండా షోరూం యజమానులకూ విపరీతంగా నచ్చింది. ఆ షోరూంలో రుద్రాంశ్ తల్లిదండ్రులు బైక్ కొనుగోలు చేసిన సందర్భంలోనే బాలుడి స్టైల్ బయటపడింది. రుద్రాంశ్‌కు ఫ్యాన్‌గా మారిన షోరూం యజమాని ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చారు. ఆ చిన్నారిని చదవించే బాధ్యత ఆయన స్వీకరించారు. ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు తన సొంత డబ్బులతో చదవిస్తానని మాట ఇచ్చారు. ఈ వార్త కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యజమాని ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు.
ఇవీ చదవండి
లాస్ ఏంజిల్స్‌లో పోలీసుపై పిట్ బుల్ దాడి.. మహిళ అరెస్ట్.. వీడియో వైరల్
ఏనుగును వేధించిన స్కూటర్ రైడర్లు.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్!