నిచ్చెన ఎక్కాలంటే... ముచ్చెమటలే !
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:43 AM
పదడుగుల నిచ్చెన ఎక్కాలంటేనే పదిసార్లు ఆలోచిస్తారు. నిచ్చెన గట్టిగా ఉందా? ఎవరైనా పట్టుకోకుంటే జారిపోతుందా? అని తటపటాయిస్తారు.
పదడుగుల నిచ్చెన ఎక్కాలంటేనే పదిసార్లు ఆలోచిస్తారు. నిచ్చెన గట్టిగా ఉందా? ఎవరైనా పట్టుకోకుంటే జారిపోతుందా? అని తటపటాయిస్తారు. అలాంటిది ఐదు వేల అడుగుల ఎత్తులో ఒక కొండపై నుంచి మరొక కొండపైకి నిచ్చెన వేసి ఎక్కమంటే... ఊహించుకుంటేనే గుండె జారి గల్లంతవుతుంది కదూ! పర్యాటకులను ఆకర్షించడం కోసం చైనా అలాంటి నిచ్చెనను ఏర్పాటు చేసింది. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా కనిపించే ఆ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, ఎక్కి తీరాల్సిందే అని సాహసప్రియులు క్యూ కడుతున్నారు.
నిచ్చెన ఎక్కాలంటే కాళ్లలో సత్తువ ఉంటే సరిపోదు. గుండెల్లో గుప్పెడు ధైర్యం కూడా ఉండాలి. చైనాలో అలాంటి ఒక నిచ్చెన ఉంది. దాన్ని ఎక్కాలంటే ఎవరికైనా ముచ్చెమటలు తప్పవు. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్జియాజి నేచర్ పార్కులోకి వెళ్లగానే... అక్కడి కిక్సింగ్ పర్వతంపై భారీ నిచ్చెన ఏర్పాటు చేశారు. దాన్ని ‘టియాంటి’ అని పిలుస్తారు. అంటే... చైనీస్ భాషలో ‘ఆకాశ నిచ్చెన’ అని అర్థం.
ఎత్తైన ప్రదేశాల నుంచి ప్రకృతి సోయగాలను చూడాలని, నగర అందాలను వీక్షించాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికోసమే అతి పొడవైన నిచ్చెనను ఏర్పాటు చేశారు. అది కూడా రెండు కొండల మధ్యన. ఒక కొండ పై నుంచి మరొక కొండపైకి చేరుకునేందుకు ఈ నిచ్చెనను ఏర్పాటు చేశారు. ఈ నిచ్చెన పొడవు 551 అడుగులు. ఒక్కో మెట్టు మధ్య ఖాళీగా ఉంటుంది. అడుగు తడబడితే అంతే. ఐదు వేల అడుగుల పైన ఈ నిచ్చెన పైకి ఎక్కితే మబ్బుల్లో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది. కిందకు చూస్తే కళ్లు తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నట్టుగా ఉంటుంది. అయితేనేం.. సాహసప్రియులు వినూత్న అనుభూతిని ఆస్వాదించడం కోసం క్యూ కడుతున్నారట. మూడు గంటల పాటు సాగే ఈ నిచ్చెన ప్రయాణం ఆద్యంతం థ్రిల్‌ను పంచుతుంది.
భయం ఉన్నా...
సవాళ్లను ఇష్టపడేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా ఉంటోంది. ‘మొదట్లో చాలా మంది భయపడినా... ఇప్పుడు ఆకాశ నిచ్చెన ఎక్కడాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు’ అని నిర్వాహకులు అంటున్నారు. ఈ నిచ్చెన ఎక్కడానికి రోజుకు సగటున 1200 మంది వెళ్తున్నారట. ఒకానొక సమయంలో పర్యాటకులతో ఈ ప్రదేశం కిక్కిరిసిపోతుంది అని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘కిక్సింగ్ అడ్వెంచర్’ సంస్థ చెబుతోంది. నిచ్చెన ఎక్కిన పర్యాటకులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో టియాంటి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అక్కడకు వెళ్లి వచ్చిన పర్యాటకులు ఒక్కొక్కరు తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ‘కోటి రూపాయలు ఇచ్చినా నేను ఎక్కేందుకు ప్రయత్నించను’
అని ఒకరు అంటే, మరొకరు ‘ఆ నిచ్చెనను చూస్తుంటేనే నా చేతులు పూర్తిగా చెమటతో తడిసి పోయాయి’ అని సోషల్ మీడియాలో రాసు కొచ్చారు. పర్యాటకులు ఈ నిచ్చెన ఎక్కేందుకు నిర్వహణ సంస్థ సుమారు 5 వేల రూపాయలు వసూలు చేస్తోంది. ట్రిప్ మొత్తం కోచ్‌లు, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో సాగుతుంది.
నిబంధనలు పాటించాల్సిందే...
‘టియాంటి’ నిచ్చెన నిర్మాణంలో స్టీల్ హ్యాండ్ రెయిల్స్, ఫుట్ రెస్ట్‌లు, కేబుల్స్ ఉపయోగించారు. సాహస ప్రియులకు సేఫ్టీ హెల్మెట్లు, బెల్టులు, బ్యాక్‌ప్యాక్‌లు అందిస్తారు. ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే స్పందించేందుకు ఒక టీమ్ సిద్ధంగా ఉంటుంది. ఆకాశ నిచ్చెన ఎక్కేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు.
దీనిని ఎక్కాలనుకునే వ్యక్తులు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఉండాలి. హై బీపీ ఉన్న వారిని, గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని అనుమతించరు. మొత్తానికి థ్రిల్‌ని కోరుకునేవారికి ‘టియాంటి’ సరైన వేదికగా నిలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అదే నిజమైతే.. మాకు పిల్లలుండేవారు
Read Latest Telangana News and National News