Share News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతం

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:06 AM

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతం

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. ఓ మసీదులో దాక్కున్న లతీఫ్ భట్‌ను లొంగిపోవాలని భారత భద్రతా బలగాలు విజ్ఞప్తి చేశాయి. అందుకతడు నిరాకరించాడు. తరువాత బలగాలపై లతీఫ్ భట్ కాల్పులు జరపగా.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ ఉగ్రవాది మృత్యువాత పడ్డాడు. దీంతో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది.


కాగా నవంబర్ 11న అఖ్రాన్‌లో సీఆర్పీఎఫ్‌(CRPF) చెక్‌పోస్టుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాయపడిన ఈ దాడిలో లతీఫ్ భట్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీంతో భారత బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉగ్రవాది ఉమర్ నిసార్‌ను దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. ఈరోజు (బుధవారం) లతీఫ్ భట్ ఆచూకీ కోసం కుల్గాంలో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా అతడు ఓ మసీదులో దాక్కున్నట్టు గుర్తించాయి. బయటకు వచ్చి, లొంగిపోవాలని బలగాలు ఆ ఉగ్రవాదికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు వీడియో కాల్ ద్వారా లతీఫ్ భట్‌తో పోలీసులు, ఉన్నతాధికారులు మాట్లాడారు. 'నీకు ఇంకా జీవితం ఉంది.. నువ్వు చాలా చిన్నవాడివి' అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే లతీఫ్ భట్ లొంగిపోయేందుకు నిరాకరించాడు. 'నేను అల్లాహ్‌ను కలవాలనుకుంటున్నాను.. నేను చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ సమాధానమిచ్చాడు. తెల్లవారుజామున 2.45 గంటలకు భద్రతా బలగాలపై ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో లతీఫ్ భట్ హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ స్పందించింది. ‘మీరు పారిపోవచ్చు.. కానీ తప్పించుకోలేరు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.


ఈ వార్తలూ చదవండి

కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..

యోగి x యూపీ సీఈవో

Updated Date - Nov 18 , 2026 | 01:46 PM