లండన్ నుంచి రహస్యంగా వచ్చి.. పుణెలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:01 PM
లండన్‌లో ఎంబీఏ చదువుతున్న 34 ఏళ్ల మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా భారత్‌కు తిరిగి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పుణెలోని ఓ అద్దె ఫ్లాట్‌లో ఆమె విగతజీవిగా కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో ఎంబీఏ చదువుతున్న 34 ఏళ్ల మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా భారత్‌కు తిరిగి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పుణెలోని ఓ అద్దె ఫ్లాట్‌లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఫుడ్ డెలివరీ లావాదేవీల ద్వారా ఆమె భారత్‌లో ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ముగ్ధా దేశ్‌ముఖ్ నిరుడు జులైలో ఎంబీఏ చదివేందుకు లండన్ వెళ్లింది. అక్కడ ఒంటరిగా నివసిస్తూ వివిధ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేది. ఫోన్ కాల్స్, మెసేజీల ద్వారా కుటుంబ సభ్యులతో నిత్యం టచ్‌లో ఉండేది. అయితే అక్టోబర్ 24 నుంచి ఆమె తన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో లండన్‌లోని ఆమె స్నేహితురాలిని ముగ్ధ తల్లిదండ్రులు సంప్రదించగా.. చివరిసారిగా అక్టోబర్ 22న మాట్లాడానని ఆమె ఫ్రెండ్ తెలిపింది. తర్వాత లండన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. ముగ్ధ ఆగస్టు నెలాఖరులోనే యూకే నుంచి ఇండియాకు తిరిగి వెళ్లిపోయిందని పోలీసులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు భారత అధికారులతో పాటు ఇండియన్ హైకమిషన్‌ను సంప్రదించి ఆమె ఆచూకీ వెతకాలని కోరారు. ముగ్ధ తండ్రి ఆమె బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా.. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య పలు ఫుడ్ డెలివరీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వాటిలో కొన్ని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతం నుంచి జరిగినట్లు తెలియడంతో ఆమె భారత్‌లోనే ఉన్నట్లు అనుమానించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీని పుణెలోని గహుంజే ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో గుర్తించారు. అక్కడి ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు.. తాళంచెవి తయారీదారుడి సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే ముగ్ధా మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఆమె ఏప్రిల్‌లోనే ఆ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందని, ఆగస్టు నుంచి అక్కడ నివసించిందని వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?