Share News

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:04 AM

ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం తాలూకూ తీవ్ర ప్రభావాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పడుతున్నాయి! చమురు, గ్యాస్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి..

ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

  • మళ్లీ వలస పాలనలోకి వెళ్లామా?

  • ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని

  • రష్యా చమురు కొనటానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్‌ ఎవరు?

  • ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌

న్యూఢిల్లీ, మార్చి11: ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం తాలూకూ తీవ్ర ప్రభావాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా పడుతున్నాయి! చమురు, గ్యాస్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. గ్యాస్‌ కొరత సెగ సామాన్యులను సైతం తాకుతోంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ పర్యవసానాల ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌ ఎలా స్పందించాలి? ఏమేం చర్యలు తీసుకోవాలి? మన నాయకత్వం ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు! ఈ క్రమంలోనే.. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌.. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. యుద్ధం కారణంగా మనదేశం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దాచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అంతా బాగానే ఉన్నట్టుగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ప్రధాని మోదీ బలహీనత వల్లే దేశంలో వంటగ్యాస్‌, ఎరువుల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. ఒక సార్వభౌమ దేశాధినేతను యుద్ధం పేరుతో అమెరికా హత్యచేసినా కనీసం ఖండించలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని విమర్శించారు. ఆయనతో ముఖాముఖిలో మరికొన్ని ముఖ్యాంశాలు..


ప్రశ్న: అమెరికా తప్పుడు అంచనాతో యుద్ధంలోకి దిగిందని అనుకోవచ్చా?

యోగేంద్రయాదవ్‌: తప్పుడు అంచనా అనేది చాలా చిన్న విషయం అవుతుంది. ఇరాన్‌లో ఉన్నట్లుండి ప్రజా తిరుగుబాటు రావటం, ఆ ప్రాంతంలో మొత్తం అలజడి రేగటం వంటి అంశాలను విస్తృత కోణంలో చూసినప్పుడు ఇది చిన్న విషయం కాదని అర్ధమవుతుంది. ప్రజల కోసమే అనే పేరుతో అమెరికా ఒకదేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోంది. ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యక్తులను తమవైపు తిప్పుకొని, తాను చేసేది సరైనదేనని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాది తప్పుడు అంచనా అయినా, సరైన అంచనా అయినా ఇది విధ్వంసం తప్ప మరొకటి కాదు. ఈ యుద్ధం విషయంలో మన ప్రభుత్వతీరు సిగ్గుచేటు.

రంజాన్‌ ముస్లింలకు భావోద్వేగంతో ముడిపడినది. ఈ సమయంలో యుద్ధంపై మీరేమంటారు?

అమెరికా దాడితో ఇరాన్‌లో ముస్లింలు కష్టాలు పడుతున్నారు. ఇరాన్‌ ఎదురు దాడితో పశ్చిమాసియాలోని దేశాల్లో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారు. దీనంతటికీ అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, అమెరికా అధ్యక్షుడికి ఈ భావోద్వేగాల గురించి పట్టింపు లేదు. దేనినీ లెక్కచేయనని ఆయన అంటున్నారు. ఆయన వాషింగ్టన్‌లో కూర్చుని ప్రపంచాన్ని ఏలాలని అనుకుంటున్నారు. ప్రపంచం ఎలా నడవాలో నేనే నిర్ణయిస్తానని చెబుతున్నారు. ఒక సార్వభౌమ, స్వతంత్ర దేశంలో ప్రజలు ఆమోదించిన పాలకుడు తనకు నచ్చలేదని, తొలగిస్తానని అంటున్నారు. ఇరాన్‌లోని పాలకుడు తనకు నచ్చాడు, నచ్చలేదు అని చెప్పటానికి ట్రంప్‌ ఎవరు? ఇప్పుడు ట్రంప్‌ అనుసరిస్తున్నది ఓ కొత్తరకమైన యుద్ధ నీతి. దీనిని ప్రపంచమంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.


రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు అనుమతిస్తున్నాన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై మీరేమంటారు?

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటానికి మనదేశానికి అనుమతి ఇచ్చేందుకు ట్రంప్‌ ఎవరు? ఇది మనకు తీవ్రమైన అవమానమే. మనకు అనుమతి ఇవ్వటానికి ట్రంప్‌ ఎవరు? మనం మళ్లీ వలసపాలనలోకి వెళ్లామా? ఇది మన ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బే. చమురు దిగుమతులకు అనుమతి సాధించామని మనదేశంలో ఉత్సవాలు చేసుకోవటం మరింత విచారకరం. చమురు దిగుమతులకు మనకు ఎవరి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. కానీ, పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు రష్యా నుంచి వస్తున్న చమురు డిస్కౌంట్‌ ధరకు రావటం లేదు. ఇది చాలా ఖరీదైనది. ఈ పరిణామాలు మనదేశ ప్రయోజనాలకోసం ఏమాత్రం కాదు. ఇవి పూర్తిగా అమెరికా ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయి. ఇది పూర్తిగా మన విదేశాంగ విధాన వైఫల్యమే.

అమెరికా 500 ఉపగ్రహాలతో మనపై నిఘా పెట్టిందని చెబుతున్నారు. అమెరికాది అభద్రతాభావమేనా?

దీర్ఘకాలంలో భారత్‌ కచ్చితంగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, ప్రపంచంతో పోటీ పడుతోందని అనుకుంటున్నారు. కానీ, ప్రపంచ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అమెరికా తాను అనుకున్నది చేస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యా తాను చేయాలనుకున్నది చేస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణ సముద్రంలో చైనా తనకు నచ్చినట్లు చేస్తోంది. భారత్‌ అలా చేయగలుగుతోందా? ప్రపంచంలోని ఏ సమస్యపైనా మన ప్రభుత్వం గట్టిగా మాట్లాడలేకపోతోంది. ఇరాన్‌ విషయంలో మనం వెనక్కు తగ్గాం. ఆ దేశాధ్యక్షుడిని చంపేసినా ఖండించలేదు. అమెరికా విధానాలపై మన ప్రధాని ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రతి భారతీయుడు ప్రశ్నించాలి.


ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి ఇప్పటికైనా మన ప్రభుత్వం ఒక స్థిరమైన విధానాన్ని నెలకొల్పుతుందా?

కచ్చితంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పశ్చిమాసియాలో కోటిమంది భారతీయులు ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారందరినీ కాపాడే కచ్చితమైన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఉండాలి. కానీ, మన ప్రభుత్వానికి ఈ విషయంలో చాలాబలహీనమైన రికార్డు ఉంది. చమురు, గ్యాస్‌ సరఫరాలో అనుకోని సమస్యలు ఎదురైతే ఎదుర్కోనే ప్రణాళికలు కూడా ఉండాలి. యూరియా, ఇతర ఎరువుల కొరత మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే 50 కేజీల యూరియా బస్తాను 45 కిలోలకు తగ్గించి, ట్రిక్స్‌ ప్లేచేయటం మొదలుపెట్టింది. ఇది పంట కోతల సమయం. ఇప్పుడు ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొరతనుగానీ, వంటగ్యాస్‌ కొరతను గానీ పరిష్కరించే స్థితిలో లేదు.

కరోనా సమయంలోనే వంటగ్యాస్‌ కొరత రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది?

ఎల్పీజీ కొరత ఏర్పడితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. ఐదారు రోజుల క్రితమే దీనిపై సమీక్ష నిర్వహించింది. అంతా బాగానే ఉంది, కొరత లేదని చెబుతోంది. ప్రజలకు నిజాలు తెలియకుండా దాస్తోంది. ప్రపంచమంతా కొరత ఉంది, మనదగ్గర కూడా ఉందని సరిపెట్టుకోలేం. ప్రభుత్వానిది కచ్చితంగా నేరపూరిత నిర్లక్ష్యమే. పాలకుడి ప్రచార యావతో వచ్చిన సమస్య. స్వతంత్ర దేశంగా మనం గుర్తించి, మన ప్రధాని పర్యటించిన ఒక సార్వభౌమ దేశ పాలకుడిని ఉన్నట్లుండి అమెరికా చంపివేస్తే.. మన ప్రధాని కనీసం విచారం వ్యక్తంచేయలేదు. మనకు చమురు పశ్చిమాసియా నుంచి వస్తోంది. గ్యాస్‌ అక్కడి నుంచే వస్తోంది. కానీ, మన ప్రభుత్వం అక్కడి సమస్య గురించి పట్టించుకోదు. ప్రభుత్వానికి తనదైన విధానం ఉంటే ఉండొచ్చు. కానీ, మనపై ప్రభావం చూపే అంశాలపై స్పందించాలి కదా?


Also Read:

షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.27లక్షల సైబర్‌ మోసం

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్‌ చమురు శుద్ధి కేంద్రం

Updated Date - Mar 12 , 2026 | 08:54 AM