సీఎస్ఆర్ ఫండ్ పెరగాలి!
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:08 AM
రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు, సంస్థల నుంచి సేకరిస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఎస్ఆర్) చాలా తక్కువగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది.
కంపెనీల నుంచి ఎక్కువ నిధులు రాబట్టాలి
ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా సమీకరించాలి
ప్రభుత్వం నిర్ణయం.. ప్రత్యేక పాలసీ రూపకల్పన
తెలంగాణలో నడుస్తున్న కంపెనీలు,
ఇక్కడ కేంద్ర కార్యాలయాలున్న కంపెనీలపై నజర్
ఫార్మా, ఇతర పరిశ్రమలు, ఐటీ కంపెనీల నుంచి..
ప్రస్తుతం వస్తున్న వాటా పెంపునకు నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు, సంస్థల నుంచి సేకరిస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఎస్ఆర్) చాలా తక్కువగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని పెంచుకోవాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.2 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో సీఎస్‌ఆర్ వాటా పెంపు సహా పలు కీలక అంశాలతో కొత్తగా ‘సీఎస్ఆర్ పాలసీ’ని తీసుకురాబోతోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాలసీని అధ్యయనం చేయడంతోపాటు కొత్త పాలసీలో చేర్చాల్సిన నిబంధనలకు సంబంధించి అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీలు, సంస్థలు.. ప్రతి ఏటా తమకు వచ్చిన ఆదాయంలో కొంత శాతం మేర నిధులను సీఎస్ఆర్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సేకరించే నిధులను ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరుల అభివృద్ధి, మహిళా సాధికారత, సార్ట్‌పలకు ప్రోత్సాహం వంటి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది. అయితే కొన్ని కంపెనీలు ఆదాయానికి తగ్గట్టుగా సీఎస్ఆర్ వాటా ఇవ్వడంలేదని, మరికొన్ని సంస్థలు, కంపెనీలు ఆశించిన స్థాయిలోనూ వాటా చెల్లించడంలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ విరాళాల వాటా తెలంగాణలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన సీఎస్ఆర్ నిధులు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ పెంపుపై అధికారులు దృష్టి పెట్టారు.
రాష్ట్రం వేదికగా ఉన్న కంపెనీలపై ప్రత్యేక దృష్టి..
సీఎస్ఆర్ ఫండ్ సేకరణ విషయంలో ఇకపై పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని పలు కంపెనీలతోపాటు దేశీయంగా ఉన్న కొన్ని సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్నాయి. వీటిలో తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న వాటిపై, ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉండి.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నా.. ఆ పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ ఫండ్ పెద్దగా రావడంలేదని, ఒకవేళ వస్తున్నప్పటికీ వాటిని ఇతర రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారని తేలినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇకపై హైదరాబాద్ వేదికగా నడుస్తున్న కంపెనీల నుంచి సీఎస్ఆర్ వాటాలో దాదాపు 50 శాతం మేర, ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉండి, ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల వాటాలో ప్రస్తుతం ఇస్తున్నదానికి 10 శాతం మేర పెంచి రాష్ట్రానికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. వాస్తవానికైతే కంపెనీలు తమ సీఎస్ఆర్ వాటాను ఎక్కడైనా ఖర్చు చేయొచ్చు. ఆ ఒక్క కారణంతోనే కంపెనీలు నడుపుతున్న ప్రాంతం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై అలా కాకుండా తెలంగాణకు అధికంగా సీఎస్ఆర్ వాటా వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీల జాబితాను రూపొందించి.. ఆ కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి గడించిన ఆదాయం, చెల్లించిన సీఎస్ఆర్ ఫండ్ వివరాలను అధికారులు సేకరిస్తారు. దాని ప్రకారం ఇకపై చెల్లించాల్సిన వాటా, నిధుల వివరాలను లెక్కగట్టి ఆ మేరకు చెల్లించేలా కంపెనీలకు సూచించనున్నారు.
ఆశించిన స్థాయిలో లేని కార్యక్రమాలు..
ఇటీవల కొన్ని కంపెనీలు సీఎస్ఆర్ ఫండ్ నిధులతో రాష్ట్రంలోని పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ముందుకువచ్చినప్పటికీ.. కొంతకాలం తరువాత ఆశించిన స్థాయిలో నిర్వహించడంలేదని తేలినట్టు సమాచారం. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా కొత్త పాలసీ ఉండనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఇందులో సీఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అందులో కంపెనీలు విరాళాలిచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలను పొందుపరుస్తారు. ఈ పోర్టల్ ద్వారా కంపెనీలు ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తారు. సీఎస్ఆర్ ఫండ్ సేకరణ పెంపు నిర్ణయం నేపథ్యంలోనే ఈ విభాగం కోసం ‘డైరక్టర్ సీఎస్ఆర్ ఫండ్’ పేరుతో ఒక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ట్రంలో సీఎస్ఆర్ ఫండ్ గడిచిన ఐదేళ్లలో (2019-2020 నుంచి 2023-24వరకు) రూ.4,850 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇందులో 2022 నుంచి కొంతమేర పెరుగుదల ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రావడంలేదని తెలుస్తోంది. కంపెనీలు, సంస్థల ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన స్థాయిలో ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ.. సీఎస్ఆర్ ఆశించిన మేర రాకపోవడంతో ఈ నిధులను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. తద్వారా పలు విభాగాల్లో వెచ్చిస్తున్న నిధుల విషయంలో ప్రభుత్వంపైనా కొంత ఆర్థిక భారం తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.