హాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:27 PM
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. విశాలమైన హాల్, అద్భుతమైన వేదిక, సమాఖ్య సభ్యుల శ్రద్ధతో చేసిన అలంకరణలతో ఆ ప్రాంగణం మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మారింది. ప్రవేశద్వారంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ టేబుల్ వద్ద అతిథులను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఉత్సాహభరితమైన సంధ్యాసమయాన కార్యక్రమం వినాయక ప్రార్థనతో ప్రారంభమై, అనంతరం తెలుగు బడి విద్యార్థులు ఆలపించిన ‘మా తెలుగు తల్లి’ గీతంతో వేడుకలకు శుభారంభం లభించింది.

ఈ వేడుకలకు హాజరైన గౌరవనీయులు:
హాంకాంగ్, మకావోలోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి గౌరవ కాన్సులర్ దీప్తి పెరుమాళ్, ఐలాండ్స్ ఆఫీస్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రైర్సన్ ఇప్, తుంగ్ చుంగ్ కేర్ టీమ్ కెప్టెన్, మే చౌ, వారందరి సాన్నిధ్యం వేడుకలకు మరింత గౌరవాన్ని చేకూర్చింది. స్థాపక సభ్యురాలు జయా పీసపాటి సభ్యులను, అతిథులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, సమాఖ్య అభివృద్ధిపై సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ సమాఖ్య, నేడు హాంకాంగ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారసత్వాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సమాఖ్య, ఒక వేదిక మాత్రమే కాదని, తనకి ఒక అద్దం, ఒక గురువు వంటిదని తెలిపారు. మాటలతోనే కాదు, ఆచరణతో నడవడం నేర్పిందని చెప్పుకొచ్చారు. ఆఫ్రికన్ సామెత ‘వేగంగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి, దూరంగా వెళ్లాలనుకుంటే కలిసి వెళ్లండి’, భావాన్ని ఏకిభవిస్తూ, నిజమైన అభివృద్ధి ఒంటరిగా జరగదని, మనం ఇతరులను వెంట తీసుకెళ్లినప్పుడు అది వికసిస్తుందని, అదే మన సిద్ధాంతం 'మన కోసం మనం' అని అన్నారు. సమాఖ్య వార్షిక కార్యక్రమాలు, పిల్లలకు తెలుగు తరగతులు, స్వచ్చంద సంస్థలకు తమ సేవల గురించి ఒక చిన్న వీడియో ద్వారా తెలిపారు.

‘ఈ ప్రయాణానికి కృషి చేసిన వారందరికీ ఈ రోజు నేను ప్రత్యేక కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాను. మనకు మార్గనిర్దేశం చేసిన గురువులకు, శిష్యులకు, ప్రతి కార్యక్రమం వెనుక నిలిచిన తల్లిదండ్రులకు, తమ అదృశ్య ప్రయత్నాలతో ఈ విజయాలకు భాగస్వాములైన స్వచ్ఛంద సేవకులకు, శ్రేయోభిలాషులకు మీలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధికి మూలస్తంభాలు’ అని కొనియాడారు.

గౌరవ కాన్సులర్ దీప్తి పెరుమాళ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రైర్సన్ ఇప్, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, సమాఖ్య రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు అభినందనలు తెలిపారు. వారు సమాఖ్యకు తమ మద్దతు, ప్రోత్సాహాన్ని హృదయపూర్వకంగా ప్రకటించారు. భారతదేశం నుంచి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్తగా తెలుగు, హిందీ భాషల అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు, లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాంకాంగ్ తెలుగు వారందరికీ వీడియో ద్వారా తమ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం, వారందరిని ఎంతో సంతోషించింది.

సమాఖ్య సభ్యులు చిన్న,పెద్ద అందరు ఎంతో ఉత్సాహభరితంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, ప్రేక్షకుల్లో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం ఈసారి ‘హనుమాన్ చారిటీ’ స్థాపకులు అయిన నవీన్ సిధ్వాని, మిస్ బియాంక సాధ్వని, తండ్రి, కూతురు జంటకు లభించింది. వీరు తమ వ్యక్తిగత వనరులతో వీధుల్లోని బలహీనులను ఆహారం పెట్టడం ప్రారంభించి, నేడు వందల మందికి ఆహారం అందించే స్థాయికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా పాల్గొన్న వారందరిని గౌరవప్రదంగా గుర్తించాక జాతీయ గీతం ఆలపించి ముగించారు. అనంతరం సమీప క్లబ్‌హౌస్‌లో సంప్రదాయ తెలుగు విందు ఏర్పాటు చేశారు. ఉగాది పోటీలు, క్రీడా కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. సమాఖ్య అధ్యక్షురాలు గౌరవ ముఖ్య అతిథులకు, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి, LCSDకు, కార్యవర్గ సభ్యులు రమేశ్ రేణిగుంట్లకి, రమాదేశవి సారంగాకి, రాజశేఖర్ మన్నేకి, హరీన్ తుమ్మలకి, అలాగే వేదిక అలంకరణ, సాంకేతిక సమన్వయం, వ్యాఖ్యాతలకు, ఫొటోగ్రఫీ, విందు ఏర్పాట్లలో సహకరించిన సభ్యులందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.





Also Read:
జర్మనీలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
For More Latest News