దక్షిణాదికి ముందుంది ముప్పు!
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:53 AM
క్షవరం అయితే గానీ వివరం తెలియదు అని అంటారు. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. వరుస విజయాల రుచి మరిగిన పార్టీలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తప్పటడుగులు...
సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవాలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి కూడా అనుభవంలోకి వస్తున్నాయా?
కేంద్ర పెద్దలు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించడం వల్ల గతంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా శుక్రవారంనాడు లోక్‌సభలో వీగిపోయింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏదో ఒక మ్యాజిక్ చేయకపోతారా అని ఎన్డీయే ఎంపీలు ఆశపడ్డారు. అంతకు మించి వారికి ఏమీ తెలియదు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ పెద్దలు తమ నిబద్ధతను వివరించి ఉండాల్సింది. అన్ని రాష్ట్రాలలో 50 శాతం సీట్లు పెరుగుతాయని చెప్పి ఆ మేరకు బిల్లులో మార్పులు చేసి ఉండవలసింది.
అన్నీ సాధించుకోగలిగిన మోదీ-షా ద్వయం ఇప్పుడెందుకు వైఫల్యం చెందారు? అని ప్రశ్నించుకుంటే, మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం అన్న సమాధానం లభిస్తుంది.
క్షవరం అయితే గానీ వివరం తెలియదు అని అంటారు. ఈ విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. వరుస విజయాల రుచి మరిగిన పార్టీలు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తప్పటడుగులు వేస్తుంటాయి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవాలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి కూడా అనుభవంలోకి వస్తున్నాయా? రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో తగిన బలం లేకపోయినా డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును జోడించిన ఎన్డీయే ప్రభుత్వానికి శుక్రవారంనాడు లోక్‌సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు లోక్‌సభ, శాసనసభ సీట్లను 50 శాతం వరకు పెంచి 2029లో జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని మోదీ తలపోశారు. తన హయాంలోనే ఇవన్నీ జరుగుతాయని ప్రధానమంత్రి వివిధ సందర్భాలలో అనధికారికంగా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో వరుస విజయాలతో జోరు మీదున్న బీజేపీ, ఈ విషయంలోనూ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులూ భావించారు. అయితే ఎక్కడో లెక్కలు తప్పాయి. ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దేశాలు మంచివే అయినా వాటి సాధనకు ప్రతిపక్షాల సహకారం అవసరం అని గుర్తించి ఉంటే బీజేపీకి ఈ పరిస్థితి ఎదురై ఉండేది కాదేమో! కేంద్ర పెద్దలు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించడం వల్ల గతంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా శుక్రవారంనాడు లోక్‌సభలో వీగిపోయింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏదో ఒక మ్యాజిక్ చేయకపోతారా అని ఎన్డీయే ఎంపీలు ఆశపడ్డారు. అంతకు మించి వారికి ఏమీ తెలియదు. ప్రధాని మోదీ శక్తియుక్తులపై వారికి ఉన్న ధీమా వల్ల రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరమైన మద్దతును ఎలా సమకూర్చుకోబోతున్నారు? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ప్రశ్నించలేదు. పేరుకు ఎన్డీయే కూటమి అయినా అక్కడ సమష్టి నిర్ణయాలకు తావు లేదు.
విషయం ఏదైనా ప్రధాని మోదీ అనుకున్నదే జరుగుతోంది. దేశ రాజకీయాల్లోనే ఆయన ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్నందున స్వపక్షం గానీ, మిత్రపక్షాలు గానీ ప్రశ్నించే సాహసం చేయడంలేదు. డీలిమిటేషన్ బిల్లులో అన్ని రాష్ర్టాలలో 50 శాతం సీట్లు పెరుగుతాయని పేర్కొనలేదు. జనాభా ప్రాతిపదికన అని మాత్రమే బిల్లులో ప్రస్తావించారు. దీంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ర్టాలలో 50 శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు. నిజానికి 50 శాతం సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు ఎలాంటి అన్యాయం జరగదు. ఈ కారణంగా నిరసనలు సద్దుమణిగాయి. అయితే సభలో అవసరమైన మెజారిటీ లేనప్పుడు ఏకాభిప్రాయ సాధన ద్వారా బిల్లులకు ఆమోదం పొందడం ఆనవాయితీగా వస్తోంది. డీలిమిటేషన్‌కు రాజ్యాంగ సవరణ అవసరం అయినప్పుడు దానిపై అన్ని రాజకీయ పార్టీలనూ సంప్రదించి ఉండవలసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును దానికి జోడించడం ద్వారా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఇండియా కూటమికి కల్పించవచ్చునని కేంద్ర పెద్దలు తలపోసి ఉంటారు. ఈ కారణంగానే ఏకపక్షంగా వ్యవహరించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ పెద్దలు తమ నిబద్ధతను వివరించి ఉండాల్సింది. అన్ని రాష్ర్టాలలో 50 శాతం సీట్లు పెరుగుతాయని చెప్పి ఆ మేరకు బిల్లులో మార్పులు చేసి ఉండవలసింది. కారణం తెలియదు గానీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం కూడా జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా ఏం జరగబోతున్నదో తెలియలేదు. అంతా మోదీ–షాలు చూసుకుంటారని వారు భావించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసుకోవాలి. లేని పక్షంలో సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సమకూర్చుకోవాలి. ఈ రెండూ జరగకపోవడం వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా వీగిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తొలి ఓటమి. ఇంకా చెప్పాలంటే ఇదొక అపశకునం. ఈ టర్మ్‌లోనే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డీలిమిటేషన్ చేసి 2029లో జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టాలన్న ప్రధాని మోదీ సంకల్పం ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది. ఈ పరిణామం ప్రతిపక్షాల విజయమా? అధికార కూటమి అపజయమా? అన్నది పక్కనపెడితే ప్రధాని మోదీ తలపోసిన మూడు అంశాలు వాంఛనీయమే. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. డీలిమిటేషన్ కోసం కూడా రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. సీట్ల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాయి. జమిలి ఎన్నికలు కూడా దేశానికి అవసరమే. ఇందులో ప్రధాని మోదీకి రాజకీయ స్వార్థం ఉందా? అంటే ఉండవచ్చు.
ఏ రాజకీయ పార్టీ అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలను వద్దనుకోదు కదా? అయితే ఇప్పటివరకు అనుకున్నవి అన్నీ సాధించుకోగలిగిన మోదీ–షా ద్వయం ఇప్పుడెందుకు వైఫల్యం చెందారు? అని ప్రశ్నించుకుంటే, మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం అన్న సమాధానం లభిస్తుంది. రాజకీయంగా ఇప్పటివరకు వారి పాచికలన్నీ పారాయి. రాజ్యసభలో తగిన సంఖ్యా బలం లేకపోయినా అనేక బిల్లులకు ఆమోదం పొందగలిగారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలోనే అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. స్వపక్షంలోనే కాకుండా భాగస్వామ్య పక్షాలలో కూడా వారిరువురి ప్రతిష్ఠకు ఇదొక మచ్చగా నిలుస్తుంది. ఇంతకూ ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది అని ప్రశ్నించుకుంటే, జాతీయ స్థాయిలో కూడా ఏకపక్ష నిర్ణయాలకు దారులు వేయడమే కారణం అని తెలుస్తోంది. రాజకీయ పార్టీలలో వ్యక్తి ఆరాధన పెరిగిపోతున్నది. వ్యక్తి ఆరాధన కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి దాపురించింది. సమష్టి నిర్ణయాలకు తావు లేకుండా, భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించకుండా ఆ కుటుంబం అనుకున్నదే ఫైనల్ అన్నట్టుగా పార్టీ నడిచింది. ఫలితంగా కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. సమష్టి నాయకత్వం ఉండేది. పార్టీని సరైన మార్గంలో నడిపించడం కోసం ఆరెస్సెస్ వంటి సంస్థలు ఉండనే ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రాబల్యం పెరగడం మొదలయ్యాక బీజేపీలో కూడా పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ బాటలోనే వ్యక్తి ఆరాధన మొదలైంది. పార్టీని మించి ప్రధాని మోదీ ఎదిగిపోయారు. ఆయన అనుకున్నదే పార్టీ నిర్ణయంగా చెలామణి అవుతూ వస్తోంది. నంబర్ వన్, నంబర్ టూ తర్వాత ఆ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఇందుకు అనుగుణంగా పార్టీపరంగానూ, ప్రభుత్వపరంగానూ నిర్ణయాలన్నీ వారిద్దరి కనుసన్నల్లోనే జరుగుతూ వచ్చాయి. పార్టీ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ కూడా ఇందుకు అలవాటు పడిపోయాయి. ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించే బాధ్యతను వారిరువురే చేపట్టారు. ఫలితంగా సొంతంగా ఆలోచించడం అనే ప్రక్రియకు బీజేపీ నాయకులు స్వస్తి చెప్పారు. మంచైనా చెడైనా ప్రధాని మోదీయే చూసుకుంటారులే అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ కారణంగానే డీలిమిటేషన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతు ఎలా సమకూర్చుకోబోతున్నారని స్వపక్షంవారు గానీ, మిత్రపక్షాలు గానీ ప్రశ్నించలేదు. ప్రధాని మోదీ చెబుతున్నారు కనుక డీలిమిటేషన్ జరిగితే చట్టసభల్లో సీట్లు పెరుగుతాయని, మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని, 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అందరూ నమ్మేశారు. ప్రతిపక్షాల సహకారం లేకుండా ఇదెలా సాధ్యం? అన్న సందేహం ఒక్కరికి కూడా రాలేదు. ప్రధాని మోదీ అనుకుంటే చేసి తీరుతారు అన్న భరోసా ఏర్పడటంతో జమిలి ఎన్నికలకు కూడా రాజకీయ పార్టీలు సిద్ధపడిపోయాయి. ఈ నేపథ్యంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ఎన్డీయేకు షాకింగ్ పరిణామం.
తొలి అవమానం!
సమష్టి నాయకత్వం లేకపోయినా సమష్టి నిర్ణయాలన్నా ఉండాలి. అలా జరగనప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని మోదీ–షాలు ఎలా అధిగమిస్తారో చూడాలి. చట్టసభలలో తగిన సంఖ్యా బలం లేని సందర్భాలలో గతంలో ప్రభుత్వాలు ప్రతిపక్షాల సహకారం తీసుకొనేవి. తమ లక్ష్యాలను వివరించి నచ్చజెప్పేవి. కేంద్ర ప్రభుత్వానికి తాజా పరిణామం ఒకరకంగా అవమానమే. ప్రధాని మోదీ భావిస్తున్నట్టు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్, జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం కావాలంటే ప్రతిపక్షాల సహకారం తీసుకోవలసిందే. డీలిమిటేషన్ ఇప్పుడు జరగని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్టుగా 2026 జనాభా ప్రాతిపదికనే తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ర్టాలు 35 సీట్ల వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ రాష్ర్టాల సీట్లు అధికంగా పెరుగుతాయి. ఇలా జరిగితే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన దక్షిణాది రాష్ర్టాల ఎంపీలు తమ గొయ్యి తామే తీసుకున్నట్టు అవుతుంది. ప్రస్తుత బిల్లు ఆమోదం పొందివుంటే ఈ నష్టం తప్పి ఉండేది. ఉత్తరాదిన సీట్లు అదనంగా పెరగడం భారతీయ జనతా పార్టీకి లాభం అన్నది విస్మరించకూడదు. అన్ని రాష్ర్టాలలో ఒకే తీరుగా 50 శాతం సీట్లు పెరిగితే ఏ రాష్ర్టానికీ అన్యాయం జరగదు. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పార్టీలు ఇప్పటికైనా చొరవ తీసుకొని 50 శాతం సీట్లు అదనంగా పొందడానికి అవసరమైన మద్దతును కేంద్రానికి ఇవ్వడం మంచిది. భారతీయ జనతా పార్టీ కూడా ప్రస్తుత ధోరణికి స్వస్తి చెప్పి ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం పొందడానికి కృషి చేయాలి. పార్లమెంటు పరిష్కరించవలసిన ఈ సమస్యకు వీధుల్లో ఆందోళన చేయడం వల్ల పరిష్కారం లభించదు. ప్రతిపక్షాలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం వల్ల సమస్య ఏ మాత్రం పరిష్కారం కాదు.
ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ దాకా..
ఏ పార్టీలో అయినా ఏక వ్యక్తి ఆధిపత్యం వల్ల అనర్థాలే అనుభవంలోకి వస్తాయి. తెలుగునాట ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత రాజకీయాలలో వ్యక్తి ఆరాధన పెరిగింది. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ను పార్టీ శ్రేణులు కర్త, కర్మ, క్రియగా భావించేవారు. ఆయన కూడా నాతో పుట్టిన పార్టీ నాతోనే పోతుంది అనేవారు. అనేక సందర్భాలలో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనేవారు. అవన్నీ పార్టీకి నష్టం చేశాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఐఏఎస్ అధికారి యూబీ రాఘవేంద్రరావు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఉన్నంతవరకు ఎన్టీఆర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాకచక్యంగా నిలువరించేవారు. దురదృష్టవశాత్తు విజయవాడలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు తగిన సలహాలు సూచనలు ఇవ్వగలిగిన అధికారి లభించలేదు. ఈ నేపథ్యంలోనే మంత్రి మండలి సమావేశం వివరాలు లీక్ చేస్తున్నారని చెప్పి 31 మంది మంత్రులను ఎన్టీఆర్ ఒక్క కలం పోటుతో తొలగించారు. ఆ తర్వాత రెండు మూడు వారాల పాటు క్యాబినెట్ లేకుండా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నడిపారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఎన్టీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. సమష్టి ఆలోచనలకు తావు లేనందున ఎన్టీఆర్ అంతటివాడు కూడా ఫలితం అనుభవించక తప్పలేదు. ఆ తర్వాత 1999–2004 మధ్య చంద్రబాబు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. విద్యుత్ సంస్కరణలు అని చెప్పి విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా పెంచేశారు. ప్రజా వ్యతిరేకతను గుర్తించి పెంచిన చార్జీలను కొంత మేరకు తగ్గించినా 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి అదే ప్రధాన కారణమని కూడా చెప్పవచ్చు. 1995–1999 మధ్య తెలుగుదేశం పార్టీలో సమష్టి నిర్ణయాలు ఉండేవి. 1999–2004 మధ్య చంద్రబాబు పార్టీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. సలహాలు, సూచనలు స్వీకరించే దశ దాటిపోయారు. రాజకీయంగా ఆలోచించకుండా బ్యూరోక్రాట్ తరహాలో ఆలోచించి ప్రభుత్వాన్ని నడిపారు. పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో లేకుండా తన చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నారు. రాజశేఖరరెడ్డి వంటి బలమైన నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని విస్మరించి కడప జిల్లా నుంచి సరస్వతి అనే ఆమెను మంత్రిని చేశారు. ఎదురు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఇటువంటి అపసవ్య నిర్ణయాలు అనేకం అప్పట్లో ఆయన తీసుకున్నారు. ఫలితంగా 2004లో ఓడిపోయారు. 2014– 2019 మధ్య కూడా పార్టీలో ఉమ్మడి ఆలోచనలకు తావు లేకుండా చేసుకున్నారు. అధినాయకుడు ఎంత సమర్థుడైనా వారిలో అతి విశ్వాసం ఏర్పడకుండా ఉండటానికి ఏదో ఒక యంత్రాంగం ఉండాలి. లేని పక్షంలో చేదు అనుభవాలే ఎదురవుతాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి విషయమే తీసుకుందాం.
అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే విషయం పరిశీలిస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలనుకున్నప్పుడు అది సరైన నిర్ణయం కాదని ఇదే వీకెండ్ కామెంట్/కొత్త పలుకులో రెండు మూడు పర్యాయాలు స్పష్టంగా పేర్కొన్నాను. ఇంటి పార్టీగా ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలనుకోవడం ఆత్మహత్యాసదృశం అవుతుందని హెచ్చరించాను. తెలంగాణ అన్న పేరుకు దూరమవడం తెలివి తక్కువ నిర్ణయమని విమర్శించాం కూడా. పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవారు. అయితే ఎవరూ నోరు విప్పడానికి సాహసించలేకపోయారు. భిన్నాభిప్రాయాలను కేసీఆర్ ప్రోత్సహించేవారు కాదు. కాలక్రమంలో ఆ పార్టీ నాయకులు సొంతంగా ఆలోచించడం మానేశారు. కేసీఆర్‌లో అపారమైన తెలివితేటలు ఉన్నాయని, ఆయన వేసే రాజకీయ ఎత్తుగడలకు తిరుగుండదని, ఆయన ఎలా చెబితే అలాగే జరుగుతుందని నమ్మే స్థితికి చేరుకున్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా విస్తరించి భారత రాష్ట్ర సమితి పేరిట ఇతర రాష్ర్టాలలో కూడా పోటీ చేసి తగినన్ని సీట్లు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ చెప్పగానే కాబోలు అని నమ్మేశారు. జాతీయ రాజకీయాలు అంటూ నేల విడిచి సాము చేసిన ఎన్టీఆర్, చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవాల గురించి నాబోటివాడు చెప్పినా ఆ పార్టీ నాయకులు చెవికెక్కించుకోలేదు. తెలంగాణను బాగుచేయమని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ ఎగరడాన్ని తెలంగాణ సమాజం కూడా హర్షించలేదు. ఫలితంగానే 2023లో ఓడించారు. పార్టీలో సమష్టి నిర్ణయాలు, ఆలోచనలకు తావులేకుండా చేయడం వల్లనే కేసీఆర్ రాజకీయంగా దెబ్బతిన్నారు. సొంత బుర్రలతో ఆలోచించే వారిని పార్టీలో లేకుండా చేయడం వల్లనే బీఆర్‌ఎస్‌కు ప్రస్తుత దుస్థితి. అలా ఆలోచించగలిగే వారిని పార్టీ ప్రోత్సహించి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కూడా మారి ఉండేది కాదు. అధినాయకుల్లో నియంతృత్వ పోకడలు పెరగడానికి సమష్టి నిర్ణయాలు లేకపోవడమే కారణం. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామని ఇంత కాలానికి కేటీఆర్ అంగీకరించారు. ఇదొక శుభ పరిణామం. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, అతిశయంతో వ్యవహరించిన వారికి గుణపాఠాలు తప్పవు. ఎన్టీఆర్ అంతటి నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఉదంతాలు తెలిసి కూడా కేసీఆర్ అదే బాటలో అహంభావంతో వ్యవహరించారు. నేల విడిచి సాము చేశారు. అనూహ్యంగా పరాజయం మూటగట్టుకున్నారు. ఏ పార్టీకైనా బలమైన నాయకుడు ఎంత ముఖ్యమో స్వతంత్రంగా ఆలోచించి ప్రజాభిప్రాయాన్ని అధినాయకుడికి నిక్కచ్చిగా చెప్పగలిగిన నాయకులు కూడా అంతే అవసరం. అలాంటి నాయకులు ఉండి ఉంటే కేసీఆర్ ఆలోచనలు పెడమార్గం పడుతున్నాయని అనుకున్నప్పుడు అడ్డుపడేవారు కదా!

జగన్‌రెడ్డిదీ కేసీఆర్ బాటే!
కేసీఆర్ మార్గంలోనే వైసీపీ కూడా నడుస్తోంది. ఆ పార్టీలో కూడా అధినాయకుడు జగన్‌రెడ్డి మాటలకు ఎదురుండదు. బీఆర్‌ఎస్‌లో కంటే వైసీపీలో మరింతగా వ్యక్తి పూజ ఉంటోంది. కేసీఆర్ వద్ద అభిప్రాయాలు పంచుకోవడానికి కేటీఆర్, హరీశ్‌రావు వంటివారు ఇప్పుడు ఉన్నారు. జగన్‌రెడ్డి వద్ద అలాంటి వారు ఒక్కరు కూడా కనిపించరు. సలహాలు, సూచనలు అంటే అతనికి మహా చెడ్డ చిరాకు అని చెబుతారు. జగన్‌రెడ్డి వద్ద తాము ఆత్మాహుతి దళంలా పనిచేస్తామని, ఆయన ఏం చెబితే అదే చేస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి స్వయంగా చెప్పుకొంటున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాజధానికి సంబంధించి జగన్‌రెడ్డి నోటివెంట వెలువడిన ‘మావిగన్’ అనే ప్రతిపాదనను ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. తమ రాజధాని అమరావతి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. అయినా ‘మావిగన్’ అనే పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, జగన్ ప్రతిపాదించిన మావిగన్.. అమరావతి కంటే గొప్పదని ప్రచారం చేయడానికి వైసీపీ నాయకులు వెనుకాడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మావిగన్‌కు ప్రజామోదం లేదని తెలిసి కూడా జగన్‌రెడ్డి చెబుతున్నారు కనుక అదే పేరును పట్టుకొని వేలాడటాన్ని ఏమనుకోవాలి? వైసీపీలో వ్యక్తి ఆరాధన పరాకాష్ఠకు చేరుకున్నందునే ఇలాంటి అసంబద్ధ ప్రతిపాదనలకు అడ్డుచెప్పేవారు లేకుండా పోయారు. అయితే ఇలా జరగడం వలన నష్టం ఎవరికి? వైసీపీకే కదా? నాయకుడిని అభిమానించడం వేరు.. గుడ్డిగా ఆరాధించడం వేరు. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకున్న వారినే ప్రజలు మళ్లీ మళ్లీ ఆదరిస్తారు. అలా కాకుండా మూర్ఖంగా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వాదించేవారు ప్రజల్లో అభాసుపాలవుతారు. మావిగన్ ప్రతిపాదన తర్వాత జగన్‌రెడ్డి ప్రజల్లో నవ్వులపాలయ్యారు. అంతకు ముందుతో పోల్చితే ఆయన గ్రాఫ్ ఇప్పుడు పడిపోయింది. ఇది నిజమో కాదో వారు సర్వే చేసుకొని తెలుసుకోవచ్చు. జగన్‌రెడ్డి చెప్పాడని మా సంస్థలపైకి దండెత్తబోయారు. ఇప్పుడు వారం రోజులుగా కిమ్మనడం లేదు. నేనేమీ వారు కోరినట్టు క్షమాపణలు చెప్పలేదే! సొంత వ్యక్తిత్వం లేనివాళ్లు నాయకులు ఎలా అవుతారు? ఉగ్రవాద సంస్థలు ప్రయోగించే ఆత్మాహుతి దళాలు ఏమీ సాధించకుండానే పిచ్చి చావు చస్తుంటాయి. రాజకీయాల్లో కూడా ఆత్మాహుతి దళాలు ఉంటాయని ఇప్పుడు మిథున్‌రెడ్డి చెబితేనే తెలిసింది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం.
ఈ వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తున్న పార్టీలలోనే ప్రజాస్వామ్యం లేకపోతే ఎలా? నాయకుల నిరంకుశ పోకడల వల్ల ఆ పార్టీలు దెబ్బతినడమే కాకుండా సదరు నాయకుల నిర్ణయాల ప్రభావం ప్రజలపై కూడా పడుతుంది. ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా సమష్టి ఆలోచనలకు తావు ఇవ్వని పక్షంలో ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయి. ప్రశ్నించేవాళ్లు ఉన్నప్పుడే ఏ వ్యవస్థ అయినా దారి తప్పకుండా పనిచేస్తుంది. రాజకీయ పార్టీల అధినేతలకు కూడా ఇది వర్తిస్తుంది. క్షవరం జరిగినా వివరం తెలియకపోతే చేయగలిగేది ఏమీ ఉండదు. అలాంటి వాళ్లు పరాజితులుగానే మిగిలిపోతారు!
ఆర్కే
ఇవి కూడా చదవండి..
మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు