Share News

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చివరికి కథ సుఖాంతం..

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:44 PM

హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికల అదృశ్యం కేసులో సికింద్రాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ముగ్గురు చిన్నారులు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని చాకచక్యంగా కాపాడారు.

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చివరికి కథ సుఖాంతం..
DCP Rakshita Krishnamurthy

హైదరాబాద్: దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికల అదృశ్యం కేసులో సికింద్రాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ముగ్గురు చిన్నారులు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని చాకచక్యంగా కాపాడారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ సఖీ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. తల్లిదండ్రులు తరచూ గొడవల పడటంతోనే బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు.


సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 19న దోమలగూడకు చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. వారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి బాలికల కదలికలను గుర్తించినట్లు వెల్లడించారు. హిమాయత్‌నగర్‌లో ఆ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఆటో ఎక్కి కాచిగూడకు చేరుకున్న బాలికలు.. అక్కడి నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-8 వద్దకు వెళ్లారని తెలిపారు. అనంతరం 6వ ప్లాట్‌ఫామ్‌పై సుమారు 10 నిమిషాల పాటు ఉన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత రైల్వే ట్రాక్ దాటి జేమ్స్ స్ట్రీట్ వైపు వెళ్లి లోకల్ రైలులో ప్రయాణించినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించామని డీసీపీ చెప్పారు.


ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాన్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఛత్తీస్‌గఢ్‌లోని ధంకేర్ జిల్లాకు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ వివరించారు. అక్కడ పరిచయం ఉన్న ఓ వ్యక్తి వద్ద బాలికలు ఆశ్రయం పొందారని, పని ఇప్పించాలని అతడిని కోరడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిపారు. దీంతో తెలంగాణ పోలీసులు, అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుని బాలికలను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం వారిని సఖీ భరోసా సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్‌తో పాటు ఇతర చట్టపరమైన ప్రక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం మరో రెండ్రోజుల్లో బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని డీసీపీ చెప్పారు.


2024లో ఈ కుటుంబం దోమలగూడకు వచ్చి నివాసం ఉంటోందని వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి.. బాలికల వాంగ్మూలం ప్రకారం తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవల కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్త : సీపీ సజ్జనార్

విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం: ఎంపీ డీకే అరుణ

Updated Date - Jul 26 , 2026 | 01:57 PM