ఆర్డర్ చేసిన పిజ్జాలో 3 అంగుళాల కోత.. రూ.10,520 జరిమానా
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:25 PM
ఓ వినియోగదారుడికి ఆర్డర్ చేసిన సైజులో పిజ్జా అందించని విషయంపై ఉత్తరాఖండ్ వినియోగదారుల కమిషన్ సీరియస్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వినియోగదారుడికి ఆర్డర్ చేసిన సైజులో పిజ్జా అందించని విషయంపై ఉత్తరాఖండ్ వినియోగదారుల కమిషన్ సీరియస్ అయింది. సదరు రెస్టారెంట్, డెలివరీ సంస్థలకు రూ.10,520 జరిమానా విధించింది.
ఇదీ జరిగింది..
ఓ కస్టమర్ 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేయగా.. 7 అంగుళాల పిజ్జా మాత్రమే డెలివరీ అయింది. తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. తాను పిజ్జాకు చెల్లించిన రూ.505 మొత్తాన్ని వాపస్ చేయాలని సంబంధిత కస్టమర్ కేర్‌ను సంప్రదించారాయన. సదరు డెలివరీ ప్లాట్‌ఫామ్ దీనికి నిరాకరించడంతో ఆయన వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కమిషన్.. వినియోగదారుడికి రూ.10,520 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఆయన పిజ్జా కొనేందుకు అయిన ఖర్చు రూ.505, డెలివరీ ఛార్జి రూ.15, పడిన ఆవేదనకు గానూ రూ.5000, వ్యాజ్యం ఖర్చుల నిమిత్తం రూ.5000 పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా.. తమపై నమోదైన కేసుపై డెలివరి సంస్థ వివరణ ఇచ్చింది. తాము రెస్టారెంట్లకు, వినియోగదారులకు మధ్య వారధి మాత్రమేనని పేర్కొంది. వినియోగదారులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను తాము తయారీ గానీ, ప్యాకింగ్ గానీ, అమ్మడం గానీ చేయడం లేదని.. డెలివరీ మాత్రమే చేస్తున్నామని వివరించింది.
ఇవీ చదవండి:
'ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నది.. విశ్వసనీయత లేదు': భారత విదేశాంగ శాఖ
ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ.. ఈ సారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..