Share News

నేడు ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు దంపతులు..

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:01 AM

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల మధ్య మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు.

నేడు ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు దంపతులు..
Tirumala Brahmotsavam 2026

తిరుపతి జిల్లా: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల మధ్య మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారు 9 రోజుల పాటు 16 వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్నారు.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు రానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు చంద్రబాబు దంపతులు తిరుమల చేరుకోనున్నారు. రాత్రి 7:40 గంటలకు బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. అనంతరం పట్టువస్త్రాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చంద్రబాబు దంపతులు చేరుకుంటారు. ఆ తర్వాత 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి దర్శించుకోనున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో 2027 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఈరోజు రాత్రి తిరుమలలోనే చంద్రబాబు దంపతులు బస చేయనున్నారు.


బుధవారం ఉదయం 8:40 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. 9:30 గంటలకు గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద రిలయన్స్ సంస్థ విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ట్రికల్ బస్సులను, 10 గంటలకు టీటీడీ నూతనంగా ఆధునికీకరించిన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు పద్మావతి అతిథిగృహంలో టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు దంపతులు బయలుదేరనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వినాయకుడి తలను శివుడు ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

గణేశుడి పూజ చేస్తున్నారా? ఈ తప్పు అసలు చేయకండి

Updated Date - Sep 15 , 2026 | 07:10 AM