Share News

అదిరిపోయే ఆకాశ వంతెన

ABN , Publish Date - May 31 , 2026 | 10:07 AM

నగరాల్లో భవన నిర్మాణం ఆకాశాన్ని అంటుతోంది. యాభై, అరవై అంతస్థులపైన తోటలు పెంచడం, స్కైస్ర్కాపర్స్‌ కట్టడం ట్రెండ్‌గా మారింది.

అదిరిపోయే ఆకాశ వంతెన
Skybridge

నగరాల్లో భవన నిర్మాణం ఆకాశాన్ని అంటుతోంది. యాభై, అరవై అంతస్థులపైన తోటలు పెంచడం, స్కైస్ర్కాపర్స్‌ కట్టడం ట్రెండ్‌గా మారింది. ఇటీవలే చైనా ఇంజనీర్లు చోంగ్‌కింగ్‌ ప్రాంతంలో అత్యంత పొడవైన స్కైస్ర్కాపర్‌ని నిర్మించి... ఇంజనీరింగ్‌ అద్భుతాలు చేయడంలో తమను మించిన వారు లేరని మరోసారి రుజువు చేశారు. ఆ విశేషాలే ఇవి...

ఆకాశాన్నంటే భవనాలు ఎన్నయినా ఉండొచ్చు. వాటిపై సౌకర్యాలు కూడా అంతే స్థాయిలో ఉండొచ్చు. అయితే ఒక భవనాన్ని మరో భవనానికి కలుపుతూ ఇటీవల మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు చైనా ఇంజనీర్లు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మాణాలు చేపట్టడంలో చైనాను మించినవారు లేరనేది వాస్తవం. ఇప్పటిదాకా ఎన్నో ఇంజనీరింగ్‌ అద్భుతాలను చేసిన చైనా... నాలుగు ఆకాశహర్మ్యాలపై అడ్డంగా అత్యంత పొడవైన నిర్మాణాన్ని చేపట్టి ఔరా అనిపించింది. చైనా చోంగ్‌కింగ్‌ ప్రాంతంలో ‘ద క్రిస్టల్‌’ పేరుతో ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనలాంటి నిర్మాణం చేపట్టింది. 984 అడుగుల పొడవున్న ఈ స్కైస్ర్కాపర్‌లో అనేక ప్రత్యేకతలున్నాయి.


నాలుగు భవనాలను కలుపుతూ...

సింగపూర్‌ సింబల్‌గా గుర్తింపు పొందిన మెరీనా బే సాండ్స్‌, బీజింగ్‌లో ఉన్న లింక్‌ హైబ్రిడ్‌ల పోలిస్తే ఈ నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యాలపై నిర్మించిన ‘హారిజెంటల్‌ స్కైస్ర్కాపర్‌’ ఇది. ముందుగా 820 అడుగుల ఎత్తైన నాలుగు భవనాలను ఒక వరుసలో నిర్మించారు. తరువాత వాటిపై వంతెనలా స్కైస్ర్కాపర్‌ను నిర్మించారు. ఇది నివాస సముదాయంగా ఉపయోగపడనుంది. పర్యాటకులు సందర్శించే అవకాశం కూడా ఉంది. ఇందులో రెస్టారెంట్లు, అబ్జర్వేటరీ, స్కై గార్డెన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వెన్యూలు, స్విమ్మింగ్‌పూల్‌ ఉన్నాయి. ఈ స్కై స్ర్కాపర్‌ నుంచి చూస్తే యాంగ్జీ, జియాలింగ్‌ నదులు కనువిందు చేస్తాయి.


book4.2.jpgఈఫిల్‌ టవర్‌ కన్నా బరువు...

సాధారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ ప్రభావం దీనిపై పడకుండా ఉండేందుకు ఆధునిక ఇన్సులేషన్‌, వెంటిలేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణంలో 3వేల గ్లాస్‌ ప్యానెళ్లు, 5వేల అల్యూమినియం షీట్లు ఉపయోగించారు. ఈ స్కైస్ర్కాపర్‌ నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్‌ ఫ్రేమ్‌ బరువే 12 వేల టన్నులు. ఇది ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్‌టవర్‌ బరువుతో సమానం. ఇంజనీర్లు ముందుగా స్టీల్‌ ఫ్రేమ్‌లను బిగించి, హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ సిస్టమ్‌ సహాయంతో పైకి పంపించారు. భూకంపం సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నిర్మాణం పడిపోకుండా ఉండేందుకు ఫ్రిక్షన్‌ పెండ్యులం బేరింగ్‌లు అమర్చారు.


దీనివల్ల స్కైస్ర్కాపర్‌ అటూ ఇటూ కదులుతుందే తప్ప పడిపోదు. నిలువుగా ఉన్న ఆకాశహర్మ్యాలపై అటూ ఇటూ జరుగుతుందే తప్ప పడిపోయే అవకాశం ఉండదు. నగరాల్లో పెరుగుతున్న జనాభా సమస్యలకు ఇలాంటి నిర్మాణాలు పరిష్కారంగా నిలుస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ ఆకాశహర్మ్యాన్ని ఇజ్రాయిలీ-కెనడియన్‌ ఆర్కిటెక్ట్‌ మోషే సఫ్డీ డిజైన్‌ చేశారు. సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్‌ను డిజైన్‌ చేసింది కూడా ఆయనే. రాత్రుళ్లు ఈ నిర్మాణం విద్యుద్దీ పాలకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. కొన్ని మైళ్ల దూరం నుంచి కూడా ఇది కనువిందు చేస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా..

ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 31 , 2026 | 10:07 AM