Share News

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్త : సీపీ సజ్జనార్

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:23 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఈఎండీ ప్రక్రియ నేపథ్యంలో సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ కాల్స్, లింకులు, వెబ్‌సైట్ల ద్వారా మోసగాళ్లు డబ్బులు కాజేసే అవకాశముందని ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్త : సీపీ సజ్జనార్
Indiramma Illu

హైదరాబాద్, జులై 26: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందస్తు డిపాజిట్ (EMD) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రూ.10 వేల ఈఎండీ చెల్లిస్తే ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నామని చెబుతూ వచ్చే ఫోన్ కాల్స్‌ను ఏమాత్రం నమ్మొద్దని సూచించారు. "ఈ రోజే చివరి తేదీ", "వెంటనే డబ్బులు చెల్లించకపోతే అవకాశం కోల్పోతారు" అంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అప్రమత్తం చేశారు.


మోసపోతే.. వెంటనే 1930కు ఫోన్ చేయండి..

వాట్సాప్ ద్వారా వచ్చే అపరిచిత లింకులు, APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయొద్దని సీపీ సూచించారు. ప్రభుత్వ పోర్టళ్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి ప్రజల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. AnyDesk, TeamViewer వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను అపరిచితుల సూచన మేరకు ఇన్‌స్టాల్ చేయరాదని హెచ్చరించారు. రీఫండ్ పేరుతో ఎవరూ UPI పిన్, OTP లేదా బ్యాంక్ వివరాలు అడగరని స్పష్టం చేశారు. ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత

జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట

Updated Date - Jul 26 , 2026 | 12:01 PM