Share News

పునర్వికకు పునర్జన్మ

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:51 AM

అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించింది.

పునర్వికకు పునర్జన్మ

  • లోకేశ్‌ సమక్షంలో చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్‌

  • క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా రూ.10 కోట్ల సమీకరణ

  • మిగిలిన రూ.6 కోట్లు అందించిన మంత్రి లోకేశ్‌

అమరావతి/కర్నూలు/వెల్దుర్తి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించింది. శనివారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి తెప్పించిన రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను మంత్రి లోకేశ్‌ సమక్షంలో చిన్నారికి చేసి, చికిత్సను విజయవంతంగా ముగించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతోంది. జన్మించి నాలుగు నెలలైనా పాపలో పూర్తిస్థాయిలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచనతో చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పునర్వికకు కోట్లలో ఒకరికి సోకే అరుదైన, ప్రాణాంతకమైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ సోకిందని, ఆమె రక్షించుకునేందుకు.. రూ.16 కోట్ల ఖరీదైన జోల్‌ జెన్‌ స్మా అనే ఒకసారి మాత్రమే ఇచ్చే జీన్‌ థెరపీ ఇంజెక్షన్‌ మాత్రమే మార్గమని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వారు ఈ ఏడాది జనవరిలో దాతల సాయం కోరారు. అదే సమయంలో ‘పునర్వికను పునర్జన్మనివ్వరూ..! శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఆ చిన్నారి కన్నవాళ్ల ఆవేదనను వెలుగులోకి తెచ్చింది. ‘సేవ్‌ పునర్విక.. పునర్వికను కాపాడుకుందాం..!’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా లక్షల హృదయాలు స్పందించాయి. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఫిబ్రవరి నాటికి రూ.10 కోట్లు సమకూరింది. చిన్నారి బతకాలంటే మరో రూ.6 కోట్లు కావాలి..! అప్పుడే ‘అన్నయ్యగా నేనున్నాను’ అంటూ మంత్రి లోకేశ్‌ ఆపన్నహస్తం అందించారు. పునర్విక బాధ్యత తాను తీసుకుంటానని, ఆ చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చారు.

Untitled-3 copy.jpg


అన్నమాట ప్రకారం తాను మరో రూ.6కోట్లు సమకూర్చి అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్‌ను త్వరితగతిన రప్పించే పనిని తన సిబ్బంది ద్వారా నిరంతరం లోకేశ్‌ పర్యవేక్షించారు. ప్రముఖ ఔషధ కంపెనీ నోవార్టిస్‌, రెయిన్‌బో ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులను సమన్వయపరిచారు. ఇంజకన్‌ రావడంతో చిన్నారికి ఇంజెక్షన్‌ ఇచ్చే వైద్య ప్రక్రియ పూర్తయ్యే వరకు లోకేశ్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన చేసిన కృషితో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. లక్షలాది మంది ఆశీస్సులతో పునర్విక ప్రాణం కాపాడుకోగలిగామని లోకేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కుమార్తెను బతికించుకోవడం కోసం ఆ తల్లిదండ్రుల ఆరాటం ఎంతో గొప్పదని కొనియాడారు.


జీవితాంతం గుర్తుంచుకుంటాం

పునర్వికకు తాము జన్మనిస్తే మంత్రి లోకేశ్‌, దాతల స్పందనతో పునర్జన్మ లభించిందని చిన్నారి తల్లిదండ్రులు జంపాల సురేశ్‌ కుమార్‌, పుష్పావతి సంతోషం వ్యక్తం చేశారు. లోకేశ్‌ సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్‌ భరోసా ఇచ్చారని తెలిపారు. తమ కుమార్తెకు చికిత్స చేసిన వైద్యులు, ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించిన, సాయం అందించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 19 , 2026 | 03:53 AM