మంత్రి సురేఖపై అధిష్ఠానం సీరియస్
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:53 AM
మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరూ మాట్లాడవద్దంటూ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు.
ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన
చేసిన మంచి దక్కకుండాపోతోందని ఆవేదన
సురేఖ కుటుంబం తీరుపై భట్టి అసంతృప్తి
నేడో రేపో ఏఐసీసీ, టీపీసీసీకి కమిటీ నివేదిక
సురేఖపై చర్యలకు అధిష్ఠానం మొగ్గు!
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరూ మాట్లాడవద్దంటూ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలనూ అమలు చేస్తున్నా.. వాటికి ప్రచారం రావట్లేదు. ఇలాంటి సంఘటనలు ప్రధానం అయికూర్చుంటున్నాయి. చేసిన మంచి దక్కకుండా పోతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అందరం ఒక్కటిగా ఉందామని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. సమస్య ఏదైనా ఉంటే తనకు.. లేకుంటే పార్టీకి చెప్పుకోవచ్చునని, అంతేకానీ బయట మాట్లాడవద్దని చెప్పారు. అలాగే, పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి తీరుపైనా సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కఠినంగా శిక్షించాల్సిందే: డిప్యూటీ సీఎం
సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కుమార్తె పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం, సురేఖ.. ఆమె భర్త కొండా మురళి సైతం పదే పదే వివాదాలు సృష్టిస్తుండటం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్క సోమవారం ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ రైజింగ్, సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా, కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే, సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలోనూ పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వినిపించారు. ‘‘పదేళ్లు అనేక అవమానాలను ఎదుర్కొన్నాం. కేసులు కూడా పెట్టించుకున్నాం. పదేళ్ల కష్టం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ సమయంలో పార్టీలో ఒకరిద్దరి వ్యవహారంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్డగోలుగా మాట్లాడడం వల్ల పదేళ్ల కష్టం వృథా అవుతోంది. అలాంటి వారిపట్ల ఉపేక్షించొద్దు. కఠినంగా వ్యవహరించాల్సిందే’’ అని బలంగా చెప్పినట్టు తెలిసింది. కొండా సురేఖపై చర్యలకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అభిప్రాయమూ కీలకంగా మారింది. సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. మంగళ లేదా బుధవారం దానిని కమిటీ చైర్మన్ మల్లు రవి ఏఐసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు సమర్పించనున్నారు. దానికి ఆయన తన సూచనలూ జోడించి నివేదికను అధిష్ఠానానికి పంపాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఏ రకమైన వైఖరి తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ఆ నివేదికను పరిశీలించి సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి, మహేశ్ గౌడ్ అభిప్రాయాలను తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇక, చిన్నారెడ్డి అంశంపై కూడా సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలిసింది.
అధిష్ఠానమూ సీరియస్
కొండా సురేఖ, ఆమె కుమార్తె, భర్త తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకురావడం పట్ల అధిష్ఠానం కూడా సీరియ్‌సగా ఉంది. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే అసంతృప్త నేతలు పార్టీ క్రమశిక్షణ తప్పి సీఎం రేవంత్ రెడ్డిపైన, ప్రభుత్వ పనితీరుపైన విమర్శలు చేస్తారని, అప్పుడు ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్న భావనతో ఉంది. ఇక మీదట ఎవరూ సీఎంపైన, ప్రభుత్వంపైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా సురేఖపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉంది. అయితే, ఈ వివాదంలో పార్టీకి నష్టం కలగకుండా చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. ఆమెను రాజీనామా కోరడమో, మంత్రివర్గం నుంచి తొలగించడానికి ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వడమో చేస్తుందని అంటున్నారు. పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టి.. ఆమె స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
ఏపీకి ఎంతిస్తే..మాకూ అంతే నీరివ్వాలి!