Share News

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:23 PM

అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రెండు రోజుల క్రితం గల్లంతైన అటవీశాఖ అధికారులు, సిబ్బంది కథ సుఖాంతమైంది. అధికారిక విధుల్లో భాగంగా అడవిలోకి వెళ్లిన 23 మంది అటవీ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు.

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు
Assam forest officials found safe

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రెండు రోజుల క్రితం గల్లంతైన అటవీశాఖ అధికారులు, సిబ్బంది కథ సుఖాంతమైంది. అధికారిక విధుల్లో భాగంగా అడవిలోకి వెళ్లిన 23 మంది అటవీ అధికారులు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా మొత్తం 26 మంది సురక్షితంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జయంత మల్లబారువా ఆదివారం అధికారికంగా వెల్లడించారు. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే...


దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో అధికారులు తరచూ పెట్రోలింగ్, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. అలానే ఈ 23 మంది అటవి అధికారుల బృందం కూడా శుక్రవారం పెట్రోలింగ్, కూంబింగ్ ఆపరేషన్లతో పాటు అధికారిక అటవీ సర్వే నిర్వహించేందుకు వెళ్లింది. అయితే ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడంతో ఉండటంతో శుక్రవారం నుంచి అధికారులతో వారికి సంబంధాలు తెగిపోయాయి. రెండు రోజుల పాటు సిబ్బంది ఆచూకీ లభించకపోవడంతో అటవీశాఖ ఉన్నతాధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం పెద్దఎత్తున గాలింపు చర్యలను చేపట్టింది.


కాగా, లాంగ్టింగ్ రేంజ్, మందర్‌దిసా రేంజ్, హాతిఖోలా రేంజ్, మైబోంగ్ రేంజ్‌లకు చెందిన ఈ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా అటవీ శాఖ మంత్రి జయంత మల్లబారువా తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, గాలింపు చర్యల ద్వారా బృందాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి చేర్చామని ఆయన వెల్లడించారు. సిబ్బంది అందరూ క్షేమంగా తిరిగిరావడంతో అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి:

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన అన్నా హజారే

Updated Date - Jul 26 , 2026 | 04:34 PM