Share News

స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:51 AM

మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె.. దేశంతో పాటు నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక
Nila Vikhe Patil wins Stockholm seat in Sweden's National Election

ఇంటర్‌నెట్ డెస్క్: భారత సంతతి మహిళ, మహారాష్ట్ర విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కూతురు నీలా విఖే పాటిల్ (41) స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్వీడన్‌లో ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్టాక్ హోం సిటీ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు. స్టాక్ హోం నగరంతో పాటు దేశాభివృద్ధికి క‌ృషి చేస్తానన్నారు. ‘349 మంది సభ్యులుగల పార్లమెంటులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఓటువేయలేని వారి కోసం పార్లమెంటులో మాట్లాడతాను. ప్రతి పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉండే సమాజం కోసం పాటుపడతాను. అలాగే శుద్ధమైన నీరు, ప్రక‌తి, సాధ్యమైనంత వరకు తక్కువ ప్రకృతి వైపరీత్యాలు గల సమాజం మనకు అవసరం. అందుకు అందరం ప్రయత్నించాలి’ అని నీలా పేర్కొన్నారు. కాగా.. నీలా తండ్రి అశోక్ విఖే పాటిల్, మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ అన్నదమ్ములు. ఆసియా మొదటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు విఠల్ రావ్ విఖే పాటిల్‌కు నీలా మునిమనవరాలు. అలాగే దివంగత కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్‌కు మనవరాలు అవుతారు.

విద్యాభ్యాసం

నీలా స్వీడన్‌లో జన్మించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో ఆమె బాల్యం గడిచింది. గోథెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి డిగ్రీ, ఎంబీఏ చేశారు. అలాగే, మాడ్రిడ్‌లోని యూనివర్సిటీ డె కంప్లుటెన్స్‌లో ఎకనామిక్స్ అండ్ లా చేశారు. అదే వర్సిటీలో ఎంబీఏ కూడా చదివారు.

పొలిటికల్ కెరీర్

స్వీడన్ మాజీ ప్రధానమంత్రి స్టెఫాన్ లోవెన్ కార్యాలయంలో నీలా రాజకీయ సలహాదారుగా పనిచేశారు. స్టాక్ హోం మునిసిపల్ కార్పొరేషన్ సిటీ కౌన్సి్ల్‌లోసభ్యురాలిగా ఉన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 09:57 AM