ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:54 PM
ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకున్న రాజకీయ అనుభవంలో ఎంతో మంది నాయకులను చూశానని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. తనకున్న రాజకీయ అనుభవంలో ఎంతోమంది నాయకులను చూశానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం అరుదైన వ్యక్తి అని ప్రశంసించారు. దేశ గౌరవాన్ని మోదీ నిలబెట్టారని కొనియాడారు. మహిళలకు మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (సోమవారం) తమిళనాడులోని దెన్కనికొట్టైలో ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. థల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నగేశ్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం తమిళంలో ప్రసంగాన్ని ప్రారంభించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు.
తన పుట్టిన రోజున ఇక్కడకు వచ్చానని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. జన్మదినం రోజునే ఇక్కడికి వచ్చానంటే ప్రాధాన్యం అర్థం చేసుకోవాలని అన్నారు. తమిళనాడులో ఈసారి జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులను ప్రజలు గెలిపించాలని కోరారు. తమిళ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఉద్ఘాటించారు. మనందరికీ మదరాసు రాజధానిగా పరిపాలన కొనసాగిందని తెలిపారు. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, శ్రమ కలిగిన వారు.. వారి విజయానికి అదే సూత్రమని చెప్పారు. ఎంతోమంది ప్రముఖులు, చరిత్రకారులు తమిళనాడు వారు ఉన్నారని ప్రస్తావించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ద్రవిడ భాషలను ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ద్రవిడ యూనివర్శిటీని ప్రారంభించారని ప్రస్తావించారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ కూడా తమిళనాడులోనే జీవించారని.. తనకు పెళ్లి జరిగింది కూడా ఇక్కడేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జగన్ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల
Read Latest AP News And Telangana News And International News And Telugu News