20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:45 PM
తన 20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్ అంటూ ఓ మహిళ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జూల్స్ ఫెడెలే అనే మహిళ 20 ఏళ్ల తరువాత తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే ఈ రెండు దశాబ్దాల చేదు అనుభవాలను, తన కష్టాలను ఆమె ‘పది క్రేజీ థింగ్స్’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ కావడంతో దానిపై యూజర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
పది క్రేజీ థింగ్స్
జూల్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన చేదు అనుభవాలను వివరించారు.
తాను టెక్ రంగంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు రాత్రి వేళ తన కుమారుడిని నిద్రపుచ్చడానికి కొంత సమయం కోరితే పిల్లాడికి ఇంకో ఆయాని పెట్టుకోమని తన బాస్ సూచించారని జూల్స్ వాపోయింది.
ఓ సారి తనకు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ పొరపాటున ఓ లేఖ పంపించిందని, అందులో షాకింగ్ విషయాలు తెలిశాయని ఆమె చెప్పారు. తన సహోద్యోగికి 50 వేల డాలర్ల జీతం పెంచినట్టు, ఆయన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోసం స్కాలర్‌షిప్ కూడా కల్పించినట్టు లేఖలో ఉందని పేర్కొన్నారు. ఇద్దరిది ఒకటే స్థాయి హోదా అయినా సహోద్యోగి పురుషుడు కావడం వల్లే ఆయనపై కంపెనీ వరాలు కురిపించిందని ఆరోపించారు.
బోర్డ్ మీటింగ్స్ సమయంలో తనను మెయిన్ టెబుల్ దగ్గర కూర్చోవడానికి కూడా అనుమతించరని, మూలన ఉన్న చిన్న టెబుల్ దగ్గర సీఈఓ లేడి అసిస్టెంట్‌తో తాను కూర్చునే దానినని ఆమె తెలిపారు. అయితే ఆ ఆఫీస్‌లో తామిద్దరమే మహిళలమని చెప్పారు.
కంపెనీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించనని చెప్పినందుకు తనను మందలించారని విమర్శించారు.
తన బాస్ రాత్రి 11 తరువాతే బోర్డు మీటింగ్స్ ప్రజెంటెషన్స్‌ను సమీక్షించేవారని, ముందు అడిగితే నిరాకరించేవారని ఆమె వివరించారు.
మాతృత్వపు సెలవుల అనంతరం ఆఫీస్‌కు వెళ్లగానే తనను జాబ్ నుంచి తీసేస్తానని బెదిరింపులు వచ్చాయని అందుకే మరో చోట ఉద్యోగంలో చేరానని పేర్కొన్నారు.
ఒకరోజు తన బాస్ టీమ్ లంచ్ ఎక్కడ చేయాలో ప్లాన్ చేయమన్నారని, ఎందుకని అడిగితే ‘ఆడవాళ్లకు ఇలాంటి పనులే కదా ఇష్టం’అని అన్నారని చెప్పారు.
ఓ సమయంలో తనపై ఉన్న ద్వేషంతో తన జాబ్ రోల్ మార్చేశారని ఆమె అన్నారు.
ఒకసారి తనకు రావాల్సని బోనస్‌ను బాస్ పెండింగ్‌లో పెట్టారని ఆమె వాపోయారు.
అన్నిటికంటే విచిత్రమైన ఘటన ఒకటి జరిగిందని జూల్స్ వివరించారు. తనను తిడుతూ మేనేజర్ మరో వ్యక్తికి మెయిల్ చేశాడని, అయితే పొరపాటున తనను కూడా మెయిల్‌లో ట్యాగ్ చేశారని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి.. ‘నాకు తెలిసి జూల్స్ మంచిదే.. అన్నట్టు హాయ్ జూల్స్’ అని రిప్లై ఇచ్చారని అన్నారు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి ‘‘నేనే ఆ హెచ్‌ఆర్‌ని. ఆరోజు పొరపాటున లేఖ పంపలేదు. నీకు జీతం పెరగాలనే అలా చేశా’అంటూ కామెంట్ చేశారు. టెక్ జాబ్‌ను వదిలేసినందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని మరో వ్యక్తి వీడియోపై స్పందించారు.
ఈ వార్తలనూ చదవండి:
దేశం కోసం పిల్లల్ని కనండి.. 7వ సారి తల్లైన జపాన్ మహిళ పిలుపు
ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నదిలోకి దూకిన యువతి.. చివరగా ఏం చెప్పిందంటే..