Share News

మద్యం మత్తులో కన్నబిడ్డల ముందే భార్యను నరికి చంపిన భర్త

ABN , Publish Date - Jul 26 , 2026 | 07:15 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త.. 8 నెలల గర్భిణీ అయిన భార్యను అత్యంత ఘోరంగా నరికి చంపేశాడు. కన్న బిడ్డల ముందే భార్యను కడతేర్చాడు ఆ కసాయి భర్త.

 మద్యం మత్తులో కన్నబిడ్డల ముందే భార్యను నరికి చంపిన భర్త
Uttar Pradesh crime

ఉత్తరప్రదేశ్, జులై 26: రాష్ట్రంలోని మహోబా జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం, జూదానికి బానిసైన ఓ కసాయి భర్త.. 8 నెలల గర్భిణీ అయిన తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. కన్నబిడ్డల ముందే కొడవలితో భార్యను నరికి చంపేశాడు. పన్వారీ పోలీసు స్టేషన్ పరిధిలోని బిజ్రారీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


బిజ్రారీ అనే గ్రామంలో హనిఫ్ మన్సూరి, మనిషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, రెండెళ్ల కుమార్తె ఉన్నారు. మన్సూరి మద్యానికి, జూదానికి బానిసగా మారి.. ఇప్పటికే తనకున్న భూమిలో చాలా వరకు అమ్మేశాడు. అంతేకాక మద్యం తాగేందుకు డబ్బుల కోసం తరచూ మనిషాను వేధిస్తుండే వాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చిన మన్సూరి.. అక్కడ కూడా మరింతంగా మద్యం సేవించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మందు తాగొద్దని అతని భార్య మనీషా వారించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మన్సూరి కొడవలి తీసుకుని, ఎనిమిది నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి పొట్టనబెట్టుకున్నాడు. ఈ అఘాయిత్యం జరిగిన సమయంలో వారి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు.


నేరం నుంచి తప్పించుకునేందుకు మన్సూరి తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి ఒక కట్టుకథ అల్లాడు. అయితే, భయంతో వణికిపోతున్న ఐదేళ్ల పసిబాలుడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో నిందితుడి బాగోతం బట్టబయలైంది. పన్వారీ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. మృతురాలి కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తమ బిడ్డను మన్సూరి నిత్యం వేధింపులకు గురిచేసేవాడని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి సైతం తన కొడుకు చేసిన పాపానికి మరణశిక్ష విధించినా తప్పులేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 26 , 2026 | 07:47 PM