Share News

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య నియంత్రణకు సీఏక్యూఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:30 AM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో 500 మీటర్లు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న పాలంలో 800 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ కనిపించిందని శనివారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య నియంత్రణకు సీఏక్యూఎం కీలక ఆదేశాలు

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య నియంత్రణకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) కీలక ఆదేశాల జారీ చేసింది. నవంబర్‌లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఏక్యూఎం సూచించింది. నవంబర్ 5 నుంచి 20 వరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికే అనుమతి ఇవ్వనున్నారు. మిగిలిన 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో దుమ్ము వెలువడే కూల్చివేత పనులు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించనున్నారు. అయితే.. రైల్వే స్టేషన్లు, మెట్రో, విమానాశ్రయాలు, ఆసుపత్రులతో పాటు రక్షణ రంగం, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణ పనులతో పాటు విద్యుత్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్లు, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్టులకూ ఆంక్షలు వర్తించనున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రాం, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో ఆంక్షలను అమలు చేస్తారు.


ఇందిరా గాంధీ విమానాశ్రయంలో పొగమంచు

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఢిల్లీలో శనివారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో 500 మీటర్లు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న పాలంలో 800 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ కనిపించిందని శనివారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. శుక్రవారం ఇదే సమయానికి ఈ రెండు ప్రాంతాల్లో విజిబిలిటీ 4,000 మీటర్లుగా ఉంది. సఫ్దర్‌జంగ్‌లో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి విజిబిలిటీ 500 మీటర్ల వద్దే కొనసాగుతోంది. పాలంలో ఉదయం 5 గంటల నుంచి 800 మీటర్లుగా రికార్డైంది. విజిబిలిటీ 500 నుంచి 999 మీటర్ల మధ్య ఉంటే దానిని స్వల్ప స్థాయి పొగమంచుగా, 200 నుంచి 499 మీటర్ల మధ్య ఉంటే మోస్తరు పొగమంచుగా, 50 నుంచి 199 మీటర్ల మధ్య ఉంటే దట్టమైన పొగమంచుగా భావిస్తారు. 50 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే అతి దట్టమైన పొగమంచుగా వర్గీకరిస్తారు. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్‌లో విజిబిలీటీ 500 మీటర్లకు పడిపోయింది. మరింత తగ్గితే మోస్తరు పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.


వర్షంతో తగ్గిన కాలుష్యం

శుక్రవారం ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా గాలిలోని కాలుష్య కారకాలు తగ్గాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 60 గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఒక నివేదిక విడుదల చేసింది. గత నాలుగేళ్లలో అక్టోబర్‌లో ఇదే అత్యుత్తమ గాలి నాణ్యత. కాగా.. శనివారం ఉదయం 6 గంటలకు ఏక్యూఐ 95కు పెరిగింది. అయినప్పటికీ గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఉదయం నమోదైన 58 కేంద్రాల్లో 17 చోట్ల పీఎం2.5, నాలుగు చోట్ల పీఎం10 ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నట్లు సమాచారం. అక్టోబర్‌లో మొదటి 30 రోజులకు ఢిల్లీ సగటు ఏక్యూఐ 167గా నమోదైంది.


ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 10:01 AM