పొదుపు సూత్రం.. తారక మంత్రం
ABN , Publish Date - May 31 , 2026 | 11:51 AM
సగటు ఇల్లాలి నుంచి, కార్పొరేట్ దిగ్గజాల దాకా... ప్రస్తుతం అందరికీ అవసరమైన తారక మంత్రం ‘పొదుపు’.
సగటు ఇల్లాలి నుంచి, కార్పొరేట్ దిగ్గజాల దాకా... ప్రస్తుతం అందరికీ అవసరమైన తారక మంత్రం ‘పొదుపు’. గత రెండేళ్ల ఆర్థికరంగ మార్పులూ, మారిన ఖర్చుల సరళీ, ప్రస్తుత ప్రపంచ పరిణామాల కారణంగా దీని ప్రాముఖ్యం బాగా పెరిగింది. అన్ని దేశాలదీ అదే దారి. పొదుపు సూత్రాలకు, అనుభవాలను రంగరించి... ఆధునికీకరించి... కొత్త సూత్రాలను తయారుచేస్తున్నారు. వాటిలో మనకు అనువైనవి గ్రహించడమే తెలివైన పని. అలాంటి ఆర్థిక మెలకువలే ఈ వారం కవర్‌స్టోరీ...
ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ చాలు... పేద, మధ్యతరగతి బతుకులు తల్లకిందులవ్వడానికి! తీవ్రమైన అనారోగ్యంతో ఇంట్లో ఒక్కరు ఆస్పత్రిపాలైనా కుటుంబం మొత్తం ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలమవుతుంది. దీనికి తోడు పెరుగుతున్న జీవనవ్యయం, ఏటా పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు... ఎంతోకొంత పొదుపు వైపు మళ్లేలా చేస్తున్నాయి. మరోపక్క... యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో దేశం కోసం పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలనీ, ప్రజా రవాణాకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ సాక్షాత్తు మన దేశ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో పొదుపు చర్యలపై విస్తృత చర్చ ఊపందుకుంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే, ఎంతోకొంత పొదుపు చేయడం మరో ఎత్తు. ఈ సంక్షోభ సమయం... ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి సరికొత్త సవాళ్లను విసురుతోంది. దానికి ఆచరణీయమైన స్మార్ట్ పరిష్కారాల కోసం ఎవరైనా పొదుపు సూత్రాలను ఫాలో అవ్వాల్సిందే.
పొదుపు సూర్యోదయం....
భూమ్మీద సూర్యుడు మొదట ఉదయించే జపాన్ సంక్షోభం తలెత్తిన ప్రతీసారి పొదుపు విషయంలో ముందుగా ఉదయిస్తోంది. అందర్నీ అప్రమత్తం చేస్తోంది. జపనీయులు సంప్రదాయ పొదుపు అలవాట్లను, నవీన వ్యూహాలతో సమ్మిళితం చేస్తున్నారు. భౌతిక ‘లెడ్జర్ ట్రాకింగ్’ లాంటి పూర్వ పద్ధతులు కొనసాగుతున్నప్పటికీ, వాటికి ఆధునిక డిజిటల్ సాధనాలను జోడిస్తున్నారు.
అత్యాధునిక కకేబో (డిజిటల్ + మాన్యువల్... హైబ్రిడ్)
జపాన్ ఆర్థిక సూత్రం ‘కకేబో’ అంటే... గృహ ఆర్థిక లెడ్జర్. 120 ఏళ్ల క్రితం కనుగొన్న బడ్జెట్ వ్యవస్థ ఇది. ఇందులో ఖర్చు చేసే అలవాట్లను సమీక్షించుకోవడానికి... ఆదాయ, వ్యయాలను భౌతికంగా ఒక లెడ్జర్లో చేతితో రాస్తారు. ఇప్పుడు చాలామంది ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీవారం ఖర్చులను సమీక్షించాలనే ప్రధానసూత్రం అమలవుతూనే ఉంది.
ఎలా?: నెల ప్రారంభంలో అన్ని ఆదాయాలు, స్థిర ఖర్చులను నమోదు చేయాల్సిందే. పొదుపు లక్ష్యం నిర్దేశించుకోవాలి. జీవన అవసరాలు, కోరికలు (ఐచ్ఛికం), సంస్కృతిపరమైనవి, అనుకోనివి.. ఇలా మన ఖర్చులను నాలుగు ప్రధాన అంశాలుగా (పిల్లర్స్) వర్గీకరించుకోవాలి.
ప్రత్యేకత: ఇది కేవలం ‘ఎలా’ ఖర్చు చేయాలో మాత్రమే కాకుండా ‘ఎందుకు’ వెచ్చించాలో అర్థం చేసుకోవడంపై దృష్టిపెడుతుంది. దీనివల్ల పొదుపు 25 శాతం వరకూ పెరిగే అవకాశముంది.
చిన్న మొత్తాల ఆదా...
జపాన్ ప్రజలు సంప్రదాయ పద్ధతిలో 500 యెన్ నాణేలను ప్రత్యేక పిగ్గీ బ్యాంకులో పొదుపు చేసేవారు. ఇప్పుడా పద్ధతి ఆధునిక రూపంలోకి మారింది. చాలామంది తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన ‘ఫిన్‌టెక్ యాప్’లను వాడుతున్నారు. ఇవి లావాదేవీలను వాటంతట అవే రౌండ్ ఫిగర్‌కు సర్దుబాటు చేసి, ఈ తేడా మొత్తాన్ని పొదుపు చేసేస్తాయి.
ఎలా?: ఉదారణకు ఏదైనా కొంటే 350 యెన్‌లు (మన కరెన్సీలో రూపాయలు) అయ్యాయనుకోండి. యాప్ 400 యెన్‌లు చార్జ్ చేసి, అందులో నుంచి 50 యెన్‌లను డిజిటల్ సేవింగ్స్ వాల్ట్‌లో జమ చేస్తుంది.
ప్రత్యేకత: ఈ ‘గమనించలేని’ ఆదా ద్వారా కొన్ని నెలల్లో గణనీయమైన మొత్తం ఖాతాలో సమకూరుతుంది.
ముందు పొదుపు... తర్వాతే ఖర్చు...
నెలాఖరులో మిగిలిందే పొదుపు చేసే పద్ధతికి బదులుగా జపనీయులు ఆదాయం వచ్చిన వెంటనే పొదుపు మొత్తం పక్కన పెట్టేస్తారు.
ఎలా?: ఆదాయం ఒక్కటే కాదు, దానితో పాటు స్థిర ఖర్చులు, పొదుపు కలిపితేనే- మనం ఖర్చు చేయడానికి అందుబాటులో ఉన్న డబ్బు అవుతుంది.
ప్రత్యేకత: అనుకోకుండా ఎక్కువగా ఖర్చుపెట్టడం ఎవరికైనా సహజమే. దీన్ని నివారించి పొదుపును పెంచడానికి విడిగా బ్యాంకు ఖాతాలను ఉపయోగించవచ్చు.
జీరో వేస్ట్.. ‘మొట్టైనై’
వనరులను గౌరవించడం, వృథాను నివారించడం, ఇప్పటికే ఉన్నవాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం... ఇది జపనీస్ తత్వశాస్త్రంలో ‘మొట్టైనై’గా వ్యవహరిస్తారు. బట్టలూ, ఫర్నిచర్ కోసం జనాదరణ పొందిన సెకెండ్ హ్యాండ్ యాప్‌లూ, స్టోర్లను ఉపయోగించడం ఈ దేశంలో అలవాటు.
ఎలా?: వస్తువులు కొద్దిగా పాతబడి, సరిగా పనిచేయడం లేదని మార్చేస్తుంటారు చాలామంది. కానీ ఈ విధానంలో అలా చేయకుండా... ఆ వస్తువులను మరమ్మతులతో బాగుచేసి ఉపయోగిస్తారు. కొత్త వస్తువు కొనాలంటే.. పాతది పూర్తిగా తీసెయ్యాలనే నిబంధన పెట్టుకోవడం వల్ల అవాంఛనీయమైన, అనవసరమైన కొనుగోళ్లూ, వినియోగమూ తగ్గుతాయి.
ప్రత్యేకత: ఈ పద్ధతిని ఎక్కువమంది అనుసరించడంవల్ల సెకెండ్ సేల్స్ పెరుగుతాయి.
నగదు ఆధారిత బడ్జెటింగ్
డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ జపాన్‌లో చాలామంది రోజువారీ కొనుగోళ్లకు ఇప్పటికీ నగదునే ఇష్టపడతారు. అధిక ఖర్చులను నియంత్రించే ఈ తత్వాన్ని ‘గెంకిన్ షుగి’ అని వ్యవహరిస్తారు.
ఎలా?: ఆహారం, ఇతరత్రా నిర్దిష్ట అవసరాల కోసం చేసే వ్యయం కోసం విడివిడి కవర్లను ఉపయోగించాలి. నెలవారీ నగదు బడ్జెట్‌ను ఆమేరకు విభజించి నగదును సంబంధిత కవర్లలో ఉంచాలి.
ప్రత్యేకత: ఒక ఎన్వలప్‌లో నగదు ఖాళీ అయితే ఆ అవసరం కోసం చేసే ఖర్చు కూడా ముగిసినట్టే! దీనివల్ల బడ్జెట్‌ను మించి దేనికీ ఖర్చు కాకుండా జాగ్రత్తపడొచ్చు.
80 శాతం నియమం...
ఆరోగ్యంపై ఆధారపడిన తత్వమిది (‘హరా హచి బు’). దీని ప్రకారం పొట్ట నిండేలా తినెయ్యకూడదు. కడుపు 80 శాతం నిండేవరకూ మాత్రమే తినేలా ఈ నియమం ప్రోత్సహిస్తుంది.
ఎలా?: బయట తినడం తగ్గించాలి. ఆహార పదార్థాల వృథాను నియంత్రించాలి.
ప్రత్యేకత: ఈ ‘హరా హచి బు’ను క్రమశిక్షణతో పాటిస్తే కుటుంబంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. పైగా డబ్బు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదా అవుతుంది.
వీటిని గమనించారా?
డిజిటల్ హిప్నాసిస్: యూపీఐ చెల్లింపులు పెరిగి, లావాదేవీల్లో నగదు కంటికి కనిపించకపోవడం వల్ల... ఒకరకంగా మనం ఎంత ఖర్చు చేస్తున్నామో గ్రహించని ‘డిజిటల్ హిప్నాసిస్’లోకి వెళ్తున్నామనేది నిపుణుల హెచ్చరిక. అందుకే ప్రతీనెలా యూపీఐ స్టేట్‌మెంట్‌ను విశ్లేషించుకోవాలి. రూ. 10, రూ. 20 ఖర్చులు చిన్నగానే కనపడినా... నెలాఖరుకు ఇవే పెద్ద మొత్తమై పొదుపును దెబ్బతీస్తున్నాయేమో గమనించాలి.

డిజిటల్ ట్రాకింగ్: టీ, కాఫీల దగ్గర్నుంచి కిరాణాసామగ్రి దాకా ప్రతీ ఖర్చునూ ఓ చోట నమోదు చేస్తూ తరచూ గమనిస్తుంటే.. వృథా వ్యయానికి కళ్లెం వేయొచ్చు. ఖర్చులను ట్రాక్ చేయడానికి ఏఐతో పనిచేసే స్మార్ట్‌ఫోన్ యాప్స్ ఉన్నాయి. ‘ఈ నెల మీరు బయట భోజనాలపై 22 శాతం ఎక్కువ ఖర్చు చేశారు’ లాంటి అలర్ట్స్‌ను ఇవి ఇస్తాయి. ఎక్కడ, ఎలా ఎక్కువ ఖర్చు చేస్తున్నదీ స్పష్టత వస్తే వాటిని వీలైనంత నియంత్రించుకోవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ల తనిఖీ: ఒక సర్వే ప్రకారం యువతరంలో చాలామందికి తాము ఎన్ని సబ్‌స్ర్కిప్షన్లు తీసుకున్నదీ పూర్తిగా తెలియదు. మనం వాడని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, జిమ్ సభ్యత్వాలు, యాప్ సబ్‌స్ర్కిప్షన్ల ద్వారా నెలకు వందల రూపాయిలు వృథా అవుతుంటాయి. వాటిని గమనించి రద్దు చేసుకోవాలి.
30 రోజుల నియమం: ఏదైనా ఖరీదైన వస్తువును చూడగానే కొనేస్తున్నారా? ఈసారి అలా కొనాలనిపించినపుడు 30 రోజులు ఆగండి. తర్వాత కూడా అది అవసరం అనిపిస్తేనే కొనండి. తక్షణమే కొనుగోలు చేయాలనే ఆకస్మికమైన కోరిక (ఇంపల్స్ బయ్యింగ్)ను ఇది తగ్గిస్తుంది. విలువైన డబ్బు దుర్వినియోగం కాదు.
క్రెడిట్ కార్డు ఉచ్చు: ఆఫర్లు ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డుతో ఎడాపెడా కొనే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ ఉచ్చులో చిక్కుకుంటే ఆర్థికంగా నష్టపోకతప్పదు. అవసరమైన కొనుగోళ్లలోనూ వీలైనంతవరకూ నగదు వాడకం వల్ల ఖర్చుపై కొంత నియంత్రణ వస్తుంది.
50-30-20 సూత్రం
ఆర్థిక నిపుణులు సూచించే అత్యంత ప్రభావవంతమైన బడ్జెట్ నియమాల్లో నెలవారీ నికర ఆదాయాన్ని మూడు భాగాలుగా చేయాలి. అదే 50-30--20 సూత్రం.
50 శాతం అవసరాలకు: అద్దె, కిరాణా, కరెంటు బిల్లులు, రవాణా
30 శాతం కోరికలకు: సినిమాలు, షాపింగ్, విహార యాత్రలు
20 శాతం పొదుపునకు: జీతం రాగానే ఈ 20 శాతం పక్కన పెట్టెయ్యాలి. తర్వాతే ఖర్చు చేయడం మొదలుపెట్టాలి.
రోజువారీ ఖర్చులను అదుపులో ఉంచే నియమం ఇది. భవిష్యత్తు కోసం విధిగా పొదుపు చేసేలా అలవాటు చేస్తుంది. అవసరాలు 50 శాతం కన్నా ఎక్కువ అవుతున్నాయేమో గమనించాలి. మొదట్లో 50-30--20 కచ్చితంగా అమలు కాకపోవచ్చు. క్రమశిక్షణతో అలవాటు చేసుకోవచ్చు.
అత్యవసర నిధి ఉండాల్సిందే...
జీవితంలో అనుకోని చిక్కులూ, ప్రాణావసరాలూ ఎప్పుడు, ఎలా ముంచుకొస్తాయో ఎవరూ ఊహించలేరు. అందుకే కనీసం ఆరు నెలల ఖర్చులకు సమానమైన మొత్తాన్ని విడిగా ప్రత్యేక ఖాతాలో భద్రపరచుకోవాలి. లేఆఫ్‌లు, పింక్ స్లిప్‌ల ప్రస్తుత క్లిష్టకాలంలోఉద్యోగ నష్టమో, అనారోగ్య సమస్యో ఎదురైతే రక్షణ కవచంలా ఈ నిధి పనిచేస్తుంది.
రివేంజ్ సేవింగ్స్...
జపాన్‌లాగే చైనా కూడా పొదుపు సూత్రాలు పాటించడంలో దిట్ట. విద్య లాంటి దీర్ఘకాలిక అవసరాల కోసం కొంత డబ్బును ‘ఎర్రటి ఎన్వలప్’లో ఉంచే ‘హాంగ్‌బావో’ పద్ధతిని ఈ దేశంలో పాటిస్తారు. ఈ విధానం.. పిల్లల్లో ఆదా చేసే అలవాటును పెంచుతుంది.
అదేవిధంగా చైనాలో యువతీయువకులు ‘రివేంజ్ సేవింగ్స్’ అనే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. అత్యంత క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు పద్ధతులివి. వీటితో ఖర్చులను ట్రాక్ చేయడం, అధిక జీవన వ్యయాన్నీ, ఆర్థిక నష్టాలనూ దీటుగా ఎదుర్కోవడం సాధ్యమవుతోంది.
చైనా యువత పొదుపు కోచ్ లుగా వ్యవహరించడానికి సోషల్ మీడియాలో అపరిచితులతోనో, స్నేహితులతోనో జట్టు కడుతున్నారు. వారు ఒకరినొకరు జవాబుదారీగా ఉంచుకుంటారు. రోజువారీ ఖర్చుల నివేదికలను పంచుకుంటారు. అనవసర కొనుగోళ్లను నివారించడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఈ సమ వయస్కుల ఒత్తిడి (పీర్ ప్రెషర్) పద్ధతి... ఫ్యాషన్ వస్తువులపై అనవసర వ్యయాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. మితిమీరిన వినియోగ జీవన శైలిని తిరస్కరించి, పొదుపునకు ప్రాధాన్యం ఇస్తున్న ధోరణి ఇక్కడి ప్రజల్లో పెరుగుతోంది. కొత్త, అఽధునాతన వస్తువుల కన్నా నిత్యావసర, అధిక ప్రయోజనం కలిగించే వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘జియాన్యు’లాంటి వేదికల్లో సెకెండ్స్‌ను కొంటున్నారు. బయటి ఆహారానికి బదులు.. ఇంట్లో చేసిన భోజనం, కాఫీ.. పని ప్రదేశానికి తీసుకురావడం కొత్త పొదుపు సంస్కృతిలో ముఖ్య భాగమైంది.
సులువైన సూక్ష్మ పొదుపు
ఒకేసారి పెద్దమొత్తంలో పొదుపు చేయడం ఎవరికైనా కష్టమే. అందుకే యువతరం సులభంగా ఉండేలా... రోజువారీ చిన్న పొదుపులను ఆటోమేట్ చేయడానికి యాప్‌లు ఉపయోగిస్తోంది. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోతోంది. అధిక రాబడినిచ్చే పొదుపు ఖాతాకో, మనీ మార్కెట్ ఫండ్‌కో చిన్నమొత్తాలు వాటికవే బదిలీ అవ్వడానికి యాప్‌లను సెటప్ చేస్తున్నారు. చిన్న, క్రమరహితమైన మొత్తాలను ‘హిడెన్ సేవింగ్స్’లో ఉంచుతున్నారు. సులభంగా ఖర్చు చేయలేని విధంగా ఉండేందుకే ఈ ఏర్పాటు!
జీరో బేస్డ్ బడ్జెటింగ్, ట్రాకింగ్...
ఖర్చులపై కచ్చితమైన అదుపు.. ఒకరకంగా పొదుపే. అందుకే రోజువారీ వ్యయాన్ని నిశితంగా ట్రాక్ చేసి, పర్యవేక్షిస్తుంటారు. డబ్బు సరిగా ఎక్కడికి వెళ్తోందో అర్థం చేసుకోవడానికి... చాలామంది ప్రతీ ఖర్చూ రికార్డ్ అయ్యేలా యాప్‌లూ, నోట్‌బుక్‌లను ఉపయోగిస్తున్నారు. నెలాఖర్లో ఆదాయం నుంచి ఖర్చులను తీసివేస్తే సున్నా అయ్యేలా వ్యయాన్ని ప్లాన్ చేసుకుంటారు. దీనిద్వారా ప్రతీ పైసాను ఒక అవసరానికో, పొదుపు లక్ష్యానికో కేటాయించగలుగుతున్నారు.
ఖర్చులూ, వనరులు పంచుకోవడం...
వ్యక్తిగత ఖర్చులను తగ్గించడానికి సామూహికంగా పంచుకునే పద్ధతిని చైనీయులు పాటిస్తున్నారు. ఇందుకు భోజనం, అపార్ట్‌మెంట్ అద్దెలను పంచుకుంటున్నారు. కిరాణాసామగ్రిని పెద్ద మొత్తంలో కొనడం కూడా ఆదా చేయడంలో భాగమే. టాక్సీలకు బదులు ప్రజా రవాణాను ఉపయోగించడం, సైకిల్ ఉపయోగించడం లాంటివీ చేస్తున్నారు.
చిన్నవిగానే కనపడే ఈ ఆచరణలు గృహ డిపాజిట్లలో గణనీయమైన పెరుగదలకు దారి తీశాయి. చాలామంది ఆర్నెల్ల నుంచి ఏడాది జీవన వ్యయాలను ఆదా చేసేలా లక్ష్యం పెట్టుకుంటున్నారంటే.. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చు!
మరికొన్ని దేశాల్లో...
డబ్బు ఆదా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ, సామూహిక పద్ధతులనూ, డిజిటల్ విధానాలనూ పాటిస్తున్నారు. జపాన్, చైనాలతో పాటు ఇతర పొదుపు దేశాల తీరిది...
లాటిన్ అమెరికా: రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ (ఖౖఖిఇఅ) పేరిట అనధికారికంగా, వంతులవారీగా జరిగే పొదుపు ఇది. ఇందులో కొందరు బృందంగా ఏర్పడి సభ్యులందరూ క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తారు. అందులో వరసగా ఒక్కో సభ్యుడు ఆ మొత్తం డబ్బును పొందే వీలుంటుంది. ఇదో నిర్బంధ పొదుపు యంత్రాంగంగా పనిచేస్తుంది.
పశ్చిమ ఆఫ్రికా - కరీబియన్: ఇక్కడ కూడా సామాజిక పొదుపు వ్యవస్థే. ఇందులో భాగంగా స్నేహితులు, సహోద్యోగులు కలిసి డబ్బును సమీకరిస్తారు. సామాజిక జవాబుదారీతనం ద్వారా పొదుపును ప్రోత్సహించే పద్ధతి ఇది. వడ్డీ లేని రుణంలా కూడా ఇది పనిచేస్తుంది.
ఫిలిప్సీన్స్: చిన్నమొత్తాల్లోని నగదును పొదుపు చేయడానికి వెదురుపెట్టె/ఏదైనా మూసివున్న కంటెయినర్ ఉపయోగిస్తారు. తేలిగ్గా నగదు తీసే వీలు లేనందువల్ల అవాంఛనీయమైనఆకస్మిక కొనుగోళ్లను నివారించవచ్చు.
జర్మనీ: చాలామంది జర్మన్లు నగదు చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తారు. క్రెడిట్ కార్డుల వంటివి వాడటం తక్కువ. దీనివల్ల తాము అనుకున్న బడ్జెట్‌కు కట్టుబడటం సాధ్యమవుతుందనేది వారి అనుభవం.
స్పెయిన్, నెదర్లాండ్స్: ఈ దేశాల్లో చాలా కుటుంబాలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకోవడానికి బయట భోజనం చేయడం లాంటి అనవసర ఖర్చులను తగ్గించుకుంటాయి. పకడ్బందీ నెలవారీ బడ్జెట్‌వైపు మొగ్గుతాయి.
డిజిటల్ పరిష్కారాలు
రౌండప్ యాప్స్: లావాదేవీలను ఆటోమేటిక్‌గా సమీప రూపాయి/డాలర్ /పౌండుకు రౌండప్ చేసి, ఆ తేడాను పొదుపు ఖాతాలోకి బదిలీ చేసే యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎవరి ప్రమేయమూ అవసరం లేకుండా పొదుపు దానికదే జరిగిపోతుంది.
సింకింగ్ ఫండ్స్: కారు మరమ్మతులూ, సెలవుల్లో చేయాల్సిన ఖర్చుల కోసం చిన్నమొత్తాలను కేటాయించి పక్కనపెట్టే విధానం. ప్రత్యేక డిజిటల్ బ్యాంకు ఖాతాల ద్వారా దీన్ని నిర్వహిస్తారు. సాధారణ పొదుపు మొత్తాలను వీలైనంతగా ఉపయోగించకుండా ఆపడం దీని లక్ష్యం. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్ లాంటి దేశాల్లో ఇది అమలవుతోంది.
మొబైల్ మనీ: బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు తక్కువుండే ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ వాలెట్లు, గ్రామ పొదుపు ఆధారిత విధానాలున్నాయి. వీటి ద్వారా సామాన్యులు తమ ఫోన్ల ద్వారా సురక్షితంగా పొదుపు చేసుకోవచ్చు.
రేపటి కోసం ఈ రోజు క్రమశిక్షణగా, తెలివిగా వ్యవహరించడమే సరైన పొదుపు స్ఫూర్తి. ఆదా చేయడమంటే డబ్బును ప్రణాళిక ప్రకారం దాచడం మాత్రమే కాదు... అనుకోని ఆపదల్లో ఆర్థిక రక్షణ, రేపటిపై నిశ్చింత, ధీమా, మానసిక ప్రశాంతత.. ఇవన్నీ!
వారం పాటు ఖర్చు ఆపేస్తే...
సోషల్ మీడియాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఓ ట్రెండ్... ‘నో స్పెండ్ వీక్’. అంటే వారం రోజులపాటు అవసరం లేని ఖర్చులు పూర్తిగా ఆపెయ్యడం. అంటే నచ్చిన వస్తువులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, బయటకు వెళ్లి ఫలహారాలు, పానీయాలు తీసుకోవడం, ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడం.. ఇవేవీ ఉండవు. శనివారం ఓటీటీ ‘బింజ్ వాచ్’ ఆపెయ్యడం కూడా ఇందులో భాగమే. వారాంతంలో ఆదివారం నాడు బడ్జెట్‌ను సమీక్షించడం. ఒక వారం క్రమశిక్షణ పాటిస్తే నెలలో పెద్ద మార్పు సాధ్యమనేది దీని వెనకున్న సూత్రం. ఇది మొదట ఒక ఛాలెంజ్‌లా మొదలైనా... క్రమక్రమంగా చాలామందికి క్రమశిక్షణగా మారింది. అలాగే కొన్ని జంటలు ‘బడ్జెట్ డేట్స్’కు మొగ్గు చూపే ఽధోరణి కూడా మొదలైంది. అంటే.. ఖరీదైన రెసారెంట్స్‌కు బదులు హోమ్ మేడ్ డిన్నర్‌కు ప్రాధాన్యం, షాపింగ్ మాల్స్ బదులు పార్కుల సందర్శన!
పొదుపు నేర్పే పుస్తకాలివి...
పొదుపు గురించీ, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ (పర్సనల్ ఫైనాన్స్) గురించీ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్స్‌గా పేరుపొందిన కొన్ని పుస్తకాలున్నాయి. డబ్బు వినియోగం విషయంలో ఇవి మన దృక్పథాన్ని మెరుగుపరుస్తాయి.
సైకాలజీ ఆఫ్ మనీ: ప్రస్తుత కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఈ పుస్తక రచయిత మోర్గాన్ హౌసెల్. డబ్బు సంపాదించడానికి మేధ కన్నా ప్రవర్తన ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడం ద్వారా వచ్చే ఫలితమే పొదుపు అని సూచిస్తుంది.
రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్: పురాతన బాబిలోన్ కథల ద్వారా పొదుపు సూత్రాలను వివరించే ఈ క్లాసిక్ రచయిత జార్జి ఎస్. క్లాసన్. ‘మీ సంపాదనలో కనీసం పందోవంతు మీ కోసమే దాచుకోండి’ అని ప్రబోధిస్తుందీ పుస్తకం.
ఐ విల్ టీచ్ యు టు బి రిచ్: ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా పొదుపును ఎలా సులభతరం చేసుకోవాలో తెలిపే ఈ పుస్తక రచయిత రామిత్ సేథీ. అనవసర విషయాల్లో ఖర్చు తగ్గించి, నచ్చిన విషయాల్లో ధారాళంగా వ్యయం చేసేలా బడ్జెట్‌ను ఎలా రూపొందించుకోవాలో సూచిస్తుంది.
మనీ ఇన్ వన్ లెసన్: రచయిత గావిన్ జాక్సన్. డబ్బు ఎలా పనిచేస్తుంది, పొదుపును ద్రవ్యోల్బణం ఎలా దెబ్బ తీస్తుందన్న అంశాలను సరళంగా వివరించే పుస్తకమిది. ఆర్థిక శాస్త్రం తెలియనివారు కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చు.
ద ఇండెక్స్ కార్డ్: ఆర్థిక ప్రణాళిక అనేది చిన్న ఇండెక్స్ కార్డుపై రాసేంత సరళంగా ఉండాలని చెప్పే ఈ పుస్తక రచయితలు హెలేన్ అండ్ పొలాక్. క్లిష్టమైన గ్రాఫులూ, లెక్కలూ లేకుండానే సామాన్యులు ఎలా పొదుపు చేయొచ్చో పది సూత్రాల ద్వారా వివరించారు.
- సండే డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’
Read Latest AP News And Telangana News And International News And Telugu News