Share News

రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!

ABN , Publish Date - Sep 14 , 2026 | 09:48 PM

ఏటా రూ. 24 లక్షల ప్యాకేజీ, కార్పొరేట్ హోదా, ఐటీ దిగ్గజ సంస్థల్లో సీనియర్ పొజిషన్.. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తరానా దారి వేరు. తన నూరేళ్ల నాటి పూర్వీకుల ఇల్లును హోమ్‌స్టేగా మలచి నెలకు రూ.5లక్షలు సంపాదిస్తోంది.

రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!
Tarana Chauhan Quits Rs 24 Lakh Job to Run Homestay in Himachal

సిమ్లా / ఢిల్లీ, సెప్టెంబర్ 14: ఏటా రూ. 24 లక్షల ప్యాకేజీ, కార్పొరేట్ హోదా, ఐటీ దిగ్గజ సంస్థల్లో సీనియర్ పొజిషన్.. సాధారణంగా వీటినే విజయం అనుకుంటాం. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తరానా చౌహాన్ (Tarana Chauhan) దారి వేరు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), గ్లోబల్ సంస్థ అనహ్యూజర్-బుష్ ఇంబెవ్‌లలో సీనియర్ బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసిన ఆమె, రూ. 24 లక్షల వార్షిక జీతాన్ని వదులుకొని తన నూరేళ్ల నాటి పూర్వీకుల ఇల్లును 'నిర్వాణ హోమ్స్' (Nirvana Homes) పేరిట విజయవంతమైన హోమ్‌స్టేగా మలచుకున్నారు.


సైడ్ హజిల్‌గా ప్రారంభమై.. సొంత కాళ్లపై నిలబడే వరకు

2020 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్రూ (Rohru) లో ఉన్న సొంత ఇంటికి తిరిగొచ్చిన తరానాకు, ప్రకృతి ఒడిలో జీవించాలనే ఆలోచన తట్టింది. అయితే, ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగానికి హఠాత్తుగా రాజీనామా చేయలేదు. రెండేళ్ల పాటు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే, ఖాళీ సమయంలో కేవలం 3 గదులతో తన పాత ఇల్లును పునరుద్ధరించడం మొదలుపెట్టారు. 'సరైన ప్రణాళిక లేకుండా ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ఖరీదైన సాహసంతో కూడుకున్న పని' అని చెప్పే తరానా, సైడ్ బిజినెస్ పూర్తిగా నిలదొక్కుకునే వరకు ఉద్యోగం కొనసాగించారు.


కొండ ప్రాంతాల్లో హోమ్‌స్టే నడపడం అంటే కేవలం కాఫీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదించడం మాత్రమే కాదని ఆమె చెప్పారు. 'ఇక్కడ ఎటువంటి డిపార్ట్‌మెంట్లు ఉండవు. రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్.. అన్నీ నేనే చూసుకోవాలి. పైపు లీకేజీలు, కరెంట్ కోతలు, గ్యాస్ సిలిండర్లు మార్చడం లాంటివన్నీ ఒంటరిగా ఎదుర్కోవాల్సిందే' అని వాస్తవాల్ని మీడియాతో పంచుకున్నారు.

ఇప్పటివరకూ 'నిర్వాణ హోమ్స్' ద్వారా 200 మందికి పైగా పర్యాటకులకు ఆతిథ్యమిచ్చిన ఆమె, ఒక నెలలో రూ. 5 లక్షలకు పైగా ఆదాయం పొందుతుంటే, కొన్ని నెలల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ వస్తుంటుందని తెలిపారు. స్థిరమైన జీతం లేకపోయినా, తన సమయంపై, జీవితంపై తనకు దక్కిన నియంత్రణే (Freedom) అసలైన సంతృప్తిని ఇస్తోందని తరానా సంతోషంగా వివరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు..

రేసింగ్‌ ట్రాక్‌పై విజయ్–అజిత్‌ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?

Read Latest National News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 09:56 PM