జేఈఈ మెయిన్ దరఖాస్తులో పొరపాటా? కొత్త అప్లికేషన్‌కు ఎన్టీఏ అవకాశం
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:48 AM
జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 పరీక్ష దరఖాస్తులో పొరపాట్లు సరిచేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులు ఇప్పటికే అప్లికేషన్ నంబర్ పొంది ఉన్నా, పరీక్ష ఫీజు చెల్లించినా కొత్తగా మరో దరఖాస్తు సమర్పించవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది..
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 పరీక్ష దరఖాస్తులో పొరపాట్లు సరిచేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులు ఇప్పటికే అప్లికేషన్ నంబర్ పొంది ఉన్నా, పరీక్ష ఫీజు చెల్లించినా కొత్తగా మరో దరఖాస్తు సమర్పించవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
కొత్త దరఖాస్తుకు ఇవీ నిబంధనలు..
అభ్యర్థులు కొత్తగా మరో అప్లికేషన్ పెట్టి, దానికి ఫీజు చెల్లించకపోయినా, అలాగే కన్ఫర్మేషన్ పేజీ జనరేట్ చేయకపోయినా, అంతకుముందు ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ పేజీ పొందిన దరఖాస్తే చెల్లుబాటు అవుతుంది. ప్రతీసారి కొత్త అప్లికేషన్ పెట్టినప్పుడు కొత్త దరఖాస్తు నంబర్ వస్తుంది. కొత్త అప్లికేషన్‌లో అభ్యర్థులు వారి వివరాలన్నీ మళ్లీ నమోదు చేయాలి. ఫొటో, సంతకం సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లను మళ్లీ అప్‌లోడ్ చేయాలి. కొత్త దరఖాస్తును 2026 నవంబర్ 22 రాత్రి 11.50 గంటల్లోపు పూర్తి చేయాలి. ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి 26వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి ఇవ్వరు. కొత్త దరఖాస్తుకు కూడా పాత ఫీజును సర్దుబాటు చేయరు. కొన్ని వివరాల్లో మాత్రమే తప్పులు ఉంటే కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నవంబర్ 27 నుంచి 29 వరకు అందుబాటులో ఉండే కరెక్షన్ విండో ద్వారా మార్పులు చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
ఒక సెషన్‌లో ఒక్కసారే పరీక్షకు అనుమతి
అభ్యర్థులు కొత్తగా ఎన్ని దరఖాస్తులు సమర్పించినా ఒక సెషన్‌లో ఒక్కసారే పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తారు. ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్ నంబర్లను ఉపయోగించి పరీక్షకు హాజరైనా, హాజరయ్యేందుకు ప్రయత్నించినా దానిని అన్‌ఫెయిర్ మీన్స్ (యూఎఫ్ఎం) గా పరిగణిస్తారు. తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అయితే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నంబర్లు ఉన్నంత మాత్రాన యూఎఫ్‌ఎంగా పరిగణించరు. వాటిలో ఒకదానితో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు.. ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్ నంబర్లు 011-40759000, 011-69227700ను సంప్రదించవచ్చు. లేదా jeemain@nta.ac.inకు ఈ-మెయిల్ పంపవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?