బ్యూటీ పార్లర్‌లో రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన బామ్మ.. బిల్లు చూసి కంగుతిన్న కుటుంబం
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:39 AM
చైనాలో ఓ వృద్ధురాలు బ్యూటీ పార్లర్‌లో రిటైర్‌మెంట్ సేవింగ్స్ మొత్తం ఖర్చు చేశారు. అందం కోసం రూ. 4 కోట్లు చదివించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితాంతం కష్టపడి దాచిన డబ్బులు అంత ఈజీగా ఖర్చుపెట్టలేం. అందులోంచి రూపాయి ఖర్చు చేయాలన్న పది సార్లు ఆలోచిస్తాం. అయితే చైనాలోని ఓ 75 ఏళ్ల వృద్ధురాలు తన రిటైర్‌మైంట్ సేవింగ్స్ మొత్తం బ్యూటీ పార్లర్‌లో ఖర్చు చేశారు. అయితే ఆ బిల్లులు చూసి ఆమె కూతురు కంగుతిన్నారు.
చైనాలో షాంఘై నగరానికి చెందిన ‘యూ’ వృద్ధాప్యంలో యోంగ్‌చీ బ్యూటీ అండ్ హెయిర్‌డ్రెస్సింగ్ అనే కంపెనీని ఆశ్రయించారు. తన సౌందర్యంపై ఆందోళన చెందిన ఆమె.. బ్యూటీ ట్రీట్‌మెంట్లను తీసుకున్నారు. అందులో స్కిన్ టైటెనింగ్, థ్రెడ్ లిఫ్ట్స్, ఐబ్రో టాటూయింగ్, లిప్ టాటూయింగ్ లాంటివి ఉన్నాయి. ఈ సర్వీసుల కోసం ‘యూ’ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించారు. వీటి బిల్లులు చూసి షాక్ అయిన ఆమె కూతురు.. తన తల్లిని నిలువునా దోచుకున్నారని ఆరోపించారు. మార్కెట్ రేట్ల కంటే చాలా ఎక్కువగా సదరు బ్యూటీ పార్లర్ కంపెనీ ఛార్జ్ చేసిందని వాపోయారు. ఒక్క లిప్ టాటూయింగ్ పేరిట 5 లక్షల 60 వేల రూపాయలను వసూలు చేసిందన్నారు. అలాగే చేయని సర్వీసులకూ బిల్లు వేసిందని ఆమె చెప్పారు. ఒకటే ట్రీట్‌మెంట్‌ను అవసరం లేకున్నా తరచూ చేసేవారని ఆవేదన చెందారు.
యోంగ్‌చీ కంపెనీ తన తల్లిని ‘రూయి’ అనే బ్యూటీ క్లినిక్‌కు రిఫర్ చేసిందని, ఆ క్లినిక్ మరింత దోచుకుందని ‘యూ’ కుమార్తె ఆరోపించారు. ‘ఇంటిమేట్ కేర్’ అనే సర్వీసు చేయకుండానే చేసినట్టు చూపి రూ. 42 లక్షలు వసూలు చేసిందని తెలిపారు. అలాగే ఎక్కడా వినని వింత వింత సర్వీసులు అందించి, లక్షలు లూటీ చేశారని వివరించారు. హ్యాపీనెస్ చైర్, స్పేస్ క్యాప్యూల్స్ అని నోటికొచ్చిన పేర్లతో బిల్లులు వేశారని చెప్పారు.
ఇలా నిలువు దోపిడీ జరిగాక తన తల్లి వద్ద ఇంటి అద్దె కట్టడానికి కూడా చిల్లిగవ్వ మిగలలేదని ‘యూ’ కూతురు పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తన అందం పోతోందనే ‘యూ’ ఆందోళనను బ్యూటీ పార్లర్లు క్యాష్ చేసుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
వేల కోట్ల ఆస్తి.. కానీ భిక్షాటన చేసిన ఎమ్మెల్యే..
ఆగని కారు.. వాహనం వెంట ఓనర్ పరుగులు