కలుపు మొక్కతో కళాకృతులు
ABN , Publish Date - May 31 , 2026 | 10:37 AM
చెరువు మీద పచ్చగా పరుచుకునే గుర్రపు డెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చెరువు మీద పచ్చగా పరుచుకునే గుర్రపు డెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేపలకు ఊపిరాడనివ్వకుండా, చెరువులను మూసేసి, దోమలకు ఆశ్రయంగా మారుతున్న గుర్రపు డెక్కను తొలగించడానికి... ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం ఆశాజనకంగా ఉండట్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మహిళలు మాత్రం ఈ ‘పచ్చ రాక్షసి’ని బుట్టలు, మ్యాట్‌లు,సంచులుగా మార్చి ఆదాయం పొందుతున్నారు. పర్యావరణ సమస్యను... ఉపాధి అవకాశంగా మలిచిన మహిళా విజయమిది...
కొన్ని ప్రాంతాల్లో నీటి కలుపు, జలకుంభి అని పిలిచే గుర్రపుడెక్క... అత్యంత వేగంగా వ్యాపించే జలమొక్కలలో ఒకటి. ఈ మొక్కలు నీటి మీద చిక్కగా పెరిగి, సూర్యకాంతిని అడ్డుకోవడంతో నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా చేపలు, ఇతర జలజీవులు మరణిస్తాయి. దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దారి తీస్తాయి. అయితే ఈ మొక్కను తొలగించడం కూడా అంత తేలిక కాదు. చిన్న కాడ తెగినా తిరిగి కొత్త మొక్క పెరుగుతుంది. మురుగు నీరు, రసాయనాలు ఎక్కువగా ఉన్న చెరువుల్లో మరింత వేగంగా వ్యాపిస్తుంది. యంత్రాలతో తొలగించినా కొద్దిరోజుల్లోనే మళ్లీ నీటి మీద పరుచుకుంటుంది.
నారగా మార్చి కళాకృతులు...
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం లేళ్లగూడెం మహిళలు వినూత్న ఆలోచన చేశారు. చెరువుల నుంచి గుర్రపు డెక్కను తొలగించడమే కాదు, దాన్నే ముడి సరుకుగా మార్చి కళాఖండాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ‘‘మా ఊరి చెరువుల్లోకి దిగి గుర్రపు డెక్కను ఏరుకొస్తాం. ఆకులు, దుంప తొలగించి... కాడలను వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతాం. తర్వాత అవి నారలా మారతాయి. ఆ నారతో బుట్టలు, యోగా మ్యాట్‌లు, పూలసజ్జలు, కూరగాయల సంచులు, చాక్లెట్ బాక్స్‌లు... ఇలా 80 రకాల వస్తువులు తయారు చేస్తున్నాం. ఇవి ఐదేళ్ల దాకా మన్నికగా ఉంటాయి,’’ అంటున్నారు మహిళలకు శిక్షణ ఇస్తున్న ఊర్వశి. ఆమెతో పాటు 60 మంది మహిళలు కలిసి హైలూమ్ సొసైటీ ఏర్పాటు చేసి ఉత్పత్తులను ఎగ్జిబిషన్లలో విక్రయిస్తున్నారు. ‘గుర్రపు డెక్కతో చేసినవి’ అనే ప్రత్యేక ముద్ర కారణంగా విని యోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.
అస్సాం నుంచి ఆంధ్రాకు...
దేశంలో గుర్రపుడెక్క నారతో వస్తువులు తయారు చేసే విధానం మొదట అస్సాంలో ప్రారంభమైంది. అక్కడి మహిళల పనితీరుతో స్ఫూర్తి పొందిన కృష్ణా జిల్లా డీఆర్‌డీఏ అధికారులు, అస్సాం నిపుణులను ఇక్కడికి రప్పించి... డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పించారు. ‘‘చెరువుల్లో, కాలువల్లో గుర్రపు డెక్కను నిర్మూలించేందుకు ఎన్నో ఏళ్లుగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ పూర్తిగా తొలగించడం సాధ్యం కాలేదు. అదే మొక్కను పెట్టుబడిగా మార్చి, పర్యావరణహిత వస్తువులు తయారు చేయాలనే ఆలోచన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారి నుంచి వచ్చింది. అలా ఇక్కడ శిక్షణ మొదలైంది.’’ అనిడీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్ తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ...
ఈ గుర్రపుడెక్క దక్షిణ అమెరికాకు చెందిన జలమొక్క. మొదట్లో అలంకార మొక్కగా తీసుకువచ్చినా... తర్వాత చెరువులను ఆక్రమించి అదే పెద్ద సమస్యగా మారింది. వేగంగా వ్యాపించే స్వభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్రమాదకర కలుపు మొక్కగా గుర్తించారు. అయితే ఇప్పుడు అదే కలుపు మొక్కను వినియోగించి అనేక కళాకృతులను తయారుచేసి, ఆదాయం పొందుతున్న మహిళలు మిగతావారికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. ‘‘సీఎం గారు మా స్టాల్‌కి వచ్చి ప్రతీ వస్తువును పరిశీలించారు. తయారీ విధానం, లాభ నష్టాలు గురించి అడిగి తెలుసుకున్నారు’’ అని ఊర్వశి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ మహిళలు కేవలం వస్తువులు తయారు చేయడమే కాకుండా, చెరువులను కాపాడటంలో భాగస్వాములవుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కొత్త దారి చూపుతున్నారు. వారి ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోలేదు. గుర్రపు డెక్క వేర్లతో సేంద్రీయ ఎరువులు తయారు చేయడం, బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం, నారతో చీరలు నేయడం వంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు.
గుర్రపు డెక్కతో పలు పనికొచ్చే వస్తువులు తయారుచేస్తూ, వాటి అమ్మకాలతో ప్రస్తుతం ఒక్కో మహిళ నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తోంది. ఆదా యంతో పాటు చెరువులను సంరక్షిస్తున్నామనే తృప్తి వారి కళ్లల్లో కనిపిస్తుంది.
శ్యాంమోహన్, 94405 95858