ఒకే ఫ్రేమ్‌లో మిల్కీ వే, శుక్రుడు, పర్పుల్ మెరుపులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 08:07 AM
నాసా వ్యోమగామి డాన్ పెటిట్ పంచుకున్న మరో అద్భుతమైన దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకే ఫ్రేమ్‌లో మిల్కీ వే గెలాక్సీ, ప్రకాశవంతమైన శుక్రగ్రహం, భూ వాతావరణంలోని ఎర్రటి కాంతి, ఊదా రంగు మెరుపులు ఆ ఫొటోలో కనిపించాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: అంతరిక్షానికి సంబంధించి ఎప్పటికపుడు అప్‌డేట్లు ఇచ్చే నాసా వ్యోమగామి డాన్ పెటిట్.. మరో అందమైన స్పేస్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈసారి ఆయన తీసిన ఫొటోలో పాలపుంత గెలాక్సీ, ప్రకాశవంతంగా మెరుస్తున్న శుక్రగ్రహం, భూమి వాతావరణం, పర్పుల్ కలర్‌లో ఉన్న మెరుపులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెటిట్ షేర్ చేశారు. ‘భూ వాతావరణంలోని ఎర్రటి కాంతి మధ్య నుంచి ప్రకాశవంతమైన శుక్రగ్రహం ఉదయిస్తోంది. ఆ గ్రహంపై మిల్కీ వే కనిపిస్తోంది. కింద ఊదా రంగులో మెరుపులు మెరుస్తున్నాయి. అనంతమైన నక్షత్రాల మధ్య మెరిసే రెండు తుఫాను ప్రపంచాలు ఇది’ అని అని పెటిట్ ట్వీట్ చేశారు. కాగా.. ఫొటోలో ఒకవైపు ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు, మరోవైపు ప్రకాశవంతంగా శుక్రగ్రహం కనిపిస్తుండగా.. భూమి చుట్టూ ఎర్రటి వాతావరణ కాంతి, కింద ఊదా మెరుపులు కనిపించాయి.
'వావ్.. సూపర్' అంటూ నెటిజన్ల ప్రశంసలు
డాన్ పెటిట్ షేర్ చేసిన ఆ స్పేస్ ఫొటో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. శుక్రగ్రహం, మిల్కీ వే, మెరుపులు.. ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అద్భుతంగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశారు. భూమికి అవతల నుంచి అందమైన దృశ్యం కనిపిస్తోందని మరో నెటిజన్ ప్రశంసించారు. ‘ఎప్పట్లాగే అద్భుతంగా ఉంది, డాన్’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. అంతరిక్షం నుంచి కనిపించిన ఈ దృశ్యం.. భూమిపై ఉన్న తుఫాన్లను, అంతరిక్షంలోని నక్షత్రాలను ఒకే ఫొటోలో చూపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంది.