Share News

27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్‌ చమురు శుద్ధి కేంద్రం

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:22 AM

ఇంధన రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో అమెరికాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు...

27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్‌ చమురు శుద్ధి కేంద్రం

  • అమెరికా ఫస్ట్‌ రిఫైనింగ్‌ సంస్థతో ఒప్పందం

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి11: ఇంధన రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో అమెరికాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. టెక్స్‌సలోని బ్రౌన్స్‌విల్లేలో నిర్మిస్తున్న ఈ చమురు శుద్ధి కర్మాగారం కోసం అమెరికా ఫస్ట్‌ రిఫైనింగ్‌(ఏఎ్‌ఫఆర్‌)తో రిలయన్స్‌ సంస్థ రూ.27.6 లక్షల కోట్ల (300 బిలియన్‌ డాలర్లు) విలువైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గత 50 ఏళ్లలో అమెరికాలో నిర్మితమవుతున్న తొలి చమురుశుద్ధి కేంద్రం ఇదేనని, ఇది ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన చమురు శుద్ధి కేంద్రమని బుఽధవారం ట్రూత్‌ సోషల్‌ లో ప్రకటించారు. ‘అమెరికాలో ఇంత భారీ పెట్టుబడి పెడుతున్న భారత్‌లోని మా మిత్రులకు, ఆ దేశంలోని అతిపెద్ద ప్రైవేటు ఇంధన సంస్థ రిలయన్స్‌కు ధన్యవాదాలు. ఇది మా అమెరికా ఫస్ట్‌ ఎజెండా విజయం’ అని ట్రంప్‌ తెలిపారు.

భాగస్వామి పేరు వెల్లడించని ఏఎఫ్ఆర్‌

బ్రౌన్స్‌విల్లే రిఫైనరీలో పెట్టుబడులపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పందించలేదు. అయితే, ఈ రిఫైనరీని నిర్మిస్తున్న ఏఎ్‌ఫఆర్‌తో రిలయన్స్‌ సంస్థ ఇంధన శుద్ధి, కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. నిజానికి బ్రౌన్స్‌విల్లేలో రిఫైనరీ నిర్మాణానికి 2024లోనే ఎలిమెంట్‌ ఫ్యూయల్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఇక్కడ భారీ చమురు శుద్ధి కేంద్రం నిర్మాణానికి అవసరమైన అనుముతులు కూడా తీసుకుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు జాన్‌ కాల్సీనే ప్రస్తుతం అమెరికా ఫస్ట్‌ రిఫైనింగ్‌ సంస్థకు సీఈవోగా ఉన్నారు. రోజుకు 1.6 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేయగల భారీ రిఫైనరీ నిర్మించేందుకు ఎలిమెంట్‌ ఫ్యూయల్స్‌ అనుమతి తీసుకుంది. అమెరికాలో వెలికితీసే షేల్‌ ఆయిల్‌ను ఈ రిఫైనరీలో శుద్ధిచేసి, విక్రయించేందుకు 20 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్‌ ప్రకటన తర్వాత ఏఎ్‌ఫఆర్‌ తెలిపింది. అయితే, తన ప్రకటనలో రిలయన్స్‌ సంస్థ పేరును ప్రస్తావించలేదు. ఈ ఒప్పందం ప్రకారం 125 బిలియన్‌ డాలర్ల (రూ.11.5 లక్షల కోట్లు) విలువైన 1.2 బిలియన్‌ బ్యారెళ్ల అమెరికన్‌ షేల్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి, ఈ రిఫైనరీలో శుద్ధి చేస్తారు. 175 బిలియన్‌ డాలర్ల (రూ.16.1 లక్షల కోట్లు) విలువైన 50 బిలియన్‌ గ్యాలన్ల శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులను తయారు చేస్తారు. యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 132 చమురుశుద్ధి కేంద్రాలున్నాయి. అయితే, వీటిలో అత్యధికం హెవీ (అత్యంత చిక్కగా ఉండేది) ముడి చమురును శుద్ధి చేసే కర్మాగారాలే. అమెరికాలో చివరిసారి 1977లో లూసియానాలోని గ్రాన్స్‌విల్లేలో మారతాన్‌ సంస్థ చమురుశుద్ధి కేంద్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత కొత్తవి నిర్మించలేదు.

ఇవి కూడా చదవండి..

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Updated Date - Mar 12 , 2026 | 06:22 AM