Share News

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:19 AM

ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి.

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

  • మానుకోట అడవుల్లో కొత్తశోభ

  • ఎర్రటి రంగులతో కనువిందు

  • చెట్లలోని ప్రతీభాగం ఒక ఔషధమే

వరంగల్: ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం, గార్ల మండలాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ అడవి తల్లులు ఎర్రటి మోదుగుపూలతో ముస్తాబై కనువిందు చేస్తున్నాయి. ఆకు రాల్చిన చెట్లు.. కొమ్మల నిండా సింధూర వర్ణపు పూలతో నిండిపోయి చూసేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.


ప్రకృతి ప్రసాదించిన వరం..

మహబూబాబాద్‌ జిల్లాలోని అడవి ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఈ సమయంలో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. దీనిని ఆంగ్లంలో ఫ్లేమ్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌ (తెలుగులో మోదుగు, సం స్కృతంలో పలాశ) అని పిలిచే ఈ వృక్షం భారతీయ సంస్కృతికి ఒక గొప్ప నిధి. ఈ పూలు చూడడానికి చిలుకముక్కు ఆకారంలో ఉండి ఎరుపు, నారింజ రంగుల కలయికతో మెరుస్తూ ఉంటాయి. ఈ పూలు వికసించినప్పుడు చెట్టుకు ఆకులు ఉండవు. కేవలం పూలు మాత్రమే ఉండి సింధూర వర్ణంగా కన్పిస్తాయి. దీని శాస్త్రీయ నామం బ్యూటియా మోనోస్పెర్మా.


hnk1.2.jpgతండాల్లో ప్రకృతి సిద్ధమైన రంగులు..

ప్రస్తుతం జరుపుకుంటున్న హోలీ పండుగల్లో రసాయనిక రంగులు రాజ్యమేలుతున్నాయి. ఇవి చర్మానికి, కళ్లకు హాని కలిగిస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో పూర్వీకుల కాలం నుంచి మోదుగుపూలతోనే హోలీ ఆడుతున్నారు. మోదుగుపూలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. లేదా పచ్చిపూలను నీళ్లలో వేసి మరిగిస్తే ఆ నీరు నారింజ రంగులోకి మారుతుంది. ఈ రంగు నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న క్రిములు నశిస్తాయి. ఎండాకాలంలో వచ్చే చర్మవ్యాధులు, చమటకాయలు వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.


పూర్వీకుల నుంచి సంప్రదాయంగా..

మానుకోట జిల్లాలోని లంబాడీల సంస్కృతిలో హోలికి ప్రత్యేక స్థానం ఉంది. తండాల్లో నేటికి మోదుగు పూలనే పవిత్రమైన రంగులుగా భావిస్తారు. భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం.. మోదుగుచెట్లు అత్యంత పవిత్రమైనవి. వాటి ఆకులు ఎప్పుడు మూడు.. మూడు కలిసే ఉంటాయి. అందుకే ముల్లోకాలను ఏలే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ఆకుల్లో కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మధ్య ఆకు విష్ణు, ఎడమ ఆకు బ్రహ్మ, కుడి ఆకును శివుడిగా భావిస్తారు. యజ్ఞాల్లో కర్రలను వాడడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుందని నమ్ముతారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవికి మోదుగు పుష్పాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది.


hnk1.3.jpgకనుమరుగవుతున్న పూలు..

ఒకప్పుడు జిల్లాలోని పల్లెలు, తండాలు మోదుగుపూలతో కళకళలాడేవి. కానీ, నేడు అడవుల నరికివేత, ప్లాస్టిక్‌ విస్తారాకుల వాడకం పెరగడంతో ఈ చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. కృత్రిమ రంగుల వ్యామోహంలో పడి ప్రకృతి సిద్ధమైన సంపదను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ద్వారా జిల్లాలో మోదుగు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు మోదుగుపూల రంగుల ప్రాముఖ్యతను వివరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


రసాయన రంగుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చంటున్నారు. ప్రకృతి మానవాళికి ఇచ్చిన అద్భుతమైన వరం.. మోదుగుపూలు. ఇది కేవలం పండుగకు రంగునిచ్చే పువ్వు మాత్రమే కాదు. పల్లె సంస్కృతికి ప్రతీక. ఆరోగ్యానికి ఆధారం. ఈ హోలీ పండుగ సందర్భంగా మళ్లీ ప్రకృతి వైపు మళ్లుదాం. రసాయన రంగులను బహిష్కరించి, మోదుగుపూల స్వచ్ఛతను ఆస్వాదిద్దాం. అడవి తల్లి అందించిన ఆ పుష్పాలను గౌరవిస్తూ.. మహబూబాబాద్‌ జిల్లా ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకుందాం.


zz.jpgఆయుర్వేదంలో అద్భుత ఔషధం..

మోదుగు చెట్లలోని ప్రతీభాగం ఒక ఔషధమే. మానుకోట ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు వీటిని తరతరాలుగా వైద్యంలో వాడుతున్నా రు. పూర్వం మోదుగు ఆకులతోనే ఇస్తారాకులు కుట్టేవారు. ఈ ఆకుల్లోనే భోజనం చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. మోదుగు గింజల పొడిని వాడడం వల్ల చిన్న పిల్లల్లో ఉండే నులిపురుగుల సమస్య పరిష్కారమవుతుందని పూర్వీకుల నమ్మకం. మోదుగుపూల కషాయం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద పరిశోధనలు చెబుతున్నాయి.


ఎండ వేడివల్ల వచ్చే వడదెబ్బ, నీరసం తగ్గించడానికి మోదుగుపూల నీరు దివ్య ఔషధం. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర మోదుగు చెట్టుది. అతితక్కువ నీటితో ఎటువంటి నేలల్లోనైనా పెరగగలదు. ఇది భూమిలోని తేమను కాపాడడమే కాకుండా భూసారాన్ని పెంచుతుంది. మహబూబాబాద్‌ వంటి అటవీ ప్రాంతాల్లో నేల కోతకు గురికాకుండా ఉండడానికి ఈ చెట్లు ఎంతో దోహదపడతాయి. వాతావరణంలోని కాలుష్యాన్ని గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేయడంలో దీనికి సాటిలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 11:19 AM