Share News

ఏనుగును వేధించిన స్కూటర్ రైడర్లు.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్!

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:44 PM

కర్ణాటకలోని నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ మార్గంలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రశాంతంగా ఉన్న ఏనుగుపై రాళ్లు విసిరినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏనుగును వేధించిన స్కూటర్ రైడర్లు.. చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్!
Nagarhole Tiger Reserve

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అటవీ మార్గంలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన ప్రశాంతంగా ఉన్న ఏనుగుపై రాళ్లు విసిరినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మొదట ట్రావెల్ వయనాడ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా.. @ravikeerthi22 అనే యూజర్ ఎక్స్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వన్యప్రాణుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఈ ఘటనపై స్పందించిన పలువురు నెటిజన్లు నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్ అధికారులు, కర్ణాటక అటవీ శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రాళ్లు విసరడం వల్ల ఏనుగు భయాందోళనలకు గురికావడమే కాకుండా, భవిష్యత్తులో మనుషులు, వాహనాలను ప్రమాదంగా భావించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభయారణ్యాల గుండా ద్విచక్ర వాహనాల రాకపోకలపై కూడా కఠిన ఆంక్షలు విధించాలని కొందరు సూచిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతం

Updated Date - Nov 18 , 2026 | 03:31 PM