యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN, Publish Date - May 24 , 2026 | 08:44 AM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
1/6
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
2/6
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిజీతో కలిసి ముఖ్యమంత్రి ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్టపై నిర్మించనున్న సరికొత్త వేద పాఠశాల భవన నిర్మాణానికి వైభవంగా శంకుస్థాపన చేశారు.
3/6
సనాతన ధర్మ ప్రచారం, వేద విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పాఠశాలను అత్యాధునిక వసతులతో, సంప్రదాయబద్ధంగా నిర్మించనున్నారు. అలాగే ఆలయానికి అనుబంధంగా రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
4/6
ఇందులో వేద పాఠశాల నిర్మాణానికి రూ.43.80 కోట్లు కేటాయించారు. కొండపై స్వామిజీ నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి రూ.9.87 కోట్లు, వైకుంఠ ద్వారం నుంచి కొండ వరకు ఉన్న మెట్ల మార్గంపై కప్పు నిర్మాణానికి రూ.1.41 కోట్లు మంజూరు చేశారు. ఇక రథశాల వైపు వెళ్లే మాడ వీధుల మెట్ల నిర్మాణానికి రూ.1.35 కోట్లు, వసతి గృహాలు, దీక్షా పారుల్ సదనం నిర్మాణానికి రూ.43.12 కోట్లు వెచ్చించనున్నారు. ఈ అభివృద్ధి పనులతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
5/6
ఈ నిధుల ద్వారా యాదాద్రి కొండపై భక్తుల కోసం ప్రత్యేకంగా నిత్య కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల ప్రతిరోజూ స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులకు సులువైన వసతి లభిస్తుంది. అలాగే, కాలినడకన కొండపైకి వచ్చే భక్తుల కోసం వైకుంఠ ద్వారం నుంచి కొండపై వరకు ఉన్న మెట్లమార్గానికి ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేలా పైకప్పు నిర్మించనున్నారు. వీటితో పాటు రథశాల వైపు వెళ్లే మాడ వీధుల మెట్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
6/6
స్వామివారి దీక్షలు తీసుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా 'దీక్షా పరుల సదనం', అధునాతన వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated at - May 24 , 2026 | 08:54 AM