వేల ఏళ్ల సముద్ర చరిత్ర... కళ్లముందు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 08:13 AM
లోథ్, తాల్... రెండు పదాల కలయిక ‘లోథల్’... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు నైరుతి దిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
లోథ్, తాల్... రెండు పదాల కలయిక ‘లోథల్’... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు నైరుతి దిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సింధులోయ నాగరికతలోని ఈ పురావస్తు ప్రదేశంలో... 4500 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ప్రాచీన నగరమిది. ఇక్కడి తవ్వకాలలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కృత్రిమరేవు బయట పడింది. ఇది సబర్మతి పాత మార్గానికి అనుసంధానించి ఉండేది. అయితే సముద్రంతో మొదలైన భారత కథకు లోథల్ కొత్త చిరునామాగా మారబోతోంది.
4500 ఏళ్ల నాటి నౌకాయాన చరిత్రకు ఆధునిక రూపంగా... ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ సముద్ర వారసత్వ సముదాయం (మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్) నిర్మాణాన్ని గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నిర్మాణానికి కేవలం 1.5 కి.మీ దూరంలో లోథల్ పురావస్తు ప్రదేశం ఉంది.
సముద్ర అలలతో సందడిగా ఉండే ఓడ రేవు... దూర దేశాల నుంచి వచ్చిన నౌకలు... గోదాముల్లో నిండిన సరుకులు... వ్యాపారులతో కళకళలాడిన మార్కెట్లు... ఇవన్నీ వేల ఏళ్ల క్రితం లోథల్‌లో కనిపించిన దృశ్యాలు.. నేడు అక్కడే మరో కొత్త కథకు తెరలేస్తోంది. సుమారు రూ.4500 కోట్లతో 375 ఎకరాల్లో అతిపెద్ద ‘మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్’ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో ప్రాజెక్టు తొలిదశ పనులు అందుబాటులోకి రానున్నాయి. కేవలం ఒక మ్యూజియంలా కాకుండా, పర్యాటక ప్రాధాన్యత ఉండేలా... సముద్రంతో దేశ సంస్కృతి ఎలా ముడిపడి ఉందో తెలుపుతూ... వాణిజ్యం, నౌకా నిర్మాణం, నావిగేషన్ ఎలా విస్తరించాయో కళ్లకు కట్టేలా లోథల్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయి. పుస్తకాల్లో ఉన్న చరిత్రను ప్రజలకు అనుభవం లోకి తెచ్చేలా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. టాటా సంస్థ ఈ నిర్మాణ పనులు చేపడుతోంది.

లోథల్‌లోనే ఎందుకు?
మనదేశంలో సుమారు 12 రాష్ట్రాలతో సముద్రతీరం ముడిపడి ఉంటే.. ఒక్క లోథల్‌లోనే ఇంత భారీ నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారంటే... ఈ ప్రాంతంలో క్రీ.పూ. 2400 ఏళ్ల నాటికే మానవ నిర్మిత డాక్‌యార్డు ఉన్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి. సింధులోయ నాగరికత, హరప్పా నాగరికత అభివృద్ధి చెందిన ముఖ్య కేంద్రాల్లో లోథల్ ఒకటి. 4500 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్, మెసపుటేమియా వంటి ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. ఒకప్పుడు లోథల్ నుంచి పూసలు, సుగంధద్రవ్యాలు, ఆభరణాలు ఎగుమతి అయ్యేవట. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

14 గ్యాలరీలతో థీమ్స్
‘మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్’ను మూడు దశల్లో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులోని ప్రధాన మ్యూజియం సముదాయంలో 14 గ్యాలరీలు ఉంటాయి. వీటిద్వారా భారతదేశ చరిత్రను 4500 ఏళ్ల క్రితం నుంచి నేటి వరకు సందర్శకులకు పరిచయం చేస్తారు. 14 గ్యాలరీలను వివిధ థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్నారు. మొదటి గ్యాలరీలో మనిషి పరిణామక్రమం, మానవ నాగరికత, హరప్పా నాగరికత, వారి జీవన విధానం, నౌకా నిర్మాణం, సముద్ర ప్రయాణాలు, వాణిజ్యం వంటి అంశాలను పరిచయం చేస్తారు. ఈజిప్టు, మెసపుటేమియా దేశాల నాగరికతలతో ఉన్న సంబంధాలను ఇక్కడ చూడొచ్చు. మిగతా గ్యాలరీలలో భారత నౌకాదళం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న గ్యాలరీ ఒకటి. పురావస్తు, డిజిటల్ టెక్నాలజీ, సినిమాలు, ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, కళా రూపాలు అన్నింటిని ఒకేచోట ప్రతిబింబించేలా నిర్మాణాలు చేస్తున్నారు. పురాతన లోథల్ నగరాన్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ మొత్తం సముదాయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు నీటి మార్గాలు ఉంటాయి. బోట్లు అందుబాటులో ఉంచుతారు.

77 మీటర్ల ఎత్తులో లైట్‌హౌస్
ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 77 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లైట్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. లైట్‌హౌస్ మ్యూజియం పర్యాటకుల్ని ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు సముద్రంలో నౌకలకు దారిచూపిన లైట్‌హౌస్ భావనను.. ఇప్పుడు చరిత్రకు దారిచూపే నిర్మాణంగా మార్చారు. ఈ లైట్‌హౌస్‌లో 65 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఉంటుంది. దేశంలో తీర ప్రాంత వైవిధ్యాన్ని ఒకే చోట చూపేందుకు అన్ని ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. వీటితోపాటు మారిటైం అండ్ నేషనల్ థీమ్ పార్కు, క్లైమేట్ చేంజ్ థీమ్ పార్కు, అడ్వెంచర్ అండ్ అమ్యూజ్‌మెంట్ థీమ్‌పార్కు, మాన్యుమెంట్స్ థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. 5డీ డోమ్ ఆడిటోరియం, నౌకాదళ నౌకలు, విమానాలు, బోటింగ్, వినోద ప్రాంతాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.
పరిశోధనలకు అవకాశం
సముద్ర వారసత్వానికి సంబంధించిన పరిశోధనలకు కూడా ఈ ప్రాజెక్టు వేదిక కానుంది. ఇక్కడ మారిటైం రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి విద్యార్థులు, పరిశోధకులు వచ్చి సముద్ర చరిత్ర, నౌకాయానం, వాణిజ్యం తదితర అంశాలపై పరిశోధనలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ భారీ సముదాయం పూర్తయిన తర్వాత రోజుకు 25 వేల నుంచి 30 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాదెళ్ల చిన తిరుపతయ్య, స్టేట్ బ్యూరో
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
Read Latest AP News And Telangana News And International News And Telugu News