40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన ఆలయం.. రాజస్థాన్‌లో అద్భుత జైన మందిరం!
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:29 AM
పాలరాతితో నిర్మించిన గుళ్లను చూసి ఉంటారు. అద్భుతమైన శిల్ప కళా సౌం దర్యంతో అలరారే ఆలయాలను దర్శించుకుని ఉంటారు.
పాలరాతితో నిర్మించిన గుళ్లను చూసి ఉంటారు. అద్భుతమైన శిల్ప కళా సౌం దర్యంతో అలరారే ఆలయాలను దర్శించుకుని ఉంటారు. కానీ నెయ్యితో నిర్మించిన గుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా?
రాజస్థాన్‌లోని బికనేర్‌లో నలభై వేల కిలోల నెయ్యితో నిర్మించిన ఆలయం ఉంది. పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. జైన మతంలో ఐదవ తీర్థంకరుడైన సుమతీనాథ్ కొలువై ఉన్న ఈ విశిష్ట ఆలయాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.
15వ శతాబ్దంలో నిర్మాణం...
రాజస్థాన్... పర్యాటకులకు కచ్చితంగా ఒక డ్రీమ్ డెస్టినేషన్. అబ్బురపరిచే కోటలు, ఇసుక తిన్నెలు... ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటిచోట ఆర్కిటెక్చర్ అద్భుతంగా పిలిచే జైన మందిరం ఒకటుంది. ఎడారి నగరం బికనేర్‌లో 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘భండాసర్ టెంపుల్’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణంలో 40వేల కిలోల నెయ్యిని ఉపయోగించడం విశేషం. ఎడారి ప్రాంతం కావడంతో సహజంగానే నీళ్లకు చాలా ఇబ్బంది ఉండేది. స్థానికులు తాగడానికే నీళ్లు లభించేవి కావు. అలాంటి పరిస్థితుల్లో గుడి నిర్మాణానికి నీళ్లు వాడటం అసాధ్యంగా మారింది. దాంతో మోర్టార్ తయారీలో నీళ్ల స్థానంలో నెయ్యిని ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. వేసవిలో ఎండలు మండిపోతున్న రోజుల్లో ఆలయంలో నెయ్యి కరిగి ఫ్లోరింగ్‌పై చుక్కలుగా పడటాన్ని స్థానికులు ఇప్పటికీ గమనిస్తుంటారు.
కనువిందు చేసే కళ
1468లో బికనేర్కు చెందిన జైన వ్యాపారి భండాసా ఓస్వాల్ ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో రాజస్థాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాగడానికే నీళ్లు కరువైన సమయంలో గుడి నిర్మాణం ఎలా చేస్తారని ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఆ వ్యాపారి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆలయ నిర్మాణంలో ఒక్క నీటి చుక్కను కూడా వాడలేదు. మరో వ్యాపారి విరాళంగా అందచేసిన నెయ్యిని మోర్టార్ తయారీలో వాడారు.
అయితే భండాసా 1514లో మరణించారు. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు నిర్మాణం నత్తనడకన కొనసాగింది. చివరకు 1554లో ఆలయ నిర్మాణం పూర్తయింది. మొత్తంగా ఆలయ నిర్మాణానికి 86 ఏళ్లు పట్టింది. మూడు అంతస్థుల్లో ఉన్న ఈ ఆలయం రాజస్థానీ నిర్మాణ శైలి, జైనుల శిల్పకళతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఆలయ గోడలు అందమైన కుడ్యచిత్రాలు, అద్దాల అలంకరణ కనువిందు చేస్తాయి. ఆలయంలోని కళాత్మక అలంకరణలు, అద్భుతమైన నిర్మాణ శైలి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ జైన ఆలయ నిర్మాణంలో ఎర్ర ఇసుక రాయి, పసుపు రంగు రాళ్లను ఉపయోగించారు. ఆలయం లోపల శిల్పకళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ స్తంభాలపై పూల ఆకృతులతో కూడిన నమూనాలు, పైకప్పులపై రేఖాగణిత ఆకృతులు ఆలయ నిర్మాణానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఆలయ గోడలపై జైన మతానికి సంబంధించిన అంశాలు, తీర్థంకరుల జీవితాలు, కథలను ప్రతిబింబించే కుడ్యచిత్రాలు జైన మత గొప్పతనాన్ని తెలియజేస్తాయి. 24 జైన తీర్థంకరుల శిల్పాలు ఇక్కడ చూడొచ్చు. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించి, రక్షిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News