డిజిటల్ అరెస్టు మోసంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:46 AM
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న‘డిజిటల్ అరెస్టు’ మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, శనివారం తెలుగు రాష్ట్రల్లోని ఐదు చోట్ల సోదాలు నిర్వహించి...
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న‘డిజిటల్ అరెస్టు’ మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, శనివారం తెలుగు రాష్ట్రల్లోని ఐదు చోట్ల సోదాలు నిర్వహించి ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి, అతడి వద్ద నుంచి రూ.1.6కోట్లు దోచుకున్న కేసులో దర్యాప్తు చేయగా ఈ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోసంలో ఇండస్ ఇండ్ బ్యాంకు సిబ్బంది పాత్ర కీలకంగా మారింది. నిందితులకు సహకరిస్తూ, కనీస కేవైసీ నిబంధనలు పాటించకుండా అసిస్టెంట్ మేనేజర్ మ్యూల్ ఖాతాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. మరో ఇద్దరు పలు ప్రాంతాల్లోని అమాయకులకు కమీషన్ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు అందించేవారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును ఈ ఖాతాల ద్వారానే వేరే ఖాతాలకు మళ్లించి డ్రా చేసినట్లు సీబీఐ గుర్తించింది. సోదాల సమయంలో కీలక పత్రాలు, ఎలకా్ట్రనిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.