Share News

నిద్రాదేవికి ‘ఓటీటీ’ శాపం!

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:15 AM

మన దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో విశ్రాంతీ అంతే ముఖ్యం. ‘ఎంతసేప’ని కాదు... ‘ఎలా’ నిద్రపోయామన్నదే కీలకమంటున్నాయి తాజా పరిశోధనలు.

నిద్రాదేవికి ‘ఓటీటీ’ శాపం!
OTT, Sleep

మన దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో విశ్రాంతీ అంతే ముఖ్యం. ‘ఎంతసేప’ని కాదు... ‘ఎలా’ నిద్రపోయామన్నదే కీలకమంటున్నాయి తాజా పరిశోధనలు. క్రమం తప్పని, గాఢమైన, అంతరాయాల్లేని నిద్ర లక్ష్యంగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే ఆధునిక జీవనశైలి నిద్రను నిర్లక్ష్యం చేస్తోంది. అర్థరాత్రి దాటినా ఆగని ‘ఓటీటీ’ల వీక్షణంతో... కనీస విశ్రాంతి కలగా మిగులుతోంది. నిద్రాదేవికి ‘ఓటీటీ’ల శాపమే... ఈ వారం కవర్‌ స్టోరీ.

రాత్రి 11 గంటల సమయం... ‘ఇంకో ఎపిసోడ్‌ చూసి పడుకుంటా’ అనుకున్నాడు పాతికేళ్ల నిశాంత్‌. వెబ్‌సిరీస్‌ చివర్లో అనూహ్యమైన మలుపు (క్లిఫ్‌ హ్యాంగర్‌), ఉత్కంఠను రేకెత్తిస్తూ రానే వచ్చింది! ఇంకేముంది... మరో ఐదు ఎపిసోడ్లు అతడికి తెలియకుండానే చకచకా దొర్లిపోయాయి. చివరికి నడిరాత్రి రెండున్నర గంటలకు పక్క మీదకు చేరి, ముసుగుతన్నాడు. ఎప్పటికోగాని నిద్రాదేవి కరుణించలేదు. పొద్దున్నే అలారం మోగినా... కళ్లు మండుతుంటే, లేవటానికి శరీరం సహకరించలేదు.


నిశాంత్‌ వయసున్న యువతరం మాత్రమే కాదు... ఓటీటీ వెబ్‌ సిరీస్‌లను ఇంటిల్లిపాదీ మొబైల్లోనో, టీవీలోనో చూడటం నిత్య జీవితంలో ఒక భాగమయ్యింది. భాషతో నిమిత్తం లేదు... నేరుగా ఒరిజినల్‌ భాషలోనో, ఆడియో అనువాదంగానో, సబ్‌ టైటిల్స్‌తోనో... ఎలా వీలైతే అలా! ఉద్వేగభరితంగా, ఏకబిగిన చూసి తీరాల్సిందే. దీంతో ప్రతీ ఒక్కరి విలువైన విశ్రాంతి సమయాన్ని తెర కబళించివేస్తోంది.


book4.2.jpgఆధునిక అవరోధం!

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జీ5 లాంటి ఓటీటీ వేదికల్లో వెబ్‌సిరీస్‌ల ఎపిసోడ్లను అదేపనిగా చూడటాన్ని ‘బింజ్‌ వాచింగ్‌’ అంటారు. ఈ అలవాటు నిద్రను పక్కకు నెట్టి, అర్థరాత్రి దాటాక కూడా కొనసాగుతూ ఉంటుంది. ‘ఆటో ప్లే’ వల్ల, కొన్ని క్షణాల్లోనే తర్వాతి ఎపిసోడ్‌ దానికదే మొదలై ప్రసారమవుతుంటే... కళ్లప్పగించి చూడకుండా ఉండలేని బలహీనత ప్రేక్షకులది. అందుకే బింజ్‌ వాచర్లలో 98 శాతం మంది అనుభవం, చెబుతున్న మాట ఒక్కటే... ‘నిద్ర దెబ్బతింటోంద’నే!

‘ఉల్లాసం కోసం, అలసట పోవటానికీ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నాం. మా ఆనందం కన్నా ఏదీ ఎక్కువ కాదు. ఇందులో కాస్త నిద్ర నష్టం తప్ప ఇంకేముంది?’ అని తేలిగ్గా తీసుకుంటున్నారా? ‘బింజ్‌ వాచ్‌’ అలవాటైతే... అనివార్యంగా నిద్ర ఆలస్యమై, విశ్రాంతి వ్యవధి తగ్గిపోతుంది. ఇక పొద్దున్నే అలసటతో మేలుకోవాల్సి వస్తుంది. పగలు కూర్చున్నచోటే కునికిపాట్లు తప్పవు. నిద్ర క్రమం (స్లీప్‌ సైకిల్‌) చిక్కుల్లో పడిపోతుంది. తత్ఫలితంగా ఉత్సాహం, చురుకుదనం తగ్గిపోతాయి.


శ్రమించి విశ్రమిస్తే...

పగలంతా పనిచేసి అలసిపోయి నిద్ర ఒడిలో ఒరిగాక ఏం జరుగుతుంది? శరీరం, మెదడూ శక్తిని భర్తీ చేసుకుని, వాటికవి బాగు చేసుకుంటాయి. రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులతో పోరాడే సత్తా వస్తుంది. ఈ విశ్రాంతి సమయంలోనే జ్ఞాపకశక్తి క్రోడీకరణ, సమాచార సంస్కరణ, శారీరక ఎదుగుదల, కండరాల వృద్ధి లాంటి ప్రక్రియలెన్నో జరుగుతాయి. అయితే సగటు భారతీయులు నిద్రకు తక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కంటి నిండా నిద్రపోయి, పొద్దెక్కాక లేచేవారిని కొందరు హేళనగా ఈసడిస్తుంటారు కూడా. అలాంటి మనదేశంలో... ముఖ్యంగా నగరాల్లో నిద్ర కొరత తీవ్ర సమస్యగా మారుతుండటం గమనించాల్సిన అంశం.


book4.3.jpgమెదడుకు విశ్రాంతి ఏదీ?

నిద్ర పోవడానికి ముందు మన మెదడు నెమ్మదిగా రిలాక్స్‌ అవ్వాలి. ఆలోచనలు తగ్గాలి. కానీ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌లు రిలాక్స్‌ అవుతున్నామనే భ్రమల్లో ఉంచి... వాస్తవానికి మెదడును వేడెక్కేలా, మరింత అలసిపోయేలా చేస్తాయి. ఎందుకంటే కథాగమనం, చిత్రీకరణ, నటనలతో సమ్మోహితులమై ‘బింజ్‌ వాచ్‌’ చేస్తుంటాం. ఈ సమయంలో థ్రిల్‌, ఉద్వేగం, ఉత్కంఠ... ఇవన్నీ మెదడును క్రియాశీలంగా, అప్రమత్తంగా ఉంచుతాయి. మనస్తత్వశాస్త్రంలో దీన్ని ‘ప్రీ స్లీప్‌ ఎరౌజల్‌’ అంటారు. దీనివల్ల బెడ్‌మీద పడుకున్నాక కూడా పెద్దగా నిద్ర పట్టదు. ‘బింజ్‌ వాచ్‌’ వల్ల రిలాక్స్‌ అవ్వడం, సామాజిక సంబంధాలు (‘ఫలానా వెబ్‌సిరీస్‌ చాలా బాగుంది. నువ్వు చూశావా?’ లాంటి పరస్పర సంభాషణలూ, అభిప్రాయాల, అనుభూతుల కలబోత), తాత్కాలికంగా మూడ్‌ మెరుగవ్వడం లాంటి ప్రయోజనాలు ఉండొచ్చు. అయితే అలాంటివి స్వల్పకాలికమే అని గుర్తించాలి. నిద్ర చేటు అనేది దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు (ఊబకాయం, ఒత్తిడి, వ్యాకులత మొదలైనవి) కారణమవుతుంది.


నీలికాంతితో పగటి భ్రాంతి

మెదడులో ఉత్పత్తి అయ్యే ‘మెలటోనిన్‌’ అనే హార్మోన్‌ వల్ల మనకు నిద్ర వస్తుందనేది వైద్య సూత్రం. అయితే మన చుట్టూ ఉండే వెలుతురు ఈ హార్మోన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఎక్కువ కాంతిలో తక్కువగా, చీకటి పరిసరాల్లో అధికంగా మెలటోనిన్‌ విడుదలవుతుంది. టీవీలూ, మొబైల్స్‌ తెరల్లోని నీలికాంతి మన మెదడుపై బలీయమైన ప్రభావం చూపుతుంది. మొబైల్‌ఫోన్‌ చేతిలో ఉంటే నిద్ర దూరం కావటానికి కారణం.. ఫోన్లోని నీలికాంతి. దీనివల్ల మెలటోనిన్‌ తగ్గి శరీరానికి ఇంకా పగలే అనిపిస్తుంది. అందుకే రాత్రి 10 గంటల తర్వాత స్ర్కీన్‌ ఆఫ్‌ చేయాలి (డిజిటల్‌ సన్‌సెట్‌). గదిలో లైట్లు డిమ్‌ చేయాలి. చుట్టూ నిశ్శబ్దం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నిద్ర సరిగ్గా పడుతుంది.


book4.4.jpgనిద్ర పట్టని నగర భారతం

మన దేశ ప్రధాన నగరవాసులు గాఢ నిద్రకు దూరమైపోయారని ఇటీవల ఓ సర్వే తేల్చింది. జనవరి 2025- మార్చి 2026 మధ్య మెట్రో నగరాల్లోని 3 వేల మందిని కలిసి ‘వేక్‌ఫిట్‌ డాట్‌ కో’ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. మితిమీరిన స్ర్కీన్‌ వ్యవధి, అస్తవ్యస్త దినచర్య, పని ప్రదేశంలో అలసటల వల్ల నగరవాసుల్లో నిద్రలేమి సంక్షోభస్థాయికి పెరిగిందంటూ నివేదికలో హెచ్చరించింది. రాత్రివేళల్లో మొబైల్‌ఫోన్‌ వాడకం నిద్రను బాగా దెబ్బతీస్తోంది. సర్వేలో 87.6 శాతం మంది నిద్రకు ముందు టీవీనో, మొబైలో చూస్తున్నామన్నారు. ప్రధానంగా బింజ్‌ వాచ్‌, సోషల్‌మీడియా రీల్స్‌ స్ర్కోలింగ్‌లతో తెరకు కళ్లప్పగించడం వల్లనే ఈ అరకొర నిద్రల తిప్పలని తేలింది.


రాత్రి 10 గంటల్లోపు నిద్రపోయే అలవాటు 12 శాతం మందికి మాత్రమే ఉంది. దాదాపు 60 శాతం మంది రాత్రి 11 గంటలు దాటాకే విశ్రమిస్తున్నారు. 29.1 శాతం మంది పనిభారం వల్ల ఆలస్యంగా నిద్రపోయి, తొందరగా లేస్తున్నారు. ఐదారు గంటలకు మించి నిద్రకు కేటాయించలేకపోతున్నారు. దాంతో ఆఫీసుల్లో ఉద్యోగుల పనితీరు, అంతిమంగా ఉత్పాదకత దెబ్బ తింటోంది. సర్వేలో పాల్గొన్నవారిలో పని ప్రదేశంలో పగటిపూట కునికిపాట్లు పడుతున్నామంటూ57.8 శాతం మంది చెప్పారు. ఈ సమస్య గత ఏడాదితో పోలిస్తే 7.8 శాతం పెరగటం గమనార్హం. సర్వేను విశ్లేషిస్తే... స్లీప్‌ హెల్త్‌ విషయంలో భారత్‌లోని పలు ముఖ్య నగరాల స్థితి ఇలా ఉంది.


book4.5.jpg

  • సూపర్‌ చెన్నై: దేశంలోనే క్రమశిక్షణతో నిద్రపోయేవారున్న నగరం చెన్నై. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోయేవారు 48.8 శాతం. ఆలస్యంగా లేచేవారు 23.8 శాతం. నిద్ర పట్టకపోవడం (ఇన్‌సోమ్నియా) బాగా తక్కువే.

  • హైదరాబాద్‌ పర్వాలేదు: నిలకడైన నిద్ర అలవాట్లు హైదరాబాద్‌ ప్రత్యేకత. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోయేవారు 42 శాతం. ఇన్‌సోమ్నియాతో బాధపడేవారు 31 శాతం. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఈ నగరం సమతూకంగానే ఉంది.

  • ఘనంగా గురుగ్రామ్‌: ఈ నగరంలో యువ ఉద్యోగులు ఎక్కువ. వర్క్‌ షెడ్యూల్స్‌తో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ... తట్టుకుంటూ సాపేక్షంగా ఆరోగ్యకరమైన స్లీప్‌ ఇండికేటర్సే ఇక్కడ నమోదవుతున్నాయి.


  • భలే బెంగళూరు: వేగవంతమైన పని సంస్కృతి, ఒత్తిళ్లకు ఇది కేంద్రం. అర్థరాత్రి దాటాక నిద్రకుపక్రమించేవారు 36.3 శాతం ఉన్నారు. అయితే నిద్రలేచాక విశ్రాంతిగా లేదంటున్నవారు 54 శాతం. ఈ వైరుధ్యం ఇక్కడి విశేషం.

  • సవాళ్లతో దిల్లీ: ఆలస్యంగా మేలుకునేవారిలో (45 శాతం) దేశ రాజధానిది మొదటి స్థానం. కునుకు పట్టని చిక్కులు ఇక్కడ 32 శాతం మందికి ఉన్నాయి. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇక్కడ అవాంతరాలు పెరుగుతున్న సూచనలు ఎక్కువే.

  • లేట్‌ నైట్‌ కోల్‌కతా: ఆలస్యంగా బెడ్‌ ఎక్కేవారు ఇక్కడ ఏకంగా 75.5 శాతం. అయితే మరీ పొద్దున్నే లేస్తూ నిద్ర చాలక ఒత్తిడికి గురయ్యేవారు 53.1 శాతం మంది ఉన్నారు.

  • ముంబై సమస్యాత్మకం: దేశంలోనే నిద్ర విషయంలో తీవ్ర సమస్యాత్మక నగరమిది. రాత్రంతా జాగు చేసేవారు ఇక్కడ 76.5 శాతం మంది. 42.5 శాతం మంది ఆలస్యంగా మేలుకుంటున్నారు. నిద్ర చాలక పని ప్రదేశంలో జోగుతున్నవారు సుమారు 60 శాతం.


సుఖనిద్ర కలేనా?

ఎలాంటి అంతరాయాలు లేకుండా, కంటినిండా సంతృప్తిగా నిద్రపోవడం ఒక వరం. కానీ భారతీయుల్లో చాలామందికి ఇది తీరని కలగానే ఉంటోందట! దేశవ్యాప్తంగా 393 జిల్లాల్లో 89 వేల మందిని కలిసి చేసిన మరో సర్వే ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది.

ఒక్కోసారి బాగా ఆలస్యంగా పడుకుని, పనుల ఒత్తిడి వల్ల తెల్లవారకముందే లేవాల్సివస్తుంది. తీరని ఆ నిద్ర అకౌంట్‌ అక్కడితో క్లోజ్‌ అవుతుందా? అంటే... లేదు. ఆ అప్పును తర్వాతైనా తీర్చాల్సిందే. నిద్ర కొరత భర్తీ అయ్యేలా మెదడు ‘ట్రాక్‌’ చేస్తుంది. కోల్పోయిన నిద్ర ‘రికవరీ’ అయ్యేలా బ్రెయిన్‌ సర్క్యూట్లు ‘ట్రిగ్గర్‌’ చేస్తాయని న్యూరోసైన్స్‌ పరిశోధకులు గుర్తించారు.


రాత్రి జాగారం చేసినా, కాసేపే పడుకున్నా... తర్వాతి రోజు నిద్ర మొహంతో జోగుతూ వుండటానికి కారణం ఇదే! ప్రతీరోజూ ఎనిమిది గంటలు నిద్రపోయే వ్యక్తి... ఆరు గంటలే నిద్రకు వెచ్చిస్తే... వారంలో 14 గంటల నిద్రారుణం పెరిగినట్టు. ఈ రుణం పెరుగుతూ, దాన్ని తీర్చే ప్రయత్నం చేయకపోతే... ఇక శారీరక, మానసిక చిక్కుల్లో చిక్కుకున్నట్టే. ఆరోగ్యంతో అలరారుతూ జీవించాలంటే సరైన నిద్ర తప్పనిసరి. మెదడు పనిచేయాలన్నా, భావోద్వేగాలు నిలకడగా ఉండాలన్నా, శారీరకంగా మెరుగ్గా ఉండాలన్నా మద్దతునిచ్చే కీలకమైన జీవ ప్రక్రియ నిద్ర. ఎక్కువకాలం నిద్రను నిర్లక్ష్యం చేస్తే వచ్చే చిక్కులు తక్కువేమీ కావు. గుండె జబ్బు, ఊబకాయం, మధుమేహం, పార్కిన్‌సన్‌, మూత్రపిండాల వైఫల్యం లాంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆందోళన, కుంగుబాటు వెంటాడతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ముప్పులు చాపకింద నీరులా మొదలవుతుంటాయి.


ఆరోగ్యానికి రక్షా కవచం

అస్తవ్యస్తపు విశ్రాంతి అలవాట్లు ఎప్పటికైనా ప్రమాదభరితమే. మెరుగైన ఆరోగ్యానికి 7- 7.5 గంటల నాణ్యమైన నిద్ర రక్షా కవచమని అన్నిరకాల పరిశోధనలూ ఆమోదిస్తున్నాయి. సుఖనిద్ర కోసం కొన్ని విధానాలు తప్పక పాటించాల్సిందే. అవేమిటంటే...

  • రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించాలి. రాత్రివేళ సాత్వికాహారమే మంచి ఛాయిస్‌.

  • నిద్రించే చోటు వెలుతురు, శబ్దాల్లేకుండా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

  • ప్రతీరోజూ ఒకే వేళకు.. వీలైనంత తొందరగా విశ్రమించాలి.

  • రాత్రివేళల్లో థ్రిల్లింగ్‌ కథాంశాలున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూడటం వీలైనంతగా తగ్గించాలి. మొబైల్‌, టీవీలకు తక్కువ వ్యవధి కేటాయించాలి.

  • నిద్రకు 30- 60 నిమిషాల ముందు టీవీ కట్టెయ్యాలి. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయాలి.

ఇలాంటివి ప్రతీరోజూ అలవాటు చేసుకుంటే... కమ్మటి నిద్ర, ఆపై విశ్రాంతి, ప్రశాంతత అందరికీ సాధ్యమే!

- సండే డెస్క్‌


యాప్‌తో స్లీప్‌

జీవనశైలి ఒత్తిడి, టెక్‌ కల్చర్‌, నగరీకరణల వల్ల ‘స్లీప్‌ యాప్‌’ల వాడకం పెరుగుతోంది. ఇంగ్లిష్‌, హిందీల్లోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో హాయినిచ్చే కథలతో పాటు... వాన, సముద్రపు అలల శబ్దాలూ వినొచ్చు. మెడిటేషన్‌ గైడెన్స్‌ పొందొచ్చు. ఉచిత, పెయిడ్‌ మొబైల్‌ యాప్‌లున్నాయి. ఇవి బెడ్‌ టైమ్‌ను గుర్తుచేస్తాయి. ఒత్తిడి, అతి ఆలోచనలు, నిద్రవేళల్లో ఆందోళన తగ్గించడానికి కూడా ఉపకరిస్తాయి. నిద్రించే వ్యవఽధి, లేట్‌నైట్‌ ఫోన్‌ వాడకం, క్రమబద్ధంగా లేని నిద్రా సమయాలు, గురక, ఇతర అవాంతరాలను ట్రాక్‌ చేస్తాయి.


సాంకేతికత పెరిగి స్లీప్‌ యాప్‌ల స్వరూపం మారుతోంది. ఇవి నిద్రను ట్రాక్‌ చేయడం నుంచి కోచింగ్‌ బిహేవియర్‌ దాకా తెలియజేస్తున్నాయి. అయితే మెడికల్‌ గ్రేడ్‌ స్లీప్‌ స్టడీస్‌ అంత కచ్చితమైనవి కావు. స్లీప్‌ ఆప్నియా, దీర్ఘకాలిక నిద్రలేమి లాంటి పెద్ద సమస్యలకు వైద్యచికిత్సేగానీ ఈ యాప్స్‌ పరిష్కారం కాదు. ఓవర్‌ ట్రాకింగ్‌ చేస్తే... కొన్నిసార్లు ఆత్రుత, ఆందోళనకు కారణం కావొచ్చు. చిత్రమైన విషయం ఏమిటంటే... స్మార్ట్‌ ఫోన్‌ అతి వాడకం నిద్రకు చేటు. దానికి పరిష్కారం చూపే స్లీప్‌ యాప్‌ ఉండేది మళ్లీ అదే ఫోనులో!


ఓటీటీ.. మన కంట్రోల్లోకి...!

ఓటీటీల్లో ఎపిసోడ్లను వరసబెట్టి చూసెయ్యడం, తర్వాత నిద్ర సరిపోవట్లేదనడం చాలామందికి అనుభవమే. ఈ బింజ్‌ వాచింగ్‌కు చెక్‌ పెట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి...

  • ఓటీటీల్లో తర్వాతి ఎపిసోడ్‌ దానికదే ప్రసారమయ్యేలా ఉంటుంది. అందుకే ఆటో ప్లే ఫీచర్స్‌ను టర్న్‌ఆఫ్‌ చేయాలి.

  • ఎపిసోడ్‌ చివరిదాకా చూస్తే ‘క్లిఫ్‌హ్యాంగర్‌’ వచ్చేసి, తర్వాతి ఎపిసోడ్‌ చూడాలనే ఆసక్తిని పెంచుతుంది. అందుకే ఎపిసోడ్‌ మధ్యలోనే... స్లో సీన్‌ దగ్గరే చూడటం ఆపెయ్యాలి.

  • ఆ రోజు ఎన్ని గంటలు/ఎపిసోడ్లు చూడాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికనుగుణంగా టైమర్‌ సెట్‌ చేసుకోవాలి.

  • ఓటీటీ సిరీస్‌ చూసే ప్రదేశంలో లైట్లు ఆన్‌ చేసుకుంటే సమయ పాలన ఉంటుంది.

  • ‘ఫలానా పని, ఎసైన్‌మెంటు పూర్తిచేస్తే ఒక ఎపిసోడ్‌’ అంటూ ఓటీటీ చూడటాన్ని రివార్డుగా పెట్టుకుని గట్టిగా పాటించాలి.

  • ఓటీటీ సినిమాలు, సిరీస్‌లను ఒంటరిగా చూడొద్దు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూస్తే.. గంటల తరబడి చూసే అలవాటు నుంచి బయటపడొచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

దక్షిణాదికి ముందుంది ముప్పు!

ఆ ఇద్దరు ఎక్కడ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2026 | 10:15 AM