తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
ABN , Publish Date - Jun 27 , 2026 | 10:17 AM
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) (K. Bhagyaraj) ఈరోజు (శనివారం) ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

సినీ ప్రయాణం..
నటుడు, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భాగ్యరాజ్ తమిళ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. నటుడిగా సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను ‘వన్ మ్యాన్ స్టూడియో’గా అభివర్ణించేవారు. తనదైన కథన శైలి, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆయన తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా రచన, దర్శకత్వం వహించారు. 1983లో విడుదలైన ముంధనై ముడిచ్చు చిత్రానికి గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం..
భాగ్యరాజ్ తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, వెల్లన్ కోయిల్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతియమ్మ. 1981లో ప్రవీణను వివాహం చేసుకున్నారు. ఆమె 1983లో అనారోగ్యంతో మరణించారు. అనంతరం 1984లో నటి పూర్ణిమ భాగ్యరాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి శరణ్య భాగ్యరాజ్, శంతను భాగ్యరాజ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సినిమాలు
చిలిపి పెళ్లాం (1990)
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
మేం వయసుకు వచ్చాం (2012)
డిటెక్టివ్ (2017)
అల్లంత దూరాన (2023)
35 చిన్న కథ కాదు (2024)
కుబేర (2025)
సాహిత్య రంగంలో కూడా సేవలు..
భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన ‘భాగ్యవారపత్రిక’కు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ
వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News