వేల కోట్ల ఆస్తి.. కానీ భిక్షాటన చేసిన ఎమ్మెల్యే..
ABN , Publish Date - Sep 15 , 2026 | 07:09 AM
ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవి కూడా ఉంది. అయినా ఓ రోజు భిక్షాటన చేశారు. ఇదేదో ‘బిచ్చగాడు’ సినిమా కథ అనుకుంటున్నారా.. కాదు నిజ జీవిత ఘటన
ఇంటర్నెట్ డెస్క్: ఆయన పేరు పరాగ్ షా. ముంబైలోని తూర్పు ఘట్కోపర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు దాదాపు 5 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఓ రోజు ఆయన భిక్షాటన చేశారు. సాధారణ బిచ్చగాడిలాగా వేషం వేసుకుని ఘట్కోపర్ వీధుల్లో తిరిగారు. రోడ్లపైనే భోజనం చేశారు. అక్కడే నిద్రపోయారు. తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జీవితంలో ఒక్కరోజు భిక్షాటనలో గడిపారు.
జైన గురువు నమ్రముని మహారాజ్ ఓ సాయంత్రం పరాగ్ షాకు ఒక విచిత్ర సూచన చేశారు. ఒక రోజంతా భిక్షాటన చేయాలని, బయట ప్రజలు పడుతున్న కష్టాలను, యాతనలను అనుభవించాలని చెప్పారు. గురువు సూచనను పరాగ్ పాటించారు. తన సౌఖ్యాన్ని పక్కనపెట్టి, బిచ్చగాడి అవతారం ఎత్తారు. ఒక బిచ్చగాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్ష అనుభవం పొందారు. కొందరు పరాగ్ షాను చూసి చీదరించుకున్నారు. ఇంకొందరు దూషించారు. మరికొందరు జాలి చూపించారు.
అయితే ఈ ఒక్కరోజు తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని పరాగ్ షా చెబుతున్నారు. భిక్షాటన పూర్తయ్యాక ఆయన ఎమ్మెల్యే లాగా తిరిగి అదే వీధుల్లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘మా గురువు ఆదేశం మేరకు నేను ఇలా చేశా. ఆయన ఏం చెప్పినా నా మంచికే అని నాకు తెలుసు. గురువు చెప్పినట్టు నడుచుకున్నాక నా మనసుకు ఇప్పుడు హాయిగా ఉంది. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అధికారాలు మనిషికి అహంకారాన్ని పెంచుతాయి. అయితే ఇప్పుడు నేను ఆ అహంకారాన్ని జయించాను’ అని ఆయన తెలిపారు. అలాగే రెండు సంఘటనలు తనను షాక్‌కు గురి చేశాయని చెప్పారు. ‘భిక్షాటన చేస్తున్నప్పుడు మా ఇంటి సమీపంలోకి వెళ్తే.. మా వాచ్‌మనే నన్ను తోసేశాడు. అలాగే అందరికీ సహాయం చేస్తున్నానని చెప్పుకునే నా స్నేహితుడు.. నన్ను బిచ్చగాడి గెటప్‌లో చూడగానే తరిమేశాడు’ అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ముంబైలో ఇంకా మంచితనం బతికే ఉందని కొందరు యువకులు తనకు 20 రూపాయల నోట్లు దానంగా ఇచ్చారని పరాగ్ షా వివరించారు.
ఇవి కూడా చదవండి
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
రష్యా, ఉక్రెయిన్‌లు అందుకు అంగీకరించాయి: డొనాల్డ్ ట్రంప్