Share News

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

ABN , Publish Date - Jul 26 , 2026 | 02:37 PM

పని మనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దని నగర వాసులకు హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక. గత రెండేళ్లలో నగరంలో 565 సర్వెంట్ థెప్ట్ కేసులు నమోదయ్యాయని, అందులో 65 గ్రేవ్, 500 నాన్, గ్రేవ్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
Hyderabad Police

హైదరాబాద్, జులై 26: నగరంలో ఇళ్లలో పనిచేసే వారి జరుగుతున్న దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పనిమనుషుల నియామకంలో యజమానుల అజాగ్రత్తే ఈ నేరాలకు ప్రధాన కారణమని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు. పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దని పోలీసులు సూచిస్తున్నారు. గడచిన రెండేళ్లలో నగరవ్యాప్తంగా దాదాపు 565 సర్వెంట్ థెఫ్ట్ కేసులు నమోదైనట్లు పోలీసుల విశ్లేషణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


నమోదైన మొత్తం కేసుల్లో 65 గ్రేవ్ (తీవ్రమైనవి) కాగా, 500 నాన్ గ్రేవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా ఉంటున్న విద్యార్థులు, వృద్ధులు ఎక్కువగా ఈ ముఠాల బారిన పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జోన్ల వారీగా పరిశీలిస్తే జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్‌లో 88, ఖైరతాబాద్‌లో 77, గోల్కొండలో 70, రాజేంద్రనగర్‌లో 63, శంషాబాద్‌లో 49, చార్మినార్ జోన్‌లో 45 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు, విదేశీ మూలాలున్న ముఠాలు పనిమనుషులుగా ఇళ్లలోకి ప్రవేశించి విలువైన ఆస్తులను దోచుకెళ్తున్నట్లు తేలింది.


ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పనిమనుషులను నియమించుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని, వారి ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, ఫొటో, గతంలో పనిచేసిన ప్రదేశాల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కోరారు. నెల రోజుల పాటు వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ఎంట్రీ రిజిస్టర్లు, పాస్ సిస్టమ్, సీసీ కెమెరాలు విధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా లేదా పనిమనిషి అకస్మాత్తుగా కనిపించకుండా పోయినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్త : సీపీ సజ్జనార్

విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం: ఎంపీ డీకే అరుణ

Updated Date - Jul 26 , 2026 | 02:37 PM