పక్కింటి అబ్బాయి మిస్సింగ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:21 AM
పక్కింట్లో కాస్త డీసెంట్‌గా కనపడే... ఓ మోస్తరు హైటు, చామనఛాయ.. బాగా దువ్విన క్రాఫు, గళ్ళ చొక్కా వేసుకుని చూట్టానికి సుమారుగా ఉండే పిల్లకాయ ఒకడు మిస్ అయ్యాడు....
కాస్త వెతికిపెడతారా?
పక్కింట్లో కాస్త డీసెంట్‌గా కనపడే... ఓ మోస్తరు హైటు, చామనఛాయ.. బాగా దువ్విన క్రాఫు, గళ్ళ చొక్కా వేసుకుని చూట్టానికి సుమారుగా ఉండే పిల్లకాయ ఒకడు మిస్ అయ్యాడు.
ఎక్కడికి పొయ్యాడో కాస్త కనుక్కుని చెప్తారా?.. తెలుగు సినిమాల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ పిల్లాడు కనపడ్డాడు. చాలా క్యాజువల్‌గా, సింపుల్‌గా ఉండేవాడు. పెద్ద ఎలివేషన్స్ లేవు, అలాని ఆర్ట్ సినిమాలు కావు. ఏదో ఫ్యామిలీ కుర్రోడులా కాస్త కామెడీ టైమింగ్‌తో బాగానే ఎంటర్‌టైన్ చేసేవాడు.
అష్టా చెమ్మా అంటూ అచ్చమైన తెలుగు టైటిల్‌తో అడుగెట్టాడేమో బాగా గుర్తుండిపోయింది.. ఆ పిల్లోడు ఏమయ్యాడో కనబడటం లేదు. భీమిలీలో కబడ్డీ జట్టులో ఆడిన ఊరి కుర్రోడు ఇప్పుడు ఊరినే వదిలేసి ఆడటం కూడా మర్చిపోయాడు. ‘అలా మొదలైంది’ సినిమాలో సిల్లీ ప్రేమికుడు ఇప్పుడు కనబడుటలేదు. పిల్లజమీందార్ సినిమాలో ఆస్తికోసం డిగ్రీ పూర్తిచేయడానికి అష్టకష్టాలు పడ్డ తింగరి స్టూడెంట్ ఇపుడు మాయమయ్యాడు.
‘‘అందరికీ ప్రసాదం పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేనంటే ఎంత స్పెషల్ రా’’... అని వెర్రి చూపులు చూసి ఈగ రూపంలో రివేంజ్ తీర్చుకున్న ఆ నటుడు ఏమయ్యాడో ఇప్పుడు కనబడటం లేదు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అంటూ గౌతం వాసుదేవ్ మీనన్ చెక్కిన హీరో ఇపుడు ఎక్కడో మిస్ అయ్యాడు. స్నేహితుడి కోసం కైలాశ్ యాత్ర చేయాలని జీవిత సత్యాలను అన్వేషిస్తూ ప్రయాణం సాగించిన సుబ్రమణ్యం ఎవరో ఈపాటికి తనను తానే మర్చిపోయాడు పాపం. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో కామెడీ పండించిన ఫ్యామిలీ హీరో ఇపుడు కనబడటంలేదు. తర్వాత కృష్ణగాడిలా వీర ప్రేమ గాధను చెప్పి, జెంటిల్మెన్‌గా డబుల్ రోల్ తోనూ మెప్పించి... మజ్నులో ఇద్దరు హీరోయిన్స్‌తో ఆడి పాడి మొత్తానికి ‘నేను లోకల్’ అనిపించుకున్న పిల్లోడు ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్, పాన్ ఇండియా చట్రంలో ఇరుక్కోవాలని ఉవ్విళ్ళూరుతూ తనను తానే ఎక్కడో మర్చిపోయాడు. మధ్యలో మళ్ళీ ‘నిన్నుకోరి’తో ట్రాక్‌లో పడ్డాడు. మరి ఆ విఫల మెచ్యుర్డ్ ప్రేమికుడు ఇపుడు ఏమయ్యాడంటారు... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండే.
‘‘మనకిష్టమైనోళ్ళు పక్కనుంటే పల్లె వెలుగు బస్‌లో కూడా హ్యాపీగా వెళ్తాం, ఇష్టంలేనోళ్లతో బెంజికార్లో సైతం సుఖం ఉండదు’’ అని హీరోయిన్ తండ్రికి ప్రేమ విలువ చెప్పి గుండెను తట్టిలేపిన పిల్లాడు ఇప్పుడు బెంజ్, ఆడి, జాగ్వార్ రేంజ్ నాది అనేసుకుని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గా అతన్ని యాక్సెప్ట్ చేసేసిన జనానికి సవాల్ విసురుతూ ఎటో ఎగిరిపోయాడు.
‘దేవదా్‌స’లో మల్టీ స్టారర్ చేసినా, ‘కృష్ణార్జున యుద్ధం’లో డ్యూయల్ రోల్ చేసినా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసేశారు. కానీ అతడిని మాత్రం స్టార్ డమ్ కమ్మేసింది. బాక్సాఫీస్ లెక్కలు కుదిపేశాయి. ఫైడ్రే థియేటర్ రేసులు మార్చేశాయి. ఆ తర్వాత నుంచి నాలాంటి సాదాసీదా సినీ ప్రేమికులకు ఈ పక్కింటి అబ్బాయి డిస్కనెక్ట్ అవుతూ వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’కు నానీస్ అని ఎప్పుడు చేర్చారో అప్పట్నుంచి స్టార్‌డమ్ మాయలో, రేసుల గోలలో పడి నాలాంటి సగటు ప్రేక్షకుడికి అతను ఎప్పుడు వచ్చాడో.. వెళ్ళాడో కూడా గమనించలేనంత దూరం అయ్యాడు.
‘‘నన్ను హీరో అంటున్నారు... ఎవరు చూస్తాడు అనుకున్నా మొదట్లో’’ అని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిన ఆ అమాయకత్వం ఎక్కడికి పోయిందో కదా! ఇపుడు మాత్రం తానే పెద్ద హీరో అనేసుకుంటున్నాడు. అంతలోనే ఎంత మార్పు. ఆ మధ్య అనుకోకుండా ‘హాయ్ నాన్నా’ అంటూ పలకరిస్తే మళ్ళీ ట్రాక్‌లో పడతాడేమో అనిపించింది. అబ్బే... ఇంక ఆశల్లేవు. ఈ మార్పు మొదటికి వచ్చే మార్పు కాదు. మళ్ళీ ఎవరో అతని స్ధానాన్ని ఆక్రమించేసి ఇక నేనే నీకు రీప్లేస్మెంట్ అని చెప్పే వరకు ఈ పక్కింటి అబ్బాయికి రియలైజేషన్ వచ్చేట్టు లేదు.
అసలు ఈ సోదంతా ఎందుకు అంటే ఈ రోజు ఓటీటీలో చూసిన ఒక సిన్మా వల్ల. ప్యారడైజ్ సిన్మా చూద్దామనుకున్నా. మొత్తానికి పూర్తి చేశా. ఇక ఎలా ఉందంటే.. ఘోరాతి ఘోరంగా, హీనాతి హీనంగా, నీచాతి నీచంగా ఉంది. అసలు ఎంత కంపరంగా ఉందంటే... వాళ్ళు తెర మీద చూపించిన హింసను మాటల్లో కూడా చెప్పలేం. అసలు లాజిక్ లేదు... పెంట, కంపు, బురద, బూడిద, నెత్తురు, కాటుక... మనుషులందరూ రక్తం ఓడుతూ... ఒంటినిండా కత్తి గాట్లు... బాబోయ్ అనిపించేలా... ఒళ్ళు జలదరించేలా... జుగుప్స కలిగేలా...
ఆ అచ్చి రాని, వచ్చీరాని డ్యాన్సులు, అరుపులు, చించుకోటాలు, నరుక్కోటాలు... రక్తం ఏరులు కాదు సముద్రాలుగా పారటం ఏమిటో... బురద, దుమ్ము, ధూళి... కళ్ళకు ఇంత దారుణమైన హింస చూడటం అంత ఆరోగ్యకరం కాదేమో అని కూడా అనిపించింది మొదటిసారి... అసలా హింసకు ఒళ్ళు జలదరించేసింది. సినిమా తీసిన స్టాఫ్ ఇంట్లో పిల్లలు అయినా కనీసం పది నిమిషాలపాటు ఆ సీన్స్ కళ్ళు చేత్తో మూసుకోకుండా చూడలేరు. అసలు నాకో బేసిక్ డౌట్... పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఏం గుర్తింపుతో పెట్టారంటారు. అంటే జైల్లో పెట్టిన వాళ్లకి గుర్తింపు అవసరం లేదంటారా? నేచురల్ స్టార్ అంటారు కదా... అసలా నాచురల్ యాక్టింగ్ ఏమైనట్టు? అరుస్తూ చెప్పిన డైలాగ్స్ గాల్లో తేలిపోయాయి. సడెన్‌గా లో బేస్‌లో చెప్పిన డైలాగ్స్ అసలు అర్థం కాలేదు.
ఇంత హింస అవసరమా నానీ నీకు. వదిలేయ్ నాయనా... నీకంటూ ఓ జోనర్ ఉంది... అది పట్టుకో చాలు. లేదంటే అడ్రస్ కూడా ఉండదు కొన్నాళ్ళకు. ఇకనైనా హిట్టు 3లు, టక్ జగదీష్ అంటూ ఎగిరెగిరి పడకు. నాకు ‘దసరా’ కూడా నచ్చలేదు నిజంగా. నీకు సూటయ్యే సినిమాలు చేసుకో. నీకెందుకు పాన్‌లు, మూకుడులు... ఈ జంఝాటంలో పడొద్దు బాబూ... హాయిగా ఫ్యామిలీ సినిమాలు చేసుకో... నాలాంటి వాళ్ళు చాలా మంది సంతోషిస్తారు...
సగటు సినీ అభిమాని రజని ఇట్టా, సింగపూర్
పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు మామూలుగా.. ఇక్కడ పులిని చూసి కుందేలు పిల్ల వాతలు పెట్టుకుంది అనిపించింది. వామ్మో... అసలు ఇలాంటిది నిజంగా చరిత్రలో జరిగి ఉండచ్చు. అణగదొక్కబడిన ఒక జాతికి గుర్తింపు తీసుకురావాలని పోరాటాలు జరిగి ఉండచ్చు. కానీ దాన్ని చూపే విధానం మాత్రం ఇది కాదనిపించింది. అయినా ఏంటో ఈమధ్య అన్నీ ఈ గుర్తింపు కోసం పోరాడే సినిమాలు ... ఊరి కోసం గుర్తింపు, జాతి గుర్తింపు... దానికోసం గర్భిణిలను స్ర్కీన్ మీద చూపించిన విధానం, తలలు నరుకుతుంటే కారే రక్తపుటేరులు... అసలు సినిమా చివరి ఇరవై నిమిషాల్లోనే ఇది చరిత్రకు, ఒక జాతికి సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. అప్పటి వరకు కేజీఎఫ్, సలార్‌లో లాగా ఏదో ఒక ఇమాజినేటివ్ వరల్ట్ అన్నట్టుగా ఉంటుంది. బానిసత్వం, ఆకలి, అవమానం ఇవన్నీ ఇంత దారుణంగా చూపించాలా తెర మీద? సినిమాలో ఆసుపత్రి ఉండదు, చిన్న దవాఖానా కూడా ఉండదు. స్కూల్ ఉండదు. కానీ థియేటర్ ఉంటుంది. జనాలు బి-గ్రేడ్ సినిమాలు చూట్టానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అంతలోనే వాళ్ళకి తిండి, నీరు, బట్ట, ఇల్లు లాంటి కనీస అవసరాలు కూడా లేని డంప్ యార్డు లాంటి ప్లేస్‌లో ఉంటారు. కుక్క ఏవేవో మ్యాజిక్ చేసేస్తుంది. సడెన్‌గా ఇద్దరు ఆడాళ్లు వీడియోలు తీసేసి థియేటర్‌లో షోలు వేసేస్తుంటారు. మరో వైపు ఇంకొందరు ఆడాళ్లు జాకెట్టు కూడా లేనంత అనాగరిక సమాజంలో బతుకుతుంటారు. ప్యారలెల్ వరల్డ్‌లా అనిపిస్తుంది. మళ్ళీ రెండు వరల్డ్స్ కలిసిపోయి పోరాటాలు సాగిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..