రోజూ 1 కిలోమీటరు నడిస్తే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
ABN , Publish Date - May 31 , 2026 | 07:51 AM
ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజూ కేవలం 1 కిలోమీటరు నడకను అలవాటు చేసుకున్నా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు, అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించడానికి చాలా సులభమైన మార్గం ఉంది. రోజూ కేవలం 1 కిలోమీటరు వాకింగ్ చేసినా శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటు గుండె ఆరోగ్యం నుంచి బరువు నియంత్రణ వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో వ్యాయామానికి సమయం కేటాయించలేని వారు ఎక్కువవుతున్నారు. అలాంటి వారికి వాకింగ్ ఒక సులభమైన పరిష్కారం. సాధారణంగా 1 కిలోమీటరు నడిస్తే వ్యక్తి బరువు, ఎత్తు, నడిచే వేగాన్ని బట్టి సుమారు 60 నుంచి 100 కేలరీల వరకు ఖర్చవుతాయి. వేగంగా నడిస్తే మరింత ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
నడక వల్ల కలిగే ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: రోజూ నడవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది: నడిచేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసుకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగవుతుంది: రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి జీవక్రియ వేగవంతమవుతుంది.
మంచి నిద్రకు తోడ్పడుతుంది: నడక శరీరానికి సహజమైన వ్యాయామంలా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గడంలో ఉపయోగం: సమతుల ఆహారంతో పాటు రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
చిన్న అలవాటు.. పెద్ద ఆరోగ్య ప్రయోజనం
రోజూ 1 కిలోమీటరు వాకింగ్ చిన్నదిగా కనిపించినా, ఆరోగ్యానికి అది అందించే ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటును క్రమం తప్పకుండా కొనసాగిస్తే దీర్ఘకాలంలో వేలాది కేలరీలు ఖర్చవుతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి నడక అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఎబోలా వైరస్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?
For More Latest News