‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్...
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:21 AM
ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.
ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం. ఇలాంటి సందర్భాల్లో చక్కటి ఉపశమనం ‘సలాడ్స్’. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తోంది సలాడ్ల కాలం. నగరాల్లో సలాడ్స్ కోసం ప్రత్యేకంగా రెస్టారెంట్లూ వచ్చేశాయి. ‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్... చూపు తిప్పుకోనివ్వడం లేదు.
సాధారణంగా ‘సలాడ్స్’ అనగానే డైట్‌కి సంబంధించిందని అనుకుంటాం. కేవలం బరువు తగ్గాలనుకునే వారికే కాదు... ఈ రోజుల్లో అందరికీ సలాడ్స్ అవసరం. అంతెందుకు... రోజువారీ భోజనంలో సలాడ్స్‌ను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలిస్తున్నారు. వేసవిలో సలాడ్స్ తినడం వల్ల తాజాదనం చేకూరుతుంది. శరీరంలో నీటి శాతాన్ని పరిరక్షించుకోవచ్చు. మండు వేసవిలో మధ్యాహ్నం వేళలో... కొద్దిగా క్యారెట్ తరుము, కాస్త మామిడి తురుము, పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు కలుపుకుని తింటే... తాజాగా, ఘాటుగా, పుల్లగా నోటికే కాదు మనసుకూ హాయిగా అనిపిస్తుంది. పైగా సలాడ్స్‌ను తయారుచేయడం కష్టం కాదు. ఎంతో సులభం కూడా. వీటికి పొయ్యితో పని లేదు. కూరగా యలు, పండ్లను ముక్కలుగా కోస్తే చాలు.
అన్నీ కలిపి...
పచ్చి కూరగాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మొదట గుర్తించిన వ్యక్తి హిపోక్రేట్స్. వైద్య పితామహుడుగా ఈ గ్రీకువైద్యుడు పేరు తెచ్చుకున్నారు. పచ్చికూరగాయలను తినడమే క్రమంగా వెజిటబుల్ సలాడ్స్ రూపకల్పనకు దారితీసింది. అందుకే చాలాకాలం పాటు సలాడ్స్ అంటే కూరగాయలు మాత్రమే అనే ధోరణి ఉండేది. అయితే కాలానికి తగినట్టు సలాడ్స్‌లో చేర్చుతున్న పదార్థాలూ మారుతున్నాయి. కూరగాయల ముక్కలకి తోడు... పండ్లు, ఆకుకూరలు, ఉడికించిన పప్పు దినుసులు, నట్స్, గింజలూ కలిపేస్తున్నారు. ఇవన్నీ ఫైబర్‌ను అందించేవే. వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అందుకే పోషకాలకు సంబంధించిన పవర్ హౌజ్‌గా సలాడ్స్‌ను పేర్కొంటారు. ఉపయోగించే పదార్థాల ఆధారంగా సలాడ్స్‌లో ప్రధానమైనవి...
ఆకుకూరలు - గ్రీన్ సలాడ్
మొలకెత్తిన గింజలు - గింజల సలాడ్
రకరకాల పండ్లు- ఫ్రూట్ సలాడ్
కూరగాయలు - వెజిటబుల్ సలాడ్
ఉడికించిన పప్పులు - లెగ్యూమ్ సలాడ్
ఇలా వేరువేరుగా లేదా ఒక్కో పదార్థాన్ని కలిపి సలాడ్‌లా తయారుచేసుకోవచ్చు. పులుపు, కారం, తాజాదనం కోసం ఉప్పు, మామిడి తురుము, నిమ్మరసం, కొత్తిమీర, మిర్చి లాంటివి చేర్చడం మామూలే. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సలాడ్స్‌కు చేర్చడం ద్వారా ఆహారాన్ని ‘రైన్బో’ రంగుల్లోకి మార్చుకుంటున్నాం. ఆరోగ్యకరమైన గట్కి ఈ కూరగాయల వైవిధ్యం ఎంతో మంచిది. రోజుకు ఓసారి లేదా వారంలో కొన్నిసార్లు సలాడ్స్ తినడం ఆరోగ్యకరం. శరీరం లోపల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, గట్ ఆరోగ్యానికి మేలు. కంటి ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. దంతాలకూ మంచిది. ఈ ఆహార పదార్థాల్లో ఉన్న పోషక విలువల వల్ల క్యాన్సర్, మధుమేహాలను దరిచేరకుండా చెక్ పెట్టవచ్చు.
ఎంతో వైవిధ్యం...
విస్తృతం, వైవిధ్యభరితమైన మనదేశంలో ప్రాంతాన్ని బట్టి రకరకాల సలాడ్స్ నోరూరిస్తుంటాయి. ఉత్తర భారతంలో సలాడ్స్‌ను కూడా ఛాట్ మాదిరిగా తయారుచేస్తారు. సలాడ్స్‌లో ఛాట్ మసాలా, నల్ల ఉప్పు కలుపుతారు. ఇంకా గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ మామూలే. అక్కడ కీరదోసతో చేసే కచుంబర్ సలాడ్ చాలా ప్రసిద్ధి. ఇక దక్షిణ భారతంలో కూరగాయల ముక్కలకు పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, కరివేపాకుతో పోపు పెడతారు. రోజువారీ వంటకాలైన అన్నం, పప్పు, కర్రీలు, తందూరీ రోటీలకు చక్కని కాంబినేషన్‌గా భారతీయ సలాడ్స్‌ను పేర్కొనాలి. చట్నీలు, అప్పడాలతో సలాడ్స్ రుచే వేరు. మన ఇళ్లలోని సలాడ్స్‌లో ఎక్కువగా కనిపించే పదార్థాలు కీర దోసకాయ, టమాటా, క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయ ముక్కలు, ఛాట్మసాలా, నిమ్మరసం, మిరియాలపొడి.
అందరికీ ఓకేనా?
మునుపెన్నడూ లేనంతగా ఫుడ్ ఎలర్జీలు నేడు పెరిగాయి. పడని ఆహార పదార్థాలను ఆరగిస్తే కడుపులో గడబిడ, వికారం మొదలవుతుంది. కాబట్టి రుచిగా ఉంది కదా అని అతిగా తినకుండా... పడని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు దూరంగా ఉండడమే మంచిది. ఆ పదార్థాలు లేకుండా విడిగా సలాడ్స్‌ను తయారుచేసుకున్నా పర్వాలేదు. అలాగే సలాడ్స్ మంచివని ఒకేసారి ఎక్కువ తిన్నా ప్రమాదమే. పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు చేరడం వల్ల గట్ పనితీరుకు ప్రమాదకరం. ఏదైనా కూడా అతిగా కాకుండా ఓ మోస్తరుగా తీసుకోవడం మంచిది. అప్పుడే హాయిగా వేసవిని సలాడ్స్‌తో ఆస్వాదించగలుగుతాం.
ఆకాశమే హద్దు...
ప్రతీ పనికీ సృజనాత్మకతను జోడించడం ఈ ఆధునిక కాలంలో వచ్చిన గొప్ప మార్పు. సలాడ్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అభిరుచికి తగినట్టు గ్రీన్ సలాడ్స్, గ్రెయిన్ సలాడ్స్ లేదా రెండింటినీ కలిపేసి సరికొత్తగా మార్చేయొచ్చు. నచ్చిన పండ్లు ఎలాగూ ఉంటాయి. ఇంకా తోఫు, గుడ్డు, ఛీజ్, చికెన్... తదితరాలలో నచ్చినట్టు కలిపేయొచ్చు. ఇలా చేయడం వల్ల సలాడ్స్‌లో కూడా ప్రొటీన్ల కొరత లేకుండా చేసుకోవచ్చు. అందుకే ఈరోజుల్లో సలాడ్స్‌కు ఆకాశమే హద్దుగా ఉంటోంది. రకరకాల పదార్థాలతో సలాడ్స్ రుచులను తయారుచేస్తున్నారు. హోటళ్లలోనే కాదు వివాహ విందుభోజనాల్లో కూడా సలాడ్స్‌కు సంబంధించి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు
పాకశాస్త్ర నిపుణులు. పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా వివిధ నగరాలలో సలాడ్స్ కోసం ప్రత్యేకమైన రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లూ వచ్చాయి. శాండ్విచెస్ ఎన్ సలాడ్స్, గ్రీన్స్ అండ్ గో, జస్ట్ సలాడ్, సలాడ్ వర్క్స్... అలాంటివే.
ప్రపంచం మెచ్చింది...
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొన్ని సలాడ్స్...
హొరియటికి (గ్రీక్ సలాడ్): గ్రీస్
పిపిర్రానా: స్పెయిన్
కాప్రెజీ: ఇటలీ
సలాడే నీస్వాజ్: ఫ్రాన్స్
సీజర్: అమెరికా, మెక్సికో
వీటిల్లో సీజర్ సలాడ్ని ప్రపంచవ్యాప్తంగా సలాడ్ప్రియులు ఎక్కువగా ఆరగిస్తున్నారు.
చైనీయులే అధికంగా...
సలాడ్స్‌కు సంబంధించి ప్రసిద్ధ దేశం గ్రీస్. అయితే ఆ దేశంలో కన్నా ఎక్కువగా పచ్చి కూరగాయలను తినే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. చైనాలో ప్రతీ ఒక్కరూ ఏడాదికి కొన్ని వందల కిలోల సలాడ్ ముక్కల్ని ఆరగిస్తున్నారట. పెద్ద మొత్తంలో ‘లెట్యూస్’ (ఒకరకమైన ఆకుకూర)ను సైడ్ డిష్‌గా తినడం చైనాలో మామూలే. గ్రీస్, లెబనాన్, అమెరికా, స్పెయిన్ రకరకాల టాపింగ్స్‌తో సలాడ్స్‌ను ఆస్వాదించడంలో ముందున్న దేశాలు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News