గణేశుడి పూజ చేస్తున్నారా? ఈ తప్పు అసలు చేయకండి
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:18 PM
వినాయక చవితి సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పూజలో వివిధ రకాల పత్రాలు, పుష్పాలను సమర్పించినా.. తులసి ఆకులను మాత్రం గణేశుడికి సమర్పించకూడదని అంటారు. అసలు గణపతి పూజలో తులసిని ఎందుకు సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గణేశుడికి సంబంధించిన ఎన్నో పురాణ కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో గణేశుడు, తులసి దేవికి సంబంధించిన కథ ఒకటి. గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు సమర్పించరనే దానికి ఈ పురాణ కథే కారణమని మత విశ్వాసం.
గణేశుడిని చూసి మంత్రముగ్ధురాలైన తులసి!
పురాణ కథనం ప్రకారం.. ఒకసారి గణేశుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అందమైన వస్త్రాలు ధరించి, మెడలో పూలమాలతో ధ్యానంలో కూర్చున్నాడు. అదే సమయంలో తులసి దేవి అక్కడి నుంచి వెళ్తోంది. గణేశుడి అందమైన రూపాన్ని చూసిన తులసి ఆయనపై ఆకర్షితురాలైందని పురాణ కథనం. ఆమె గణేశుడి ధ్యానానికి భంగం కలిగించి, తనను వివాహం చేసుకోవాలని కోరిందట. అయితే గణేశుడు ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. తాను వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో తులసి దేవికి కోపం వచ్చి గణేశుడిని శపించిందని పురాణాల్లో కథ ఉంది.
తులసిని శపించిన గణేశుడు
తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపానికి గురైన తులసి.. గణేశుడికి ఇద్దరు భార్యలు కలుగుతారని శపించిందట. దీంతో గణేశుడికి కూడా కోపం వచ్చి తులసిని ప్రతిశపించాడు. ఆమె ఒక అసురుడిని వివాహం చేసుకుంటుందని శపించాడని పురాణ కథనం. తనకు అసురుడితో వివాహం జరుగుతుందని తెలుసుకున్న తులసి.. గణేశుడిని క్షమించమని కోరిందట.
తులసికి గణేశుడు ఇచ్చిన వరం..
తులసి క్షమాపణ కోరడంతో గణేశుడు ఆమెకు ఓ వరం ఇచ్చాడని పురాణ కథనం. విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడికి తులసి ఎంతో ప్రీతికరమైనదిగా మారుతుందని చెప్పాడట. అలాగే కలియుగంలో తులసి పవిత్రమైనదిగా, ఆయుష్షు, మోక్షాన్ని ప్రసాదించేదిగా పూజలు అందుకుంటుందని వరమిచ్చాడని చెబుతారు. అయితే తన పూజలో మాత్రం తులసిని సమర్పించకూడదని గణేశుడు చెప్పాడట. అప్పటి నుంచి గణేశుడి పూజలో తులసి ఆకులను సమర్పించకూడదనే సంప్రదాయం కొనసాగుతోందని మత విశ్వాసం. అందుకే గణపతి పూజలో దూర్వా గడ్డి, వివిధ రకాల పత్రాలు, పుష్పాలను సమర్పిస్తారు కానీ తులసి ఆకులను మాత్రం సమర్పించరని పండితులు చెబుతారు.
Note: ఇందులోని సమాచారం పురాణాలు, మత విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ 4 రాశులపై వినాయకుడి కటాక్షం.. కెరీర్, వ్యాపారంలో ఇక విజయాలే!
వినాయక చవితి 2026.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? ఈ పురాణ కథ తెలుసా?