కోతి చేష్టలంటే ఇవే.. రూ.80 వేలు ఎత్తుకుపోయి..
ABN , Publish Date - Nov 14 , 2026 | 08:21 AM
‘కోతి చేష్టలు’ అనే పదబంధం ఎందుకు పుట్టుకొచ్చిందో ఓ మర్కటం చెప్పకుండానే వివరించింది. ఇంతకీ అది ఏం చేసిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యాపారి నుంచి అల్లరి కోతి టోపీ దొంగలించిందని, తరువాత చెట్టుపైకి ఎక్కి నానా యాగీ చేసిందని చిన్నప్పుడు కథలు వినే ఉంటాం. టోపీని తిరిగి తీసుకోవడం కోసం ఆ కథలో వ్యాపారి కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇదే తరహా ఘటన ఒకటి షిమ్లాలో జరిగింది. కాకపోతే ఇక్కడ అల్లరి కోతి దొంగలించింది టోపీని కాదు.. రూ.80 వేలకు పైగా నగదును. ఆ నగరంలో నివసించే ఓ వ్యాపారి బ్యాంక్‌లో జమ చేయడానికి బ్యాగ్‌లో డబ్బులు సర్దుకుని బయలుదేరాడు. అప్పుడే ఓ కోతి వేగంగా అతడి మీదకొచ్చింది. ఆ బ్యాగ్‌లో ఏముందనుకుందో ఏమో.. దాన్ని అపహరించుకుపోయింది. ఎవరికీ అందకుండా చెట్టెక్కేసింది. ఆ బ్యాగ్‌లో రూ.81,800 ఉన్నాయట.
బ్యాగ్ ఎత్తుకుపోవడంతో ఆ మర్కటం ఆగిపోలేదు. వెంటనే ‘కోతి చేష్టలు’ మొదలుపెట్టింది. నొక్కేసిన బ్యాగ్‌లోని కరెన్సీ నోట్లను చెట్టుపై నుంచి కిందకు విసరటం మొదలుపెట్టింది. ఒకో నోటును ఒకో దిశగా పడేసిందా కోతి. కింద పడిన నోట్లను ఏరుకోవటమే వ్యాపారి పనైంది. ఈ నోట్ల వర్షాన్ని చూడడానికి అక్కడ జనాలు గుమిగూడారు. కొందరు వ్యాపారికి సహాయం అందించారు. మొత్తం నోట్లను ఏరుకున్న తరువాత లెక్కపెడితే రూ.1,500 మాత్రమే తక్కువ వచ్చాయట. దీంతో వ్యాపారి హమ్మయ్య అనుకున్నాడు. అయితే కొన్ని నోట్లను కోతి పాడుచేసేసింది. ఆ నోట్లను ఎలాగో బ్యాంక్ స్వీకరిస్తుంది కాబట్టి వ్యాపారి మనసు కుదుటపడింది. అయితే ఈ విచిత్రాన్ని కొంతమంది మొబైల్ కెమెరాలో బంధించారు. తరువాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.
ఇవీ చదవండి
నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు