అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:07 PM
వ్యసనాలకు బానిస కావడమో.. సులభంగా డబ్బు సంపాదించడం కోసమో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోతారు.
ఇంటర్నెట్ డెస్క్: వ్యసనాలకు బానిస కావడమో.. సులభంగా డబ్బు సంపాదించడం కోసమో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోతారు. అలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 12వ తేదీన ఇది జరిగింది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. రాత్రి వేళ.. రహదారి నిర్మానుష్యంగా ఉంది. రిటైర్డ్ డాక్టర్ తన భార్యతో కలిసి యాక్టివాపై వెళ్తున్నారు.
అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వాహనంపై యాక్టివా పక్కకు వచ్చారు. డాక్టర్ భార్య మెడలో గొలుసును వెనుక కూర్చొన్న వ్యక్తి బలంగా లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ దంపతులు యాక్టివా నుంచి కింద పడిపోయారు. ఆ వెంటనే చైన్ స్నాచర్లు తమ వాహనం ఆపారు. వారిలో ఒకరు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి.. కింద పడిపోయిన వైద్యురాలి భార్య మెడలో గొలుసు లాక్కుని పరారయ్యాడు.
బైక్‌పై ఉన్న వ్యక్తి.. వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో ఆ సమీపంలోని ఓ వ్యక్తి ( కట్ బనీన్, షార్ట్ వేసుకున్నాడు) బైక్‌పై ఉన్న వ్యక్తిని పట్టుకున్నాడు. ఇక గొలుసు తెంపుకుని పరారైన చైన్ స్నాచర్‌ను మరో ముగ్గురు వ్యక్తులు బలంగా పట్టుకుని అక్కడికి తీసుకువచ్చారు. ఇదంతా ఆ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ సందర్భంగా ఆ చైన్ స్నాచర్లకు దేహశుద్ది చేసి.. పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం కొందరు ఆ మార్గం ఎంచుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలువురి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్వల్ప సమయంలో అధిక సంపాదన చేయడం కోసం చైన్ స్నాచింగ్ సంఘటనలు చేస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు చిక్కిన నిందితులు వెల్లడించారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.