Share News

ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ.. ఈ సారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:54 AM

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ నిరసన చెలరేగింది. జంతర్ మంతర్‌లో 'రిజర్వేషన్ హఠావో' పేరుతో సుమారు 300 మంది ఆందోళన చేపట్టారు.

ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ.. ఈ సారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..
Delhi Protests

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ నిరసన చెలరేగింది. ఇటీవలే విద్యావ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలతో దేశం అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిరసనకారులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కదం తొక్కారు. జంతర్ మంతర్‌లో 'రిజర్వేషన్ హఠావో' పేరుతో ఆందోళనలు చేపట్టారు. బిహార్, ఉత్తర్‌‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో పలువురు రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేయగా, కొందరు ఆర్థిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలన్నారు. సుమారు 5.4 మిలియన్ల ఫాలోవర్లున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. ఆగస్టు 21 తేదీన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఆ పేజీ ఇదివరకే పోస్ట్ పెట్టింది.


జంతర్ మంతర్‌లో ఆందోళనల నేపథ్యంలో ‌పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజర్వేషన్ హఠావో ఆందోళన్ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల వరకు రామ్‌లీలా మైదానంలో నిర్వహించుకునేందుకు తొలుత అనుమతిచ్చారు. కానీ ఒకరోజు ముందు నిరసన వేదికను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు జంతర్ మంతర్‌లోనే శాంతియుతంగా ఆందోళన చేపడతామని నిరసనకు నాయకత్వం వహిస్తున్న అభిషేక్ అగ్నిహోత్రి చెప్పారు.


రిజర్వేషన్ చట్టాలను బలవంతంగా రుద్దుతున్నారు..

బిహార్ నుంచి ఆందోళనలో పాల్గొన్న ప్రత్యూష్ గౌర్ అనే వ్యక్తి రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారన్నారు. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు నిరసనల తరువాతే ప్రజలు డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. పాలకులు ప్రజా సమస్యలపై కాకుండా మతాలు, కులాలపై శ్రద్ధ పెడుతున్నారని వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

ఐఫోన్‌ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి

అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్‌ ఆగ్రహంపై భారత్ స్పందన

Updated Date - Aug 22 , 2026 | 12:17 PM