Share News

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కులవివక్షే కారణమంటూ యువకుడి తండ్రి ఆరోపణ..

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:41 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో కోణం వెలుగుచూసింది. కులవివక్ష కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని సాహిల్ తండ్రి ఆరోపిస్తున్నారు.

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కులవివక్షే కారణమంటూ యువకుడి తండ్రి ఆరోపణ..
IIT Bombay Student Issue

ముంబై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay)లో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో కోణం వెలుగుచూసింది. కులవివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సాహిల్ తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లా తన కుమారుడిపై కులానికి సంబంధించిన అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అతడిని తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించారని ఆరోపించారు.


సాహిల్ తండ్రి ఫిర్యాదు మేరకు దుల్లాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐఐటీ బాంబేకు చెందిన మరికొందరు అధికారులపైనా ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. మరోవైపు, సాహిల్ తల్లి కూడా తన కుమారుడు వేధింపులకు గురయ్యాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరారు. ‘నా కుమారుడిని వేధించారు. నేను ఫిర్యాదు చేస్తాను. నా బిడ్డకు న్యాయం కావాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, విద్యార్థి మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నతాధికారులు కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. పరీక్ష ఘటన, అనంతరం జరిగిన పరిణామాలు, విద్యార్థి కుటుంబం చేసిన ఆరోపణలు సహా అన్ని అంశాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు.


శుక్రవారం జరిగిన పరీక్షలో ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని సాహిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రొఫెసర్ అతడిని మందలించారని ఐఐటీ బాంబే తెలిపింది. అనంతరం సాహిల్ తన హాస్టల్ గదికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. మరోవైపు, సాహిల్ మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఐఐటీ బాంబే సమాధానం చెప్పాలని ఆందోళన చేపట్టాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం సరికాదు: మోదీ

Updated Date - Sep 20 , 2026 | 08:24 AM