Share News

గాజు సీసాలో మ్యాజికల్‌ గార్డెన్‌

ABN , Publish Date - May 31 , 2026 | 09:36 AM

ఇప్పుడంతా మైక్రో ప్రపంచమే. సూక్ష్మంలో మోక్షం కావాలంటున్నారు. ఇంటి తోటలు, మిద్దె తోటలు మెయింటెయిన్‌ చెయ్యలేక... గాజు సీసాల్లోనే కొందరు మొక్కల ప్రపంచాన్ని సృష్టిస్తూ సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తున్నారు.

గాజు సీసాలో మ్యాజికల్‌ గార్డెన్‌
Magical Garden

ఇప్పుడంతా మైక్రో ప్రపంచమే. సూక్ష్మంలో మోక్షం కావాలంటున్నారు. ఇంటి తోటలు, మిద్దె తోటలు మెయింటెయిన్‌ చెయ్యలేక... గాజు సీసాల్లోనే కొందరు మొక్కల ప్రపంచాన్ని సృష్టిస్తూ సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తున్నారు. సీసాల్లో ఉన్న ఈ మ్యాజికల్‌ గార్డెన్స్‌ను ‘టెర్రేరియమ్స్‌’ అంటున్నారు. అంటే... ‘గాజు సీసా తోటలు’. విభిన్నమైన ఈ మొక్కల ప్రపంచం ఎలా ఉంటుందంటే...

రుతుపవనాలు వస్తున్నాయంటే... హృదయంలో చిరుజల్లుల సవ్వడులు వినిపిస్తాయి. తనువంతా ఆహ్లాదం చిగురిస్తుంది. ఇంటి పరిసరాల్లో రకరకాల పూలు, పండ్ల మొక్కల్ని పెంచుకోవాలని ఆశపడతారు చాలామంది. అయితే ఈ మైక్రో జగత్తులో అంత సమయం, స్థలం ఎక్కడిది? అందుకే ‘టెర్రేరియమ్‌’ ట్రెండ్‌ వచ్చేసింది. ఈ ప్రక్రియనే ‘గాజు సీసా తోటలు’ (బాటిల్‌ గార్డెన్స్‌) అంటున్నారు. అక్వేరియంలో చేపల ప్రపంచాన్ని ఏర్పరచినట్టే... టెర్రేరియంలో మొక్కల ప్రపంచాన్ని సృష్టించవచ్చు.


book3.5.jpgసులభ పరిష్కారం...

నగరాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి టెర్రస్‌ గార్డెన్‌లాగే... ‘అర్బన్‌ లివింగ్‌’లో టెర్రేరియమ్స్‌ ఓ ఆచరణాత్మక పరిష్కారం. నగరాలలో నేడు చాలామంది అపార్ట్‌మెంట్స్‌లోనే జీవనం సాగిస్తున్నారు. వాటిల్లో మొక్కల పెంపకానికి స్థలమే ప్రధాన సమస్య. అలాంటివారికి టెర్రేరియమ్స్‌ మంచి చాయిస్‌. తక్కువ నీళ్లు, ఉన్న స్థలంలోనే ఈ గాజు వనాలని పెంచొచ్చు. ప్రారంభంలో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఒకటి, రెండు మొక్కలని చేర్చి టెర్రేరియమ్‌ తయారుచేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో టెర్రేరియమ్‌లకు సంబంధించిన ప్రత్యేక షాపులూ అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కూడా ‘డిఐయూ’ టెర్రేరియమ్‌ కిట్స్‌ అందుబాటులో ఉన్నాయి. గాజు జాడీల్లో ఎంచుకున్న పదార్థాలు, డిజైన్‌ని బట్టి రెండు వేల రూపాయల నుంచి వీటి ధరలున్నాయి.


వివిధ దశలు...

‘ఇప్పటి దాకా మిద్దె- బాల్కనీ తోటలతో పాటు... ఇండోర్‌ మొక్కలు, ఫెంగ్‌షూయి మొక్కలు, బోన్సాయి ... ఇలా ఎన్నో చూశాం. తాజాగా గాజు తోటలు.... ఎప్పుడూ ఇలా కొత్త పదాలని సృష్టిస్తూ ఆకర్షించడం మార్కెటింగ్‌ టెక్నిక్‌’ అనేవారు లేకపోలేదు. కానీ గాజు సీసా తోటల్లో మొక్కల పెంపకం గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఈ వనాలను పెంచడంలో వివిధ దశలున్నాయి.అవేమిటంటే..

  • సీసా ఎంపిక: ఈ తోటలు పూర్తిగా సీసాల్లోనే పెరుగుతాయి. కాబట్టి ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు చిన్న, పెద్ద సైజు... అలాగే వెడల్పు, లోతైన మూతి ఉన్న సీసాను ఎంపిక చేసుకోవాలి. ఏదైనా సరే పరిశుభ్రంగా ఉండాలి.


book3.4.jpg

  • మొక్కలు ముఖ్యం: గాజు సీసాల్లో పెరిగే చిన్న చిన్న మొక్కలనే ఎంచుకోవాలి. రెండుతో మొదలుపెట్టి గాజు జాడీ సైజును బట్టి ఎన్ని మొక్కలనైనా ఎంచుకోవచ్చు. అయితే గాలిలో తేమ, నేల మిశ్రమం, చెమ్మ ఈ మొక్కలన్నింటికీ ఒకే స్థాయిలో అవసరం అయ్యేలా జాగ్రత్తపడాలి.

  • నేల రూపకల్పన: మొక్కలను గాజు జాడీలో పెట్టే ముందు లోపలి అడుగు భాగంలో తగిన నేలను రూపొందించాలి. మొదట రెండు అంగుళాల మేర మట్టిని పరచాలి. ఆ తరవాత చిన్న చిన్న గులక రాళ్లను ఉంచాలి. ఈ రాళ్ల మీద ఓ పొరగా ఉత్తేజిత బొగ్గును వేయాలి. ఈ బొగ్గు గాజు సీసాలోని వాతావరణాన్ని, గాలిని శుభ్రపరుస్తుంది. ఆ తర్వాత సగం జాడీ వరకు మట్టి మిశ్రమాన్ని వేయాలి. ఇది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.


  • మొక్కలు జాగ్రత్తగా నాటాలి: అంతా సిద్ధంగా ఉన్న జాడీలోకి మొక్కల్ని నాటాలి. అయితే ఓసారి ఈ మొక్కల్ని చూసి ఏవైనా కొమ్మలు బయటికి వచ్చినట్టుగా అనిపిస్తే వాటిని ట్రిమ్‌ చేయాలి. గాజు జాడీ మూతి వెడల్పుగా ఉంటే చేత్తో లేదా పరికరాల్ని ఉపయోగించి... మొక్కల్ని నాటేందుకు రంధ్రాలు చేసి... పెద్దగా పెరిగేవి మధ్యలో, చిన్నగా పెరిగేవి అంచుల్లో నాటాలి.

  • జాగ్రత్తగా నీళ్లు పోయాలి: ఈ సీసాల్లో ఎక్కడా బయటికి నీళ్లు వెళ్లేందుకు రంధ్రం ఉండదు కాబట్టి, జాగ్రత్తగా నీళ్లని పోయాలి. ఎక్కువ, తక్కువ కాకుండా, గొట్టం ద్వారా నీళ్లని పోయడం ఉత్తమం. అయితే నేలంతా తడిసిందో లేదో జాగ్రత్తగా చూడటం ముఖ్యం.

  • మూత పెట్టడం మరవొద్దు: ఇలా అన్ని దశలూ అయ్యాక మూతపెట్టాలి. మొదటి వారం రోజులు అలాగే వదిలేయాలి. ఈ కొత్త తోట మెల్లిగా పెరగడం మొదలవుతుంది.


book3.6.jpgబెడ్‌రూమ్‌, హాలు లేదా ఆఫీసు డెస్క్‌ మీద అమర్చిన గాజు తోటల్లో క్రమక్రమంగా అద్భుత దృశ్యం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఆ అడవిలో నిశ్శబ్దంగా గాలి వీస్తుంటుంది. మేఘాలు లేకుండానే వానలు కురుస్తుంటాయి. తేమ పెరిగి, అద్దం మీద పొగ మంచు ఏర్పడి, కాసేపటికి నీటి చుక్కలుగా కురుస్తుంది. కొమ్మలు చిగుర్లు వేస్తాయి. ఆకులు విచ్చుకుంటాయి. పాచి మొక్కలు విస్తరిస్తుంటాయి. సూక్ష్మక్రిములు తమ పని తాము చేసుకుంటూ పోతుంటాయి. మీ నడి ఇంట్లో ఇంత సందడి జరుగుతుంటుంది. వర్ణించలేనంతగా ఈ మ్యాజిక్‌ కళ్లను కట్టిపడేస్తుంది.


book3.3.jpgఆకాశమే హద్దుగా... ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు వివిధ రకాలుగా గాజు తోటలని పెంచుకోవచ్చు. ఇక్కడ సైన్స్‌తో ఆర్ట్‌ కలుస్తూ సూక్ష్మావరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. రెండు రోజుల్లో వాడిపోయే బొకేల స్థానంలో గాజు తోటలని కానుకలుగా అందించే పద్ధతి నేడు ప్రపంచమంతా మొదలైంది. మన దేశమూ దీనికి మినహాయింపు కాదు. సూక్ష్మంలో మోక్షంగా ఈ గాజు తోటలు ఇంటిల్లిపాదిని మ్యాజిక్‌ చేస్తాయనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.


book3.7.jpgఅనేక ప్రయోజనాలు...

టెర్రేరియమ్‌ మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటికీ అందంతో పాటు ఇంటిల్లిపాదికి మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి.

  • ప్రశాంతత: ఒత్తిళ్లు, ఆందోళనను తగ్గించే గుణం మొక్కలకు ఉంటుంది. ఇళ్లల్లోని గాజు సీసా తోటలూ మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. దీనిని అభిరుచిగా ఎంచుకున్న వాళ్లు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతారు.

  • గాలిని శుభ్రపరచడం: గాజు తోటల్లో పెంచే మొక్కలకు గాలిని శుభ్రపరచే గుణాలు ఎక్కువ. గాలిలో ఉండే ఫర్మాల్డిహైడ్‌, బెంజీన్‌, ట్రిక్లోఎథిలీన్‌ లాంటి హానికారక పదార్థాలను ఈ మొక్కలు గ్రహిస్తాయి. అందుకే ఈ మొక్కలు ఉన్న పరిసరాల్లో పరిశుభ్రమైన గాలి ఎక్కువ.


  • నిర్వహణ ఖర్చు తక్కువ: ఈ గాజు తోటలో వాతావరణం స్వయం నియంత్రితంగా ఉంటుంది. కాబట్టి వీటి నిర్వహణకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలాగే రోజూ అధిక సమయం వెచ్చించనక్కర్లేదు. ఈ మొక్కలకు రెండు, మూడు వారాలకోసారి నీళ్లు పోస్తే చాలు. అలాంటి మొక్కలే ఎక్కువగా ఉంటాయి.

  • అందమైన అలంకరణ: పచ్చటి మొక్కలతో ఉన్న ఇళ్లు ఎంత అందంగా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. గదిలో పెరుగుతోన్న గాజు తోటల వల్ల ఇంటి లుక్కే మారిపోతుంది. ఈ మినియేచర్‌ గార్డెన్‌లో మీ అభిరుచి మేరకు మొక్కల్ని పెంచుతూ ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇంటి అలంకరణకు ఇవి మంచి చాయిస్‌.


పాకుడు మొక్కలే అధికం

మనదేశంలో టెర్రేరియమ్‌లలో పెంచే మొక్కలు ఎన్నో ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా- తెరచి ఉండే గాజు తొట్టెలో, గ్రీన్‌హౌజ్‌ వంటి ఏర్పాట్లలో పెంచుతుంటారు. ఈ మొక్కల్లో ప్రసిద్ధిచెందినవి...

  • నరాల మొక్క: ఇంటి మొక్కల్లో మొదటగా వినిపించే పేరు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల ఈనెలతో ఆకు పచ్చని ఆకులు ఇట్టే ఆకర్షిస్తాయి. అందుకే నరాల మొక్క అనే పేరు వచ్చింది.


  • బేబీస్‌ టియర్స్‌: గుండ్రని, మందపాటి ఆకులతో పాకే మొక్క ఇది. ఇళ్లలోపల ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.. వేగంగా, దట్టంగా పెరగడం ఈ మొక్క ప్రత్యేకత. ఈ మొక్కలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి.

  • క్రీపింగ్‌ ఫిగ్‌: చిన్నగా, హృదయాకార ఆకులతో అలరిస్తూ పాకే మొక్క ఇది. ఇంటి లోపల అలంకరణల మొక్కలలో ముందుంటుంది.

  • జేడ్‌: మందంగా, ఆకుపచ్చగా ఉండే ఆకులు ఈ మొక్క సొంతం. వీటికి కండ కూడా ఎక్కువే. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే మొక్క ఇది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా..

ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 31 , 2026 | 09:37 AM