రైలే.. కానీ హోటల్
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:45 AM
ప్రపంచంలో ఎక్కడా లేని, అత్యంత విలాసవంతమైన రైలు అది. అందులో బస ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. ఆ రైలు పెట్టెలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఎంచక్కా చిరుతపులులను చూడొచ్చు.
ప్రపంచంలో ఎక్కడా లేని, అత్యంత విలాసవంతమైన రైలు అది. అందులో బస ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. ఆ రైలు పెట్టెలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఎంచక్కా చిరుతపులులను చూడొచ్చు. నదిని దాటుతున్న ఏనుగుల గుంపును వీక్షించొచ్చు. అయితే ఆ రైలు ఎక్కడికీ వెళ్లదు. విలాసవంతమైన హోటల్‌గా మారిన సదరు రైలు... పర్యాటకులకు మాత్రం స్వర్గధామంగా నిలుస్తోంది.
క్రూగర్ షలాటి... పర్యాటకులకు విలాసవంతమైన సదుపాయాలతో పాటు మధురానుభూతులను పంచే హోటల్. ‘ది ట్రెయిన్ ఆన్ బ్రిడ్జ్’ అని పిలిచే క్రూగర్ షలాటి దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఉంది. ప్రకృతి రమణీయతను, జాతీయ పార్కులోని జంతువులను దగ్గర నుంచి చూసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. సాబీ నదిపై 50 అడుగల ఎత్తులో ఉన్న వంతెనపై ఈ రైలు నిలిపి ఉంటుంది. క్రూగర్ నేషనల్ పార్కు సింహాలు, చిరుతలు, ఖడ్గమృగాలు, ఏనుగులకు నిలయం. ఆఫ్రికాలో అతి పెద్ద గేమ్ రిజర్వ్‌గా పేరుంది. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
కనువిందు చేసే పార్కు అందాలు
50 అడుగుల ఎత్తులోని వంతెనపై నిలిపి ఉన్న రైలులో నుంచి చూస్తే పార్కు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు కనువిందు చేస్తాయి. నది దగ్గరకు వచ్చే జంతువులను హోటల్ గదుల్లో నుంచి చూడటం మధురానుభూతిని కలిగిస్తుంది. అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ జాతీయ పార్కు అందాలను వీక్షించవచ్చు. సెంట్రల్ లాంజ్ కార్, అబ్జర్వేషన్ డెక్ వంటి సదుపాయాలున్నాయి. రాత్రుళ్లు బస చేసే వారి కోసం ప్రత్యేకంగా క్యాంప్‌ఫైర్ ఏర్పాటు చేస్తారు.
ఈ రైలు పెట్టెలను మొత్తం 24 గదులుగా మార్చారు. 7 లగ్జరీ గదులు కూడా అందుబాటులో ఉంటాయి. అన్ని గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నేలా గదులు, సదుపాయాలు ఉంటాయి. గదుల్లో నుంచి పార్క్ అందాలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్‌ను అందిస్తారు. ఉచిత వైఫై సదుపాయం ఉంటుంది. పర్యాటకులను సఫారీకి తీసుకెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
ఎలా మొదలైందంటే...
సెలాటి రైల్వే లైన్ చరిత్ర క్రూగర్ నేషనల్ పార్క్‌తో ముడిపడి ఉంది. ట్రాన్స్‌వాల్‌లోని బంగారు ఖనిజాన్ని కోమటిపూర్ట్ తరలించడానికి 1892లో మొదటిసారి రైల్వే లైను వేశారు. అయితే భద్రతాపరమైన కారణాలతో ఆ తర్వాతి కాలంలో ఖనిజాల తరలింపు ఆగిపోయింది. చాలా ఏళ్ల పాటు సేవలు అందించిన ఈ రైల్వే లైను సెలాటి గోల్డ్‌ఫీల్డ్స్ మూతపడటంతో నిరుపయోగంగా మారింది. సాబీ నేచర్ రిజర్వ్ గార్డెన్‌గా పనిచేస్తున్న స్టీవెన్‌సన్-హామిల్టన్ మూతపడిన రైల్వే లైనును పర్యాటకుల కోసం వాడుకలోకి తేవాలని ఆలోచించారు.
ఆ సమయంలో క్రూగర్ నేషనల్ పార్కు లేదు. సబీగేమ్ రిజర్వ్ పేరుతో మాత్రమే ఉండేది. వన్యప్రాణుల రక్షణ కోసం ఒక అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది కూడా స్టీవెన్‌సనే. అలా సబీ గేమ్ రిజర్వ్ కాస్తా క్రూగర్ నేషనల్ పార్కుగా మారింది. ఉపయోగంలో లేని రైల్వే లైనును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచనల్లో నుంచి పుట్టిందే క్రూగర్ షలాటి. 1950లో సేవలు అందించిన రైలు పెట్టెలను హోటల్ గదులుగా మార్చారు. సరికొత్త అనుభూతులను సొంతం చేసుకోవాలనే పర్యాటకులు క్రూగర్ షలాటిని సందర్శిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News