Share News

శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:24 AM

శ్మశానం అంటే విషాదం. ఒక జీవితానికి వీడ్కోలు పలికిన చోటు. అక్కడి వాతావరణం కాస్త గంభీరంగానే ఉంటుంది.

శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...
Merry Cemetery Romania

శ్మశానం అంటే విషాదం. ఒక జీవితానికి వీడ్కోలు పలికిన చోటు. అక్కడి వాతావరణం కాస్త గంభీరంగానే ఉంటుంది. కానీ రొమేనియాలోని సపాంజా గ్రామస్థులకు మాత్రం శ్మశానం ఆనందాన్ని పంచే చోటు. మరణించిన వారి జ్ఞాపకాలను అక్షరసాక్షిగా... చిత్రరూపంలో గుర్తు చేసే ప్రదేశం. అందుకే స్థానికులు ‘ఆనంద శ్మశానం’ అంటుంటారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన శ్మశానవాటికగా దీనికి గుర్తింపు ఉంది.


book6.2.jpgసాధారణంగా శ్మశానవాటిక అంటే నిశ్శబ్దం, విషాదం, నల్లటి రంగులు గుర్తుకొస్తాయి. కానీ రొమేనియాలోని సపాంజా అనే చిన్న గ్రామంలో శ్మశానవాటిక మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. మరణం జీవితానికి ముగింపు కావొచ్చు. కానీ జ్ఞాపకాలు మరణానంతరం కూడా కొనసాగాలని అక్కడి గ్రామస్థులు అంటారు. అందుకే అక్కడ సమాధులు రంగులమయంగా కనిపిస్తాయి. చెక్క శిలువలను నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన రంగులతో అలంకరి స్తారు. ప్రతీ సమాధిపై ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన చిత్రాలు, చిన్న కథలు, హాస్య భరితమైన పద్యాలు చెక్కుతారు. సదరు మరణించిన వ్యక్తి గతంలో ఏ పని చేసేవారు? మరణానికి కారణం ఏమిటి? వంటి విషయాలను కూడా వాటిపై రాస్తారు. అమాయకంగా కనిపించే చిత్రాలు... ఆ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గుర్తుకు తెస్తాయి.


సంప్రదాయం మొదలైందిలా...

సమాధులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, చనిపోయిన వ్యక్తుల వివరాలు చెక్కే సంప్రదాయాన్ని స్టాన్‌ ఐయోన్‌ పత్రాస్‌ అనే స్థానిక కళాకారుడు ప్రారంభించారు. ఆయన సమాధుల కోసం రంగురంగుల చెక్క శిలువలను తయారు చేసేవారు. మరణాన్ని కేవలం విషాదంగా కాకుండా, ఒక వ్యక్తి జీవితాన్ని గుర్తుచేసుకునే విధంగా ఉండాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఇక్కడి సమాధులు జీవిత కథలు తెలియజేసే విధంగా తయారుచేయడం ప్రారంభించారు. ఉదాహరణకు చనిపోయిన వ్యక్తి రైతు అయితే.. ఆయన పొలంలో పనిచేస్తున్న దృశ్యాన్ని చెక్కుతారు. మరొకరి సమాధిపై జీవితంలో జరిగిన సరదా సంఘటనను పద్యరూపంలో రాసి పెడతారు.


book5.4.jpgసమాధులపై రాసిన పలు పద్యాలు, కథలు చూసి సందర్శకులు హాయిగా నవ్వుకుంటుంటారు. ఈ పద్యాల్లో మరణించిన వ్యక్తులను గొప్పవారిగా చూపించడం లేదా వారి లోపాలను దాచిపెట్టి కేవలం మంచి విషయాలనే సమాధులపై రాస్తారనుకుంటే పొరపాటే. వారి తప్పులు, బలహీనతలు, అలవాట్లు, చిన్నచిన్న లోపాలు, చిలిపితనాలు, వైఫల్యాలు వంటి వ్యక్తిగత విషయాలను కూడా హాస్యభరితంగా, చమత్కారంగా ప్రస్తావిస్తారు. ఒక్కోసారి మరణించిన విధానం కూడా ఇక్కడ హాస్యానికి కారణమవుతుంది. ఉదాహరణకు నీటిలో మునిగి చనిపోవడం, అతిగా మద్యం సేవించి మరణించడం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం వంటి ఘటనల్ని సరదాగా రాస్తారు.


ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియంగా...

ఎక్కడైనా సరే... శ్మశానవాటికలు విషాదాన్ని గుర్తుచేస్తే, సపాంజా మెర్రీ మాత్రం ఒక మనిషి జీవితాన్ని, అతని లేదా ఆమె జ్ఞాపకాలను... వారి వ్యక్తిత్వాన్ని గుర్తుచేస్తుంది. అందుకే ఈ ప్రాంతం శ్మశానవాటిక కాదు... మరణించిన వారి జీవిత కథలను రంగుల్లో, చిత్రాల్లో, పద్యాల్లో చెప్పే ఒక ప్రత్యేకమైన ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియంగా అభివర్ణిస్తారు. అందుకే సపాంజా మెర్రీ ప్రపంచంలోని ప్రత్యేకమైన శ్మశానవాటికల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ శ్మశానాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వెళ్లడం ఎంతైనా వింతే కదా!


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 10:24 AM